
బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ను కోల్కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని వైద్యులు స్పష్టం చేశారు. గంగూలీకి వచ్చింది పెద్ద సమస్యేమీ కాదని, సహజంగా వ్యక్తులు ఏదో ఒక సమయంలో కరోనరీ ఆర్టెరీ బ్లాకేజ్’ సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారని వైద్యులు పేర్కొన్నారు. గంగూలీది పెద్ద సమస్య కాదని, సరైన సమయంలోనే ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. అయితే మంగళవారం రాత్రి నుంచే గంగూలీ అస్వస్థతతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 2 న గంగూలీకి స్వల్పంగా గుండెపోటు రావడంతో వుడ్ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ వేశారు. పూర్తి ఫిట్నెస్ తో ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాతే గంగూలీని వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. అయితే ఆయనకు మరో రెండు బ్లాక్స్ ఉన్నాయని, వాటిని త్వరలోనే యాంజియె ప్టాస్టీ నిర్వహిస్తామని వైద్యులు అప్పుడే తెలిపారు.