
చెలరేగిన హింసను ఎవరూ సమర్థించరు: శరద్ పవార్
ఢిల్లీ వేదికగా జరిగిన పరిణామాలపై ఎన్సీపీ ఐధినేత శరద్ పవార్ స్పందించారు. ఢిల్లీ వేదికగా జరిగిన పరిణామాలను ఎవరూ సమర్థించరని స్పష్టంచేశారు. అయితే ఆ పరిణామాల వెనకున్న గల కారణాలను మాత్రం విస్మరించలేమన్నారు. ప్రశాంతంగా ఉన్న రైతుల్లో కోపం బాగా పెరిగిందని, కేంద్రం కూడా తన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కేంద్రం పరిణతితో ఆలోచించి, తగు నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. పంజాబ్, హర్యానా రైతులు క్రమశిక్షణతోనే నిరసన చేపట్టారని, అయితే కేంద్రమే ఆ నిరసనను సీరియస్ గా పరిగణించలేదని విమర్శించారు. రైతుల సంయమనం ముగిసిందని, అందుకే ట్రాక్టర్ ర్యాలీని చేపట్టారని అన్నారు. అయితే శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని, ఈ విషయంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు.
వెనక్కి వచ్చేయండి : పంజాబ్ సీఎం....
రైతులు వెంటనే ఢిల్లీని విడిచిపెట్టాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. ఢిల్లీ పొలిమేరల్లో రైతులు శాంతియుతంగా చేస్తున్న నిరసనల వద్దకు చేరుకోవాలని సూచించారు. "ఢిల్లీ పరిణామాలను చూసి షాకింగ్ ఘటనలు జరిగాయి. హింస ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. ఉన్న సద్భావనను ఇలాంటి సంఘటనలు చెడగొడతాయి. ట్రాక్టర్ ర్యాలీ నుంచి రైతులు వెనక్కి రావాలి. స్వచ్ఛందంగా వెనక్కి మరలాలి. మీరంతా నిజమైన రైతులు. వెంటనే ఢిల్లీని విడిచిపెట్టండి. సరిహద్దులకు వెళ్ళండి." అని సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.
అత్యంత దురదృష్టకరం : థరూర్
ఢిల్లీ ఎర్రకోటపై రైతు జెండా ఎగరడంపై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. అలా జరగడం దురదృష్టకరం అని ట్వీట్ చేశారు. "ఎర్రకోటపై రైతు జెండా ఎగరడం దురదృష్టకరం. మొదటి నుంచీ నేను ఉద్యమానికి మద్దతిస్తున్నా. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై పరమ పవిత్రమైన జాతీయ జెండాయే ఎగరాలి. ఈ అన్యాయాన్ని క్షమించలేను." అని థరూర్ ట్వీట్ చేశారు.
ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదు: శివసేన నేత ప్రియాంక చతుర్వేది
ఢిల్లీలో జరిగిన ఘటనపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ఎర్రకోట వద్ద ఇబ్బందికర పరిస్థితులు కనిపించాయి. త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి హింసకూ తావులేదు. చట్టమే అత్యున్నతమైంది. ఒకరు ఓడినట్లు కాదు. ఒకరుగెలిచినట్లూ కాదు." అని ప్రియాంక చౌదరి ట్వీట్ చేశారు.
రైతుల మాట చివరి వరకూ వినలేదు : రౌత్ ఫైర్...
రైతుల మాట కేంద్రం చివరి వరకూ వినలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈ రోజు కోసమే ప్రభుత్వం ఎదిరిచూసిందని తీవ్రంగా ఆరోపించారు. మన దేశంలో ఎలాంటి ప్రజాస్వామ్యం నడుస్తుందో చూడాలని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యమే కాదని,, ఇంకా ఏదో నడుస్తోందని రౌత్ ట్వీట్ చేశారు.