ఉద్యమంలోకి ఇతరులు చొరబడ్డారు : రైతు నేత టికాయత్.....

tikait allegations

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. అంతేకాకుండా రైతులు ప్రకటించిన రూట్ కాకుండా వేరే రూట్ ద్వారా ఎర్రకోటకు చేరుకున్నారు. ఎర్రకోటపై రైతు జెండాను ఎగరేశారు. అంతే కాకుండా రైతులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ కూడా తలెత్తింది. ఈ పరిణామాలపై రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ర్యాలీలోకి ఇతరులు చొరబడ్డారని ప్రకటించారు. తమ ట్రాక్టర్ ర్యాలీని విఫలం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల నేతలు తమ ఉద్యమంలోకి చొరబడి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. విధ్వంసానికి పాల్పడ్డవారు తమవారు కాదని, బయటివారని ఆయన అన్నారు. శాంతియుతంగా నడుస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన హింసను తాము ఖండిస్తున్నామని టికాయత్ పేర్కొన్నారు.

హింసను ఖండిస్తున్నాం : ఆప్

నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసను ఖండిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. రైతు ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. గత రెండు నెలలుగా ఉద్యమం శాంతియుతంగా నడుస్తోందని ఆప్ పేర్కొంది. పరిస్థితి ఇంతలా చేజారడానికి కేంద్రం వైఖరే కారణమని మండిపడింది. బయటి వ్యక్తులు ఉద్యమంలోకి చొరబడ్డారని, శాంతి భద్రతలను అదుపు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది.

 


                    Advertise with us !!!