గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ ప్రసంగం

telangana-governor-tamilisai-speech-at-republic-day-celebration

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ప్రత్యేక ముద్ర వేసుకోవడం మనందరికీ గర్వకారణం. భారతదేశం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలవడం స్ఫూర్తి దాయకం. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటానికి నాయకత్వం వహించిన ఉద్యమ నాయకుడికే, ప్రజలు ఈ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యతలు అప్పగించడం వల్ల తెలంగాణ దృష్టికోణంలో పాలన సాగుతున్నది. గడిచిన ఆరున్నరేళ్లలో పద్ధతి ప్రకారం జరిగిన కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది.

కోవిడ్ - వ్యాక్సినేషన్  

2020 ఏడాదంతా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంలో కష్టంగా గడిచిపోయింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో 2021 సంవత్సరాన్ని మనమంతా ఎంతో ఆశావహ దృక్పథంతో ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా నిర్దేశించిన ప్రాధాన్యతా క్రమంలో విజయవంతంగా సాగుతున్నది.

గౌరవ నీయమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ను సందర్శించి, కోవాగ్జిన్ ను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని స్వయంగా సమీక్షించడం గొప్ప ప్రేరణను అందించడంతో పాటు, ప్రక్రియను వేగవంతం చేసింది.

కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా సాధారణ జన జీవనం అస్తవ్యస్తమయిన గడ్డు స్థితిలో, తెలంగాణ ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి కోవిడ్ వ్యాప్తిని, ప్రభావాన్ని, ప్రాణనష్టాన్ని మన రాష్ట్రంలో గణనీయంగా అరికట్టగలిగింది. ప్రజలందరి సంపూర్ణ సహకారం, భాగస్వామ్యంతో లాక్ డౌన్ ను కట్టదిట్టంగా అమలు చేయడం, కరోనా వ్యాప్తిని అరికట్టడం, రోగులకు సకాలంలో సరైన వైద్యం అందించడం సాధ్యమయింది.

రాష్ట్రంలో ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం కోసం ప్రభుత్వం మండలస్థాయిలో టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికి వరకు 75 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది. దేశంలో ప్రతీ పది లక్షల మందిలో లక్షా 39 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల మందికి పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి జాతీయ సగటు 2 శాతం అయితే, తెలంగాణలో 0.9 శాతంగా నమోదవుతున్నది. కోవిడ్ సోకి కోలుకున్న వారి జాతీయ సగటు 96.6 శాతం అయితే, తెలంగాణ రాష్ట్రంలో రికవరీ రేటు 98.02 శాతం.  కోవిడ్ సోకిన వారిలో మరణాలు జాతీయ స్థాయిలో 1.4 శాతం ఉంటే, తెలంగాణలో అది కేవలం 0.54 శాతం మాత్రమే.

కరోనా కష్టకాలంలో ధైర్యంగా ముందుండి సేవలు అందించడమే కాకుండా, నేడు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా తమ భుజాన వేసుకుని నడిపిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని, రేయింబవళ్లు సేవలందించిన పోలీసులను, పారిశుద్య కార్మికులను, ఇతర ఉద్యోగులను, స్వచ్చంద కార్యకర్తలను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అత్యంత మానవీయ దృక్పథంతో అనేక చర్యలు తీసుకున్నది. ప్రతీ పేద కుటుంబానికి నెలకు 12 కిలోల బియ్యాన్ని, 1500 నగదును ప్రభుత్వం ఉచితంగా అందించి, ప్రభుత్వం వారి ఆకలి బాధను తీర్చింది. అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచిత భోజనం అందించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు, కార్మికులను ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి, తమ స్వంత రాష్ట్రాలకు పంపింది.

లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 52 వేల కోట్ల ఆదాయం తగ్గింది. ఈ తగ్గుదల బడ్జెట్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆదాయం తగ్గినప్పటికీ పేదల సంక్షేమానికి చేసే ఖర్చులో ప్రభుత్వం ఒక్క నయాపైసా కూడా కోత విధించలేదు. ప్రజలకు జీవన భద్రత కల్పించే ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్స్, ఆరు కిలోల బియ్యం లాంటి పథకాలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించి, పేదలకు సాయం అందించింది. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకుని జీవించే వారికి అందించే సహాయ సహకారాలను ప్రభుత్వం యథా ప్రకారం కొనసాగించింది. కరోనా కారణంగా చివరి దశలో ఆగిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే తిరిగి ప్రారంభించింది. లాక్ డౌన్ వల్ల మార్కెట్లు బంద్ కావడంతో రైతులు నష్టపోవద్దనే మానవీయ కోణంలో ఆలోచించిన ప్రభుత్వం, గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటల కొనుగోలు చేపట్టింది.

పల్లె ప్రగతి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయితే, దేశంలోనే  గొప్ప రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందని ఉద్యమ సమయంలో మన నాయకులు పదే పదే చెప్పేవారు.  ఇప్పుడు ఆ మాట అక్షరాలా నిజమయింది. దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోగలుగుతున్నాం. మౌలిక వసతులను పెంపొందించడం ద్వారా తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం సాధ్యమవుతున్నది. రాష్ట్రంలోని ఏ పల్లెకు పోయి చూసినా, మారిన పరిస్థితి మన కళ్ల ముందు కనిపిస్తుంది. పల్లె సీమల రూపురేఖలు మార్చాలనే మహదాశయంతో ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం నమ్మశక్యం కాని అద్భుత ఫలితాలు అందించింది. నేడు తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపాంతరం చెందాయి.  

తెలంగాణ ఏర్పడిన నాడు  రాష్ట్రంలో కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే సొంతంగా ట్రాక్టర్లు ఉండేవి. కానీ, నేడు మొత్తం 12,765 గ్రామ పంచాయతీలకు ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన సొంత ట్రాక్టర్లు సమకూరాయి. తెలంగాణ పంచాయతీల ప్రగతి ప్రస్థానం ఎక్కడ నుండి ఎక్కడికి పోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అటు పచ్చదనం, ఇటు పరిశుభ్రత వెల్లివిరియడంతో తెలంగాణ పల్లెలు పండుగశోభను సంతరించుకుంటున్నాయి. గతంలో అడవులు నరకడమే తప్ప పెంచడమనే మాటేలేదు. కానీ నేడు తెలంగాణ పల్లెల్లో పోయిన పచ్చదనం తిరిగి చిగుర్లు వేస్తున్నది. గ్రామాల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించే పనులు ఎంతో బాధ్యతగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాటిన వాటిలో 91శాతం మొక్కలు బతికి చెట్లుగా మారి సేద తీరుస్తున్నాయి. ఎక్కడికి పోయినా పచ్చని చెట్లు, చల్లటి గాలులు పలకరిస్తున్నాయి. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటైంది. గతంలో కేవలం పట్టణ ప్రాంతాల్లో, అదీ చాలా తక్కువ సంఖ్యలో పార్కులుండేవి. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఆవాస ప్రాంతానికీ ఒక పార్కు సమకూరుతున్నది. రాష్ట్రంలోని 19,470 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాల పేరుతో పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పార్కుల కోసం 19,027 చోట్ల ప్రభుత్వం స్థలాలను గుర్తించింది. 15,646 చోట్ల మొక్కలు నాటడం పూర్తయింది. మిగతా చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై శ్రమదానంతో గ్రామంలో పిచ్చిచెట్లను తొలగించుకున్నారు. మురికి గుంటలను, పాడుబడిన బావులను, ఉపయోగంలో లేని బోర్లను పూడ్చుకున్నారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకున్నారు. గ్రామంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా పల్లెలను అద్దంలా తీర్చిదిద్దుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త విసర్జన శాస్త్రీయ పద్ధతుల్లో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతున్నది. 91శాతం పనులు పూర్తయ్యాయి. 9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారీ కూడా జరుగుతున్నది.

ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనేది ఇదివరకు ఓ విషమ పరీక్షగా మిగిలేది. ముఖ్యంగా సొంత స్థలం లేని వారు పడే బాధలు వర్ణణాతీతం. ఈ దుస్థితిని నివారించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఖచ్చితంగా వైకుంఠధామం నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం జరుగుతున్నది. రైతులు కూర్చొని వ్యవసాయం గురించి పరస్పరం చర్చించుకోవడానికి గతంలో ఓ ఉమ్మడి స్థలం లేదు.  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్లస్టర్ కు ఒకటి చొప్పున రైతుల కోసం రైతు వేదికలను నిర్మిస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 2,601 చోట్ల రైతు వేదికలు నిర్మాణం ప్రారంభం కాగా, ఇప్పటికే 2,580 చోట్ల నిర్మాణం పూర్తయింది. రైతులు తమ పంటలను ఎండబెట్టడానికి, నూర్పడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడత 93,875 చోట్ల కల్లాల నిర్మాణం ప్రారంభమైంది. గతంలో గ్రామ పంచాయతీలు కరంటు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ సంస్థలకు భారీ మొత్తంలో బకాయిలు పడాల్సిన పరిస్థితి ఉండేది. బకాయిలు పేరుకుపోవడంతో గ్రామాలకు కరెంటు సరఫరా నిలిపివేసిన చీకటి రోజులను కూడా మనం చూశాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా గ్రామ పంచాయతీలు కరంటు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నవి. ప్రతినెలా 308 కోట్ల రూపాయల చొప్పున గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నది. కరోనా కష్టకాలంలో నిధుల కొరత ఏర్పడినప్పటికీ గ్రామ పంచాయతీ నిధులను మాత్రం ఒక్క నయా పైసా కూడా ఆపకుండా విడుదల చేస్తూ, గ్రామీణాభివృద్ధి పట్ల ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకున్నది. నిధుల లేమి అనే బాధ తీరడం వల్ల గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. గతంలో అపరిశుభ్ర పరిసరాల కారణంగా దోమలు వ్యాపించి, ప్రతీ వర్షాకాలంలో పల్లెల్లో డెంగ్యూ, మలేరియా తదితర రోగాలు విజృంభిచేవి. కానీ నేడు పల్లెలు పరిశుభ్రంగా మారడం వల్ల, ఆ రోగాలు జాడ లేకుండా పోయాయి.

ప్రతీ గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా మార్చాలనే లక్ష్యాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం సాధించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మార్చినందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందించడం మనందరికీ దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతటి పచ్చదనం-పరిశుభ్రదత, ఇన్నిరకాల సౌకర్యాలు- సదుపాయాలు కలిగిన రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరొకటి లేదని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్న పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు, సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ కమిటీల సభ్యులు, గ్రామ కార్యదర్శులు, భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా హృదయ పూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను.  

పట్టణ ప్రగతి

తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్నది. పట్టణాలు కాలుష్య కాసారాలుగా మారకుండా, అత్యంత నివాసయోగ్యంగా మార్చేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు చేస్తున్నది. అన్ని మున్సిపాలిటీల్లో పచ్చదనం – పరిశుభ్రత పెంచడానికి తీసుకుంటున్న చర్యలు,  ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పట్టణాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రతీ యేటా రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నది. జిహెచ్ఎంసి, ఇతర కార్పొరేషన్లకు అదనంగా నిధులు కేటాయిస్తున్నది.

రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 2,802 సానిటేషన్ వెహికిల్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో 2,004 సానిటేషన్ వెహికిల్స్ ను సమకూరుస్తున్నది. దీంతో మొత్తం 4,806 సానిటేషన్ వెహికిల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతున్నది. పట్టణ ప్రాంతాల్లో 1,018 నర్సరీలను, జిహెచ్ఎంసి లో 500 నర్సరీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని పట్టణాల్లో ఒక లక్ష జనాభాకు ఒక స్మశానవాటిక ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం వైకుంఠ ధామాల నిర్మాణం చేస్తున్నది. రాష్ట్రంలోని 116 పట్టణాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ (సమీకృత) మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నది. జనాభా ఎక్కువ కలిగిన పట్టణాల్లో అదనంగా మార్కెట్లను నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమీకృత మార్కెట్ల నిర్మాణానికి 2021-22 బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు పడే ఇబ్బందులు తీర్చడం కోసం పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.  ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగిస్తున్నది. పట్టణ ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయాలని  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 చోట్ల అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి జరుగుతున్నది. పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతుల విధానాన్ని సరళతరం చేయడానికి ప్రభుత్వం బి పాస్ చట్టం తీసుకొచ్చింది. స్వీయ దృవీకరణతో అత్యంత పారదర్శకంగా, అవినీతికి-జాప్యానికి ఆస్కారం లేకుండా అనుమతులు లభిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో ప్రభుత్వం ప్రతీ ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తున్నది. దీని వల్ల 97 శాతం మంది పట్టణ వాసులు ఉచితంగా సురక్షిత మంచినీటి సౌకర్యం పొందగలుగుతున్నారు.

పాలనా సంస్కరణలు

ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందడం కోసం, ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవినీతికి- కాలయాపనకు అవకాశం లేకుండా చేయడం కోసం ప్రభుత్వం అనేక పాలనా సంస్కరణలను అమలు చేస్తున్నది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, కొత్త రెవెన్యూ చట్టాలను తెచ్చింది. పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు, రెవెన్యూ డివిజన్లను 43 నుంచి 74కు, మండలాలను 459 నుంచి 593కు, మున్సిపల్ కార్పొరేషన్లను 6 నుంచి 13కు, గ్రామ పంచాయతీలను 8,690 నుంచి 12,765కి పెంచింది. తెలంగాణ దృక్పథంతో ఆలోచించి, ప్రభుత్వ శాఖలను పునర్వ్యవస్థీకరించింది. జిల్లా కేంద్రాలు సమీపంలో ఉండడం వల్ల ప్రజలకు దూరభారాలు తగ్గాయి. పాలనా విభాగాల పరిధి పరిమితంగా ఉండడంతో అధికారులకు పర్యవేక్షణ సులభమయి, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతున్నది.

ధరణి పోర్టల్

వ్యవసాయ భూముల యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత ఇవ్వడం కోసం, క్రయ-విక్రయాలు పారదర్శకంగా జరగడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన రెవెన్యూ సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సంతోషంగా ప్రకటిస్తున్నాను. వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణ కోసం తెచ్చిన ధరణి పోర్టల్ నూటికి నూరు శాతం విజయవంతమైంది. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రయ విక్రయాలను నిమిషాల్లో జరుపుకోగలుగుతున్నారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నడుస్తున్నది. వ్యవసాయ భూములకు సంబంధించిన ఎలాంటి వివాదాలు, అస్పష్టతలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నది.

వ్యవసాయం

సమైక్య పాలకుల నిర్లక్ష్యం, పక్షపాతం కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ రంగ విధానాలు, పథకాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. దశాబ్దాల తరబడి తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. మానవ నిర్మిత అద్భుతంగా, ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా ప్రఖ్యాతి పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీరందడం ప్రారంభమయింది. పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయడం ద్వారా దాదాపు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రధాన చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీని ఫలితంగా తెలంగాణలో భూగర్భ జలమట్టం సుమారు 4 మీటర్ల మేర పెరిగాయి. రైతులకు 24 గంటల పాటు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల పంపుసెట్ల కింద పుష్కలంగా పంటలు పండుతున్నాయి.

రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగిన కారణంగా కోటిన్నర ఎకరాల్లో రైతులు బంగారు పంటలు పండించగలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరంలో కేవలం 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట పండించగలిగితే, నేడు కోటి 4 లక్షల ఎకరాల్లో వరి పంట పండుతుండడం మారిన పరిస్థితికి అద్దం పడుతున్నది. సాగు విస్తీర్ణం పెరిగిన కారణంగా తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికి అన్నపూర్ణగా మారింది. గత ఏడాది రబీ సీజన్ లో భారత ఆహార సంస్థ దేశ వ్యాప్తంగా కోటి 15 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, అందులో 64 లక్షల టన్నులు అంటే 55 శాతం తెలంగాణ నుంచి సేకరించినవే కావడం మన రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరిందని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం.

దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని కరోనా సమయంలో కూడా ప్రభుత్వం యథావిధిగా కొనసాగించింది. ఎండాకాలం పంటల కోసం 60 లక్షల మంది రైతులకు చెందిన కోటి 47 లక్షల ఎకరాలకు సంబంధించి, మొత్తం 7351 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటి దాకా అందించింది.

కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండే రైతు మరణిస్తే ఆ కుటుంబం అగాధంలో కూరుకుపోకుండా అండనిచ్చేందుకు ప్రభుత్వం ‘రైతుబీమా’ పథకాన్ని అమలు చేస్తున్నది. మరణించిన రైతు కుటుంబానికి కేవలం పదిరోజుల్లోపే 5 లక్షల రూపాయల బీమా సొమ్ము ఎల్.ఐ.సి. ద్వారా అందుతున్నది. పథకం ప్రారంభించిన నాడు ఏడాది కిస్తీ 630 కోట్ల రూపాయలు ఉంటే, నేడు అది 1,141 కోట్లకు చేరింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆర్థిక భారానికి నెరవకుండా రైతు కుటుంబాల జీవన భద్రతను దృష్టిలో పెట్టుకుని మొత్తం కిస్తీ చెల్లించి రైతుబీమా పథకాన్నిఅమలు చేస్తున్నది. ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న మానవీయ దృక్పథానికి ఇది నిదర్శనం.

వ్యవసాయాభివృద్ధి- రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ప్రతీ సీజన్ లో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తున్నది. కల్తీలు, నకిలీలకు పాల్పడే దుర్మార్గుల పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించడం వల్ల రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుతున్నాయి. 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందించింది. 80 నుంచి 100 శాతం వరకు సబ్సిడీలు ఇచ్చి, మైక్రో ఇరిగేషన్ సాగును పెంచుతున్నది.

ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం నేడు గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారింది. వ్యవసాయం దండుగ అనే దుస్థితి నుంచి వ్యవసాయం పండుగ అనే సంతృప్త స్థాయి దిశగా తెలంగాణ ప్రస్థానం సాగుతున్నది.

విద్యుత్ రంగం

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ నేల చీకటి మయమవుతుందన్న శాపనార్థాలను పటాపంచలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రం నేడు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నది. విద్యుత్ రంగంలో సాధించిన అనితర సాధ్యమైన విజయాలు తెలంగాణ ప్రజల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురావడమే కాకుండా, తెలంగాణ ప్రభుత్వ పాలనా సామర్థ్యానికి గీటురాయిగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు అన్ని రంగాల్లో, అన్ని చోట్లా గంటల తరబడి విద్యుత్ కోతలు ఉండేవి. పరిశ్రమలకు పవర్ హాలిడేలు అమలయ్యేవి. అలాంటి దుస్థితి నుంచి నేడు అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సగర్వంగా నిలిచింది. తెలంగాణ ఏర్పడిన నాడు స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,888 మెగావాట్లు మాత్రమే ఉంటే, నేడు 16,245 మెగావాట్లకు చేరింది. ప్రగతి సూచికల్లో ప్రధానమైన తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. తెలంగాణ ఏర్పడిన నాడు తలసరి విద్యుత్ వినియోగం కేవలం 1,356 మెగావాట్లు ఉంటే, నేడు 2071కి చేరింది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 1208 మెగావాట్లుంటే, తెలంగాణ రాష్ట్రంలో అంతకంటే 58 శాతం అధికంగా ఉండడం విద్యుత్ రంగంలో మనం దూసుకుపోతున్నామనడానికి ప్రబల నిదర్శనం. విద్యుత్ సరఫరా, పంపిణీలో నష్టాలను తెలంగాణ రాష్ట్రం 2.41 శాతానికి తగ్గించుకుని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని సంతోషంగా ప్రకటిస్తున్నాను. కాలుష్యాన్ని తగ్గించే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలోనూ మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ ఏర్పడిన నాడు కేవలం 74 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే, నేడది 3,741కి చేరింది. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సిఈఈడబ్ల్యు) ప్రకటించడం విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలకు అంతర్జాతీయ స్థాయిలో దక్కిన ప్రశంస.

మిషన్ భగీరథ

యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచే మిషన్ భగీరథ పథకం రాష్ట్రంలో మంచినీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసింది. రాష్ట్రంలోని 23,968 ఆవాస ప్రాంతాలకు నేడు సురక్షిత మంచినీరు ప్రతి రోజు అందుతున్నది. 98.46 శాతం ఇండ్లకు నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తూ తెలంగాణ రాష్ట్రం గొప్ప విజయం సాధించిందని కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ప్రకటించడం మనం సాధించిన ఘనతకు దక్కిన గుర్తింపు.

ప్రజారోగ్యం

పేదలకు ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ వైద్యశాలలను మెరుగు పరచడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మొదలుకుని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కావాల్సిన వసతులు కల్పించింది. అన్ని రకాల వైద్య పరికరాలను సమకూర్చింది. వైద్యశాల యూనిట్ గా బడ్జెట్ కేటాయించి, ఖర్చు చేస్తున్నది. కేసీఆర్ కిట్ పథకం గర్భిణీలకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు, ప్రసవ సమయంలో జరిగే మరణాలు గణనీయంగా తగ్గించగలిగింది. గర్భిణీల మరణాలు రేటు 90 నుంచి 76 శాతానికి తగ్గాయి. శిశుమరణాలు 35 నుంచి 29 శాతానికి తగ్గాయి. వ్యాధి ప్రజారోగ్యంపై ప్రజలకు నమ్మకం కుదిరిన ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య 30 శాతం వరకు పెరిగింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు పేదప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ సెంటర్లు, డయాగ్నిస్టిక్ సెంటర్లు, ఐసీయులు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో పదివేల బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించబడింది. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా మూడో స్థానంలో నిలిచిందని నీతిఆయోగ్ ప్రకటించడం వైద్యరంగంలో సాధించిన పురోగతికి నిదర్శనం.   

విద్య

లాక్ డౌన్ వల్ల విద్యాసంస్థలను మూసి వేయాల్సి వచ్చినప్పటికీ,  రాష్ట్రంలోని ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే వివిధ పోటీ పరీక్షలకు తెలంగాణ విద్యార్థులందరూ అర్హత సాధించే విధంగా పరీక్షల విధానాన్ని, విద్యా సంవత్సరాన్ని రూపొందించి, అమలు చేయడం జరిగింది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా, ఇతర సాధనాల ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించి విద్యాబోధన చేయడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం కోసం జరిగే పోటీ పరీక్షలకు, ఎంట్రెన్స్ టెస్టులకు సిద్ధం చేసే విధంగా 9 నుంచి ఆపై క్లాసుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం శుభ్రపరిచి, సిద్ధం చేస్తున్నది.

తెలంగాణకు హరితహారం

సమస్త జీవకోటి మనుగడకు వాతావరణ సమతుల్యత అత్యంత ఆవశ్యం. భూగోళంపై 33 శాతం పచ్చదనం ఉంటేనే ప్రకృతి పదిలంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో అడవులు అంతరించాయి, పచ్చదనం తగ్గింది. ప్రకృతి ప్రసాదించే ప్రశాంతత కరువైంది. పోయిన అడవిని, దాంతో పాటే ప్రశాంత జీవనాన్ని పునరుద్ధరించాలనే సమున్నత ఆశయంతో ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలనే స్పృహను ప్రతీ ఒక్కరిలో కల్పించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు మొక్కలను సంరక్షించే బాధ్యతను అప్పగించింది. హరితహారం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 210.68 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,768 చోట్ల నర్సరీలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా అవసరమైన మొక్కలు పంపిణీ చేయడం జరుగుతున్నది. గ్రామ పంచాయతీల ద్వారా ప్రతీ ఇంటికి 6 చొప్పున పండ్ల మొక్కలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది.

‘జంగిల్ బచావో - జంగిల్ బడావో’ నినాదంతో అటవీభూముల్లో పోయిన అడవిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. రాష్ట్రంలో 43,276 హెక్టార్ల అడవిలో మొక్కలు పెంచుతున్నారు. కలప అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం స్మగ్లర్లపై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేసి, కఠినంగా వ్యవహరిస్తున్నది.

ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం మన కృషి ఫలిస్తున్నదని చెప్పడానికి నిదర్శనం.

పారిశ్రామికాభివృద్ధి

దేశ వ్యాప్తంగా ప్రశంసలు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన టిఎస్ ఐపాస్ విధానం తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. యువతకు ఉపాధి, రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే పరిశ్రమలు పెద్ద సంఖ్యలో తెలంగాణకు తరలి వస్తున్నాయి. టిఎస్ ఐపాస్ చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రానికి కొత్తగా 14,338 పరిశ్రమలు వచ్చాయి. 14,59,639 మందికి ఉద్యోగ అవకాశం లభించింది.

ఐటి

ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోత్సాహక ఐటి విధానం వల్ల విశ్వ విఖ్యాత ఐటి కంపెనీలు తెలంగాణలో కార్యాలయాలు ప్రారంభించాయి. తమ కార్యకలాపాలకు, డాటా భద్రతకు అత్యంత సురక్షిత ప్రాంతంగా హైదరాబాద్ నగరాన్ని ఐటి కంపెనీలు ఎంచుకుంటున్నాయి. కేవలం ఒక్క అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ నే హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు సాగించడానికి ఏకంగా 20,761 కోట్ల రూపాయల పెట్టుబడితో డాటా సెంటర్ రీజియన్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. మైక్రో సాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్ లాంటి బహుళజాతి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ లో తమ కార్యాలయ ప్రాంగణాలను ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్ లోనే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటి హబ్ లను ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ ఏర్పడిన నాడు ఏడాదికి 66,276 కోట్ల రూపాయల విలువైన ఐటి ఎగుమతులు ఉండేవి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐటి ఎగుమతుల విలువ 1,28,807 కోట్ల రూపాయలకు చేరింది. ఐటి రంగంలో 5,82,126 మందికి ఉద్యోగాలు లభించాయి.  

హైదరాబాద్ లో అభివృద్ధి

దేశంలోని అతి ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ ను సానుకూలంగా మార్చుకుని రేయింబవళ్లు పని కొనసాగించి, హైదరాబాద్ నరగంలో రోడ్లు, వంతెనల నిర్మాణాలను ప్రభుత్వం పూర్తి చేసింది. దాదాపు 250 కిలోమీటర్ల మేర బి.టి రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద చేపట్టిన పనులను ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తున్నది. ఎస్.ఆర్.డి.పి. మొదటి దశలో భాగంగా 26 ప్రధాన రోడ్లను విస్తరించి ఆయా మార్గాల్లో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, ప్రధాన జంక్షన్ల అభివృద్ది చేసి సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ కు ప్రభుత్వం బాటలు వేసింది. దీనిలో భాగంగా 7 స్కై వే లు, 11 మేజర్ కారిడార్ లు, 68 మేజర్ రోడ్స్, 54 గ్రేడ్ సపరేటర్లను చేపట్టింది. వీటిలో ఇప్పటికే 9 ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాస్ లు, మూడు ఆర్.ఓ.బిలు, ఒక కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 25 అభివృద్ది పనులు పురోగతిలో ఉన్నాయి. అంబర్ పేట్, బాలానగర్, ఉప్పల్ రహదారుల విస్తరణ చేపట్టింది.

వారసత్వ కట్టడాల పునరుద్దరణ, పరిరక్షణలో భాగంగా రూ. 12 కోట్ల వ్యయంతో ఎం.జె మార్కెట్ పునరుద్దరణ పనులను ప్రభుత్వం పూర్తిచేసింది. ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో తీర్చిదిద్దిన చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్టును భారత్ స్వచ్ఛ మిషన్ ప్రత్యేక స్వచ్ఛ ఐకానిక్ కట్టడంగా ప్రకటించి, గుర్తించడం సంతోషకరం. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడంతో పాటు హైదరాబాద్ నగరానికి ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచింది. 

రోడ్ నెం-45 జూబ్లీహిల్స్, ఎల్బీనగర్ జంక్షన్, నాగోల్ జంక్షన్, బయోడైవర్సిటీ, అశోక్ నగర్, పురానాపూల్, రాజీవ్ గాంధీ స్టాచు జంక్షన్, రామంతపూర్ టీ జంక్షన్, కవాడిగూడ ఖానామెట్ జంక్షన్, సుచిత్ర, ఐ.డి.పి.ఎల్, లిబర్టీ, ఐ-మ్యాక్స్, నేరేడ్ మెట్, మియాపూర్, ఎల్బీనగర్, ఏ.ఎస్.రావు నగర్, ఉప్పల్, ఆలీకేఫ్, ప్రాగాటూల్స్, బోరబండ బస్టాప్ జంక్షన్లను అభివృద్ది చేశారు.

నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఇప్పటికే సింగం చెరువు తండా, సయ్యద్ సాబ్ కా బాడా, కిడికి బూద్ ఎలిసా, చిత్తారమ్మ బస్తీ, ఎరుకల నాంచారమ్మ బస్తీ, వనస్థలిపురం రైతు బజార్ లలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రస్తుతం 225 కు పైగా పనిచేస్తున్నాయి. ఈ బస్తీ దవఖానలో ఓ.పి సౌకర్యం, టెలీ కన్సల్టేషన్, మౌలిక ల్యాబ్ పరిక్షలు, ఉచిత మందుల సరఫరా, ఇమ్యునైజేషన్ తదితర వైద్య సదుపాయాలను అందిస్తున్నారు.

శాంతి భద్రతలు

శాంతి, భద్రత, సామరస్యాలు విలసిల్లే ప్రాంతాల్లోనే ప్రగతి సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి విశ్వసిస్తున్నది. అందుకే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీలేని ధోరణి అవలంభిస్తున్నది. అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. సంఘ విద్రోహ శక్తులు, అరాచక వ్యక్తులు, మహిళలను వేధించే దుష్టుల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుశాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించింది. ఖర్చుకు వెనకాడకుండా అవసరమైనన్ని వాహనాలు, కావాల్సినన్ని పోస్టులు మంజూరు చేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచడం కోసం పెద్ద సంఖ్యలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న సిసి కెమెరాల్లో 65 శాతం తెలంగాణలోనే ఉండడం గమనార్హం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానున్నది. శాంతి భద్రతల పర్యవేక్షణ, వివిధ పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం పోలీసు శాఖను పునర్వ్యవస్థీకరించింది. గతంలో కేవలం రెండు పోలీస్ కమీషనరేట్లు ఉంటే, వాటి సంఖ్యను 9కి పెంచింది. సబ్ డివిజన్లను 139 నుంచి 164కు, సర్కిళ్లను 688 నుంచి 719కి, పోలీస్ స్టేషన్లను 712 నుంచి 815కు ప్రభుత్వం పెంచింది.

ఉద్యోగుల సంక్షేమం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్ని రకాల ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంటుతో జీతాలు పెంచింది. తక్కువ వేతనాలతో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులకు, డెయిలీ వేజ్ ఉద్యోగులకు, కాంటింజెంట్ ఉద్యోగులకు, అంగన్ వాడీ టీచర్లకు, ఆశ వర్కర్లకు, హోంగార్డులకు, పారిశుధ్య కార్మికులకు, విఆర్ఎలకు, 108 సిబ్బందికి, ఇంకా తక్కువ వేతనంతో పనిచేసే ఉద్యోగులందరికీ వేతనాలు పెంచింది. ప్రభుత్వానికి సేవలందించే ప్రతీ ఉద్యోగికీ, ప్రతీ పెన్షనర్ కు ఉపయోగపడే విధంగా మరోసారి వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచాలని నిర్ణయించింది. వేతనాల పెంపునకు, వయో పరిమితి పెంపునకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. ఆయా శాఖల్లో, ఆయా జిల్లాల్లో కారుణ్య నియామకాలను పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. అన్ని ప్రభుత్వ శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం ఆయా శాఖలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పదోన్నతులు పూర్తయిన వెంటనే అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను ఒకే సారి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనే సంతోషకమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను.

ఆరు దశాబ్దాల వలస పాలన ఫలితంగా అన్ని రంగాల్లో కుదేలైన తెలంగాణ రాష్ట్రంలో పునర్నిర్మాణ ప్ర్రక్రియను ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో చేపట్టింది. సమతుల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి, అమలు పరుస్తున్నది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించి, యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఆకలి దప్పులు లేని, ఆత్మహత్యలు లేని, సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో కూడిన బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయి. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ ప్రగతి యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం గట్టి పట్టుదలతో పనిచేస్తుందని దృఢ విశ్వాసంతో ప్రకటిస్తున్నాను.

కొత్త పథకాలతో, కొత్త చొరవతో, కొత్త ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సరికొత్త రికార్డులను నెలకొల్పతున్నది.

నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఓ శక్తి వంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నది.

అందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.

జై హింద్
జై తెలంగాణ

 


                    Advertise with us !!!