రసమయి సంచలన వ్యాఖ్యలు.. టీఆర్ఎస్ లో కలకలం

Tension in TRS on Rasamayi Comments

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గజ్టెకట్టి ఆడిపాడి ఉద్యమాన్ని ఉరకలెత్తించిన రసమయి బాలకిషన్‌ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండుసార్లు మానకొండూర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తాను చాలామందికి దూరమయ్యానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో కవులు, కళాకారులు మౌనంగా ఉండటం కాన్సర్‌ కంటే ప్రమాదకరమని రసమయి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అరటే కళాకారులు మునుపటిలా కదం తొక్కడం లేదని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌ హోదాలో రసమయి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మహబూబాబాద్‌లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో పాల్గొన్న రసమయి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో తన సహజత్వాన్ని కోల్పోయానని అన్నారు. ప్రస్తుతం తానో లిమిటెడ్‌ కంపెనీలో పని చేస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌లో వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.  టీఆర్‌ఎస్‌ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో రసమయి ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్థానికంగా వినిపిస్తున్న మాట.