ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది...

SS Rajamouli s RRR To Release on October 13

స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ర్రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌). ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా అభిమానులకు కిక్కిచే అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. ఈ ఏడాది సినిమా రిలీజ్‌ అవుతుందా? లేదా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ విడుదల తేదీని పోస్టర్‌ ద్వారా వెల్లడించింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌ 13న థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. నిప్పు, సునామీ ఒక్కటైతే ఎలాగుంటుందో తొలిసారి చూడబోతున్నారని హామీ ఇచ్చారు. ఇక ఈ పోస్టర్‌లో చెర్రీ రేసుగుర్రంలా దూసుకెళ్తుండగా అలనాటి బైకు మీద ఎన్టీఆర్‌ ఫుల్‌ స్పీడులో ముందుకెళ్తున్నాడు. రంకెలు వేస్తూ ఒకే వైపు గురిచూసి పయనమవుతున్న వీళ్ల ఆగ్రహానికి కారణమేంటో తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే.

మొత్తానికి దసరాకు రెండు రోజుల ముందే ఆర్‌ఆర్‌ఆర్‌ వస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మూడేళ్ల కష్టాన్ని మేము వృధా కానివ్వమంటూ శపథం పూనుతున్నారు. ఏదేమైనా ఈ ప్రకటనతో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడిందని చెప్తున్నారు. పోస్టర్‌లో ఎన్టీఆర్‌, చెర్రీల లుక్స్‌ మామూలుగా లేవని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌లో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, ఇంగ్లీష్‌ భామా ఒలీవియా మోరిస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్‌, అలిసన్‌ డూడీ, సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

 


                    Advertise with us !!!