చివరి వరకూ ట్రంప్ తో సమస్యే!

Bidens left stuck outside White House on Inauguration Day after petty final Trump act

జో బైడెన్‌, ఆయన సతీమణి చివరి క్షణం వరకూ డొనాల్డ్‌ ట్రంప్‌ కారణంగా ఏదో విధంగా ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ప్రమాణ  స్వీకారం రోజున బైడెన్‌ దంపతులు వైట్‌హౌస్‌లోకి ప్రవేశించడానికి రాగా, వారికి స్వాగతం చెప్పడానికి గానీ, వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి గానీ ఒక్కరంటే ఒక్కరు ఎదురు రాలేదు. బైడెన్‌ దంపతులు అక్కడికి రావడానికి ముందే ట్రంప్‌ వైట్‌హౌస్‌ ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించేసేయడమే ఇందుకు కారణం. ఏం చేయాలో తోచక బైడెన్‌ దంపతులు చాలాసేపు వైట్‌హౌస్‌ బయటే నిరీక్షించాల్సి వచ్చింది. జో బైడెన్‌, ఆయన భార్య జిల్‌ బైడెన్‌ వైట్‌హౌస్‌ దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఎవరూ పలకరించకుండా, వారికి ఎవరూ పుష్పగుచ్ఛం అందించకుండా ట్రంప్‌ అనేక చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. చివరికి గార్డులను, బట్లర్లను కూడా ఇళ్లకు పంపించేయడం అందరినీ నిర్ఘాంతపరిచింది. ''ఏమైనా సరే, బైడెన్‌ దంపతులకు ఎవరూ స్వాగతం చెప్పకూడదు'' అని ఆయన వైట్‌హౌస్‌ సిబ్బందికి సూచించినట్టు తెలిసింది.

వైట్‌హౌస్‌ సిబ్బంది ప్రధానాధికారి తిమోతీ హార్లెట్‌ అంతకు మునుపే ఉద్వాసనకు గురయ్యారు. ట్రంప్‌ ఓటమి పాలుకాగానే ఆయనకు సంబంధించిన మంత్రులు, అధికారులంతా రాజీనామా చేయడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారమే తిమోతీ రాజీనామా చేయాల్సి ఉంది కానీ, ట్రంప్‌ ఆయనకు ముందుగానే ఉద్వాసన పలికారు.

వైట్‌హౌస్‌ ముందు కొత్త అధ్యక్షుడు, ప్రధమ మహిళ ఇలా చాలాసేపు నిరీక్షించాల్సి రావడం అమెరికా చరిత్రలో అరుదైన సంఘటన. ప్రమాణ స్వీకారం రోజునే బైడెన్‌ దంపతులకు ఇటువంటి దుస్థితి ఎదురుకావడం వారి పార్టీని, వారి అధికార గణాన్నే కాక, యావత్‌ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

వైట్‌హౌస్‌ దగ్గరికి వారు వచ్చే సమయానికి ఎవరైనా వారి నివాసం తలుపులు, కార్యాలయం తలుపులు తెరిచి ఉంచడం ప్రొటోకోల్‌ ప్రకారం తప్పనిసరి. ట్రంప్‌ చర్యల ఫలితంగా ఎవరూ అటువంటి ప్రొటోకోల్‌ నిబంధనలు, సంప్రదాయాలు పాటించలేదు. ఆ దంపతులకే కాదు, ఆయనతో వచ్చిన క్యాబినెట్‌ సభ్యులు, అధికారులకు కూడా ఇది విడ్డూరంగా తోచింది. కాగా, ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడడానికా అన్నట్టు బైడెన్‌ దంపతులు ఫొటోలు తీయించుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ కాలక్షేపం చేశారు.

బైడెన్‌ దంపతులకు స్వాగతం చెప్పకుండా, కనీసం శుభాకాంక్షలయినా తెలియజేయకుండా ఉండాలన్నదే ట్రంప్‌ ఉద్దేశమని వైట్‌హౌస్‌ అధికారి ఒకరు చెప్పారు. ''బైడెన్‌ దంపతులు వైట్‌హౌస్‌ దగ్గరికి వచ్చేసరికి ఒక్క పురుగు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు. బట్లర్లు కూడా ఇళ్లకు వెళ్లిపోవాలి'' అని ట్రంప్‌ ఆదేశించినట్టు ఒక వైట్‌హౌస్‌ అధికారి వెల్లడించారు.

బుధవారం ఉదయం బైడెన్‌ దంపతులు వైట్‌హౌస్‌కు రావడానికి ముందే తిమోతీ హార్లెట్‌ను ట్రంప్‌ తొలగించారు. ''ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగానే మేం వైట్‌హౌస్‌కు వచ్చే ముందు తిమోతీని తొలగించారు'' అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ పాస్క్‌ ధ్రువీకరించారు.

 


                    Advertise with us !!!