
మరోసారి కరెన్సీ రద్దు ప్రతిపాదన వస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. కాకపోతే చిన్న నోట్లపైనే ఈసారి ఉంటుందని ఆ చిన్న పాత నోట్లు ఎక్కువగా ఉంటే వెంటనే మార్చుకోవడం మంచిదని చెబుతున్నారు. ఆర్బీఐ కీలక అధికారి ఆన్యాపదేశంగా దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమాచారం ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని పాత కరెన్సీ నోట్లను విత్డ్రా చేసుకునే ఆలోచనలో కేంద్ర బ్యాంకు ఉన్నట్లు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బీ మహేష్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు. రూ.100, రూ .10, రూ .5 పాత కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకోనుందనే హింట్ ఇచ్చారు. అయితే మరి పాత నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఇస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు.
నవంబర్ 8, 2016లో రూ.500, 1000 రూపాయల నోట్ల డీమోనిటైజేషన్ తర్వాత రూ .2,000 విలువైన కరెన్సీ నోట్తో పాటు రూ .200 నోటును ప్రవేశపెట్టింది. 2019లో 100 రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. 2019లో, సెంట్రల్ బ్యాంక్ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఇచ్చిన ఆర్టిఐ సమాధానంలో ఆర్బీఐ వెల్లడించింది. దీంతో త్వరలోనే 2వేల నోటును కూడా రద్దు చేయనుందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్రం, ఆర్బీఐ అప్పట్లోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.