
అయోధ్య రామాలయ నిర్మాణం విరాళాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని వ్యాఖ్యానించారు. విరాళాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని తెలిపారు. కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, దుష్ప్రచారం చేస్తున్నారని విద్యాసాగర్ రావు ఆరోపించారు. తాను కూడా రాముడి భక్తుడినే అని స్పష్టం చేశారు. తాను కూడా అయోధ్య వెళతానని అన్నారు. బీజేపీ మత రాజకీయాలు మానుకుంటే బాగుంటుందని సూచించారు. దీనిపై రాజకీయం చేయడం సరికాదని అన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఇక్కడి ప్రజలెవరూ విరాళాలు ఇవ్వొద్దని కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.