
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజాదరణ మాత్రం ఈ అసాధారణ సవాళ్లలోనూ చెక్కు చెదరలేదని, ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టూడే కార్వీ జరిపిన మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఓటీఎన్) సర్వే తేల్చింది. మెజారిటీ మార్క్ ను దాటి 43 శాతం ఓట్లతో 321 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని తేల్చింది. గత సంవత్సరం ఆగస్ట్ నెలలో జరిపిన సర్వేలో ఎన్డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలగా, దానిపై మరో ఐదు స్థానాలు అధికంగానే గెలుస్తుందని ప్రస్తుత సర్వే పేర్కొనడం విశేషం.
2019 ఎన్నికల్లో ఎన్డీఏ గెల్చుకున్న 357 సీట్ల కన్నా ఈ నెంబర్ తక్కువగా ఉండటం గమనార్హం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వివక్ష యూపీఏ కూటిమి 93 సీట్లు గెల్చుకుంటుందని ఈ ఎంఓటీఎన్ సర్వే పేర్కొంది. ప్రాంతాల వారీగా తీసుకుంటే, హిందీ, హిందుత్వ రాజకీయాలు బలంగా ఉన్న ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ అత్యధికంగా 104 సీట్లను, పశ్చిమ భారతదేశంలో 85 సీట్లను, తెలివైన పొత్తులతో తూర్పు భారతంలో 100 స్థానాలను గెల్చుకుంటుందని ఈ సర్వే తేల్చింది. దక్షిణ భారత్లో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేదని, అక్కడ 32 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ మరొకసారి సొంతంగా మెజారిటీ సాధిస్తుందని, మెజారిటీ మార్క్ అయిన 272ని దాటి 291 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 51 సీట్లు మాత్రమే సాధిస్తుందంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే.
కరోనాపై పోరుకు అనూహ్య లాక్డౌన్ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దూకుడు తదితర అంశాల్లో విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలదేని సర్వేలో తెలింది.