ప్రమాణ స్వీకారంలో ముగ్గుల తోరణం

Auspicious Kolam drawings mark kickoff of Biden-Harris inauguration ceremony

భారతదేశంలో ముగ్గులకు లేదా రంగవల్లులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అదృష్టం తెస్తుందని, సౌభాగ్యాన్ని తెచ్చి పెడుతుందనే గట్టి విశ్వాసంతో ఇళ్ల ముందు, ఇళ్ల వెనుక పెరట్లోనూ ఉదయాన్నే ముగ్గులు వేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అదృష్టాన్నీ, సౌభాగ్యాన్నే కాదు, ఆరోగ్యానికి కూడా కారణమవుతుందని కోట్లాది మంది భారతీయులు నమ్ముతారు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లో సైతం ఇళ్ల ముందు ఉదయాన్నే ఈ రంగవల్లులు దర్శనమిస్తాయి. ఈ ముగ్గులు కూడా జ్యామితి రేఖల్లాగానో, రేఖా గణితంలాగానో దర్శనమిస్తాయి. ఈ ముగ్గుల వెనుక శాస్త్రీయ ప్రాధాన్యం కూడా ఉందని కొందరు భావిస్తుంటారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో దాదాపు ప్రతి ఇంటి ముంగిటా ఈ రంగవల్లులు దర్శనమిస్తుంటాయి. తమిళనాడులో ముగ్గులను ‘కోలం’గా వ్యవహరిస్తారు. ఇంతకూ ఈ ముగ్గుల సంప్రదాయం అకస్మాత్తుగా, అనూహ్యంగా వాషింగ్టన్‍లో కూడా దర్శనమిచ్చింది.

బుధవారం నాడు జో బైడెన్‍, కమలా హారిస్‍లు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా భారతీయుల నివాసాల ముందు రంగవల్లులు రంగు రంగులుగా వెల్లివిరిశాయి. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన కమలా హారిస్‍ భారతీయురాలు, అందులోనూ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడంతో ఆ దేశ రాజధానిలో ఇలా రంగవల్లులు దర్శనమిచ్చాయి. ప్రమాణ స్వీకారం జరిగే అమెరికా  క్యాపిటల్‍ హిల్‍ ముందు అక్కడి భారతీయ మహిళలు ‘అమెరికా యునైటెడ్‍’ అనే శీర్షికతో అద్భుతమైన, ఆకర్షణీయమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ రంగవల్లులు అమెరికాలోని భిన్నత్వంలో ఏకత్వానికి, బహుళ జాతి సంస్కృతికి అద్దం పట్టాయి.

అమెరికా నలుమూలల నుంచి సుమారు 1,800 మంది వాషింగ్టన్‍ వచ్చి ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో అమెరికాలోని పబ్లిక్‍ స్కూల్స్కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. వీరంతా పర్యావరణహిత వస్తు సామగ్రితో ఈ రంగవల్లులు వేయడం జరిగింది. వాస్తవానికి ఈ ‘కోలం’ కార్యక్రమం వాషింగ్టన్‍కి, క్యాపిటల్‍ హిల్‍కి పరిమితమయ్యేదే. కానీ, మేరీలాండ్‍కు చెందిన అవార్డు విజేత ప్రముఖ మల్టీ మీడియా ఆర్టిస్టు శాంతి చంద్రశేఖరన్‍ కృషి ఫలితంగా ఈ కార్యక్రమం అమెరికా అంతటా విస్తరించింది. కోలం రేఖా చిత్రాలకు ఆమే రూపకల్పన చేశారు. ఇందులో పాల్గొన్న వందలాది మంది వ్యక్తులు ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే అమెరికా సంస్కృతిని తమ రంగవల్లుల్లో ప్రతిబింబజేయడం విశేషం. దేశ పాలనకు బైడెన్‍, కమలా హారిస్‍ల క్యాబినెట్‍ నడుం బిగించడంతో అమెరికాలో కొత్త ఆరంభానికి నాంది పలికినట్టయింది.