
న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పుపై చంద్రబాబు స్పందించారు. ఎన్నికల సంఘం కూడా అనవసరం అనే రీతిలో జగన్ వ్యవహరించారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కూడా వద్దంటారేమోనని విమర్శించారు. ఏ రాజ్యాంగ వ్యవస్థపైనా గౌరవం లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ప్రతి ఉన్మాది చర్యకు ప్రత్యామ్నాయ చర్యలు త్వరలోనే ఉంటాయని హెచ్చరించారు. కరోనా వేళ ఎన్నికలు నిర్వహించాలని చూశారన్న చంద్రబాబు.. కరోనా తగ్గాక ఎన్నికలు పెడుతుంటే వద్దన్నారన్నారు. చరిత్రలో ఎన్నడూలేని బలవంతపు ఏకగ్రీవాలు చేశారని దుయ్యబట్టారు.
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌పై చేసిన ఆరోపణలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఎక్కడుందని చంద్రబాబు నిలదీశారు. గుడివాడలో పేకాట శిబిరాలపై దాడిలో పాల్గొన్న ఎస్ఐ మరణం అనుమానాస్పదమేనన్న ఆయన.. అసలు వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర ఎందుకు జరగదో తామూ చూస్తామని తేల్చి చెప్పారు.