ఇమ్మిగ్రేషన్ సంస్కరణలను స్వాగతించిన టెక్ కంపెనీలు

president-bidens-immigration-reforms-hailed-by-big-tech-companies

వలస కార్మికులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించిన సంస్కరణల పట్ల అమెరికా టెక్‌ కంపెనీలు స్వాగతం పలికాయి. కోటి మంది ఇమిగ్రాంట్లకు పౌరసత్వం ఇవ్వాలని బైడెన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఆ కంపెనీలు ఆహ్వానించాయి. ముస్లిం దేశాల టూరిస్టులపై ట్రంప్‌ సర్కార్‌ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇమిగ్రేషన్‌ సంస్కరణలు చేపట్టేందుకు బైడెన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇది అమెరికా విలువలను ప్రతిబింబిచేలా చేస్తుందని, ఈ చర్యలు అమెరికా సమాజాన్ని బలోపేతం చేస్తాయని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో అమెరికా ప్రభుత్వంతో పనిచేసేందుకు వ్యాపారనేతలు భేటీ కానున్నట్లు చెప్పారు. ధ్వంసమైన ఇమిగ్రేషన్‌ విధానాన్ని మార్చేందుకు సమగ్రమైన చర్యలు తీసుకోనున్నట్లు టిమ్‌ కుక్‌ తెలిపారు.

ఆల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కూడా స్పందించారు. కోవిడ్‌ రిలీఫ్‌, పారిస్‌ వాతావరణ ఒప్పందం. ఇమిగ్రేషన్‌ సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్‌ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో స్పందించిన పిచాయ్‌.. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నామని, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడి దేశాన్ని మళ్లీ ఆర్థికంగా నిలబెట్టాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భిన్నత్వమే అమెరికాను నడిపిస్తుందని, డ్రీమర్స్‌కు ఇక మంచి అవకాశాలు ఉంటాయన్నారు.

 


                    Advertise with us !!!