
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతిపక్షాలు టీకా మొదట ప్రధాని నరేంద్ర మోదీనే తీసుకోవాలని.. అప్పుడే జనాలకు వ్యాక్సిన్ పట్ల ఉన్న భయం పోతుందని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త మీడియాలో వైరలవుతోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ సెకండ్ రౌండ్లో ప్రధాని, ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ తీసుకోనున్నారని ఆ వార్త సారాంశం. ముఖ్యమంత్రులతో సమావేశం సందర్భంగా మోదీ 50 ఏళ్లు పైబడిన నేతలంతా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ఇక వ్యాక్సినేషన్ మొదటి రౌండ్లో వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులు, రక్షణ దళాలు, మున్సిపల్ సిబ్బందికి టీకా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మూడవ రౌండ్లో 50 ఏళ్లు పైబడిన వారికి.. ఆ తరువాత రౌండ్లో 50 ఏళ్లలోపు వారితో పాటు సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేయనున్నారు. నవంబర్ 24 న ప్రధాని మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశంలో టీకా ఇచ్చే విషయంలో తాత్కాలిక ప్రాధాన్యత గురించి చర్చించామని.. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశామని దీనితో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు.