అమెరికన్ల సేవకే అంకితమవుతా భావోద్వేగంతో డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు ప్రసంగం

Donald Trump s farewell address

అమెరికన్ల సేవకే అంకితమవుతా భావోద్వేగంతో డొనాల్డ్‌ ట్రంప్‌ వీడ్కోలు ప్రసంగం

తోటి అమెరికన్‌ ప్రజలారా....మన దేశ పునర్నిర్మాణానికి, దీని ఆశయాలకు పునరంకితం కావడానికి, ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడానికి మనం నాలుగేళ్ల క్రితం ఒక మహోన్నత ప్రయత్నాన్ని ప్రారంభించాం. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికాను ఒక మహోన్నత దేశంగా మార్చాలని కంకణం కట్టుకున్నాం.

దేశ 45వ అధ్యక్షునిగా నా పదవీ కాలం ముగుస్తున్న సమయంలో మనమంతా కలిసి ఆ ఆశయాన్ని సాధించామని చెప్పడానికి గర్వపడుతున్నాను. మనం సాధించాల్సి సాధించాం. ఆ మాటకొస్తే ఎక్కువే సాధించాం.

ఈ వారం మనం దేశంలో ఒక కొత్త పాలనను ఆవిష్కరించబోతున్నాం. అది విజయవంతం కావాలని ప్రార్థిద్దాం, అది దేశాన్ని సురక్షితంగా, సౌభాగ్యవంతంగా ఉంచుతుందని ఆశిద్దాం. కొత్త ప్రభుత్వానికి శుభాభినందనలు. వారికి అదృష్టం కలిసి రావాలని కోరుకుందాం. అదృష్టమనే మాట చాలా ప్రధానమైంది.

మన మహోన్నత ప్రస్థానానికి సహాయ సహకారాలు అందించిన అద్భుత వ్యక్తులు కొందరికి ధన్యవాదాలు తెలియజేయడంతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను.

మొదటగా, నాకు ప్రేమను, మద్దతును అందించిన చక్కని ప్రథమ మహిళ మెలానియాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్‌, బేరన్‌, డాన్‌, ఎరిక్‌, టిఫానీ, లారాలకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీరంతా నా ప్రపంచంలో వెలుగులు, ఆనందోత్సాహాలను నింపారు.

ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, ఆయన భార్య కెరేన్‌, యావత్‌ పెన్స్‌ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ మీడోస్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు; అంకితభావంతో, నిబద్ధతతో పనిచేసిన వైట్‌హౌస్‌ సిబ్బందికి, క్యాబినెట్‌కు ధన్యవాదాలు; అమెరికా తరఫున పోరాటం సాగించడానికి రాత్రింబగళ్లు కష్టపడిన మా ఉద్యోగులందరికీ నా ధన్యవాదాలు.

ఈ సందర్భంగా కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌కి. నేను, నా కుటుంబం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. వైట్‌హౌస్‌ సైనిక కార్యాలయంలో ఉన్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నౌకాదళం వారికి, వైమానిక దళం వారికి, సాయుధ దళాలకు చెందిన ప్రతి ఒక్కరికీ, దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా సిబ్బందికి, పోలీసులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అన్నిటికన్నా ముఖ్యంగా నేను అమెరికన్‌ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు అధ్యక్షుడుగా సేవ చేయడమన్నది ఓ వర్ణనాతీతమైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అసాధారణ గౌరవానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకన్నా గొప్ప విషయం, గౌరవం మరొకటి ఉండదనుకుంటున్నాను.

అమెరికన్లలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కానీ, ఒక అసాధారణ, మహోన్నత, శాంతికాముక దేశ ప్రజలుగా మనం మన దేశం అభివృద్ధి చెందాలని, విజయాలు సాధించాలని మనం గట్టిగా కోరుకున్నాం. నిజంగా మనది ఓ మహోన్నత దేశం.

క్యాపిటల్‌ హిల్‌ మీద దాడి జరగడం మనందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. రాజకీయ హింసాకాండ అంటే అమెరికన్లుగా మనం పెంచి పోషించిన విలువల మీద దాడి జరగడంగానే భావించాలి. దీనిని సహించకూడదు.

మన విలువల పరిరక్షణ కోసం మనమంతా ఐక్యం కావాలి. పక్షపాత ధోరణి నుంచి బయటపడాలి. మన ఏకైక ఆశయం కోసం మనమంతా ఒక్క తాటి మీద నిలవాలి.

నాలుగేళ్ల క్రితం నేను ఈ నగరానికి వచ్చాను. అధ్యక్ష పదవికి ఎన్నికైన మొట్టమొదటి బయటి వ్యక్తిని. రాజకీయాలు నా వృత్తి కాదు. నేనొక బిల్డర్ని. ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని, అనేక అవకాశాలను అందిపుచ్చుకోవాలని కలలు కన్నాను. అమెరికాలో ఎక్కాల్సిన శిఖరాలు ఎన్నో ఉన్నాయనే ఉద్దేశంతో నేను అధ్యక్ష పదవికి పోటీ చేశాను. మనం అమెరికాకు ప్రాధాన్యం ఇచ్చినంత కాలం మనకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావించాను.

అందువల్ల నేను నా బిల్డర్‌ జీవితాన్ని పక్కనపెట్టి కొత్త కష్ట జీవితాన్ని ఎంచుకున్నాను. ఇది కష్ట జీవితమే కానీ, నా విధిని నేను సక్రమంగా నిర్వర్తించే పక్షంలో ఎన్నో గొప్ప పనులు చేయడానికి అవకాశం ఉంది. అమెరికా నాకెంతో ఇచ్చింది. నేను ఆ రుణం తీర్చుకోవాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది దేశభక్తుల సహాయ సహకారాలతో మనం మన దేశ చరిత్రలోనే అతి గొప్ప రాజకీయ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. అంతేకాదు, ప్రపంచ చరిత్రలో అతి గొప్ప ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించుకున్నాం. అమెరికాకే మన మొదటి ప్రాధాన్యం. అమెరికా మళ్లీ గొప్ప దేశం కావాలనేదే మన లక్ష్యం. తన ప్రజలకు సేవ చేయడానికే ఏ దేశమైనా ఉంటుందనే సిద్ధాంతాన్ని మనం పునరుద్ధరించాం. అతివాదమా, మితవాదమా అన్నది మన ఉద్దేశం కాదు. రిపబ్లికన్సా, డెమొక్రాట్సా అన్నది మనం పట్టించుకోం. మన దేశమే మనకు ముఖ్యం. యావద్దేశం మనకు ముఖ్యం.

అమెరికా ప్రజల మద్దతుతో, ప్రార్థనలతో ఎవరూ ఊహించనంత అభివృద్ధిని సాధించాం. మనం మన లక్ష్యాన్ని సాధించగలమని, దాని దగ్గరకైనా రాగలమని ఎవరూ ఊహించలేదు.

అమెరికా చరిత్రలోనే అతి పెద్ద పన్నుల కోతలు, సంస్కరణలకు సంబంధించిన ప్యాకేజీని చేపట్టాం. కనీ వినీ ఎరుగని స్థాయిలో ఉద్యోగాల సృష్టిని అడ్డుకునే అనేక నియమ నిబంధనలకు ఉద్వాసన చెప్పాం. విచ్ఛిన్నమైన అనేక వాణిజ్య ఒప్పందాలను చక్కదిద్దాం. దారుణమైన ట్రాన్స్‌ పసిఫిక్‌ భాగస్వామ్యం నుంచి వైదొలగాం. అసాధ్యమనుకున్న పారిస్‌ వాతావరణ ఒప్పందాన్ని సాధించాం. ఏకపక్ష దక్షిణ కొరియా ఒప్పందంపై తిరిగి చర్చలు జరిపాం. ఎన్‌ఏఎఫ్‌టిఏ స్థానంలో బ్రహ్మాండమైన యుఎస్‌ఎమ్‌సిఏ ఒప్పందాన్ని (మెక్సికో, కెనెడా) కుదర్చుకున్నాం. ఈ ఒప్పందం అద్భుతంగా పనిచేసింది.

అంతేకాదు, ముఖ్యంగా మనం చైనాపై చరిత్రాత్మకమైన, బ్రహ్మాండమైన టారిఫ్‌లను విధించగలిగాం. చైనాతో ఒక చక్కని ఒప్పందాన్ని కుదుర్చుకోగలిగాం. ఇది జరిగిన కొద్ది రోజులకే ప్రాణాంతకమైన చైనా వైరస్‌ మనల్ని, ప్రపంచాన్ని చుట్టుముట్టింది. మన వాణిజ్య సంబంధాలు వేగంగా మారిపోయాయి. కోట్లాది డాలర్లను అమెరికాలో కుమ్మరించాం. కానీ, ఈ వైరస్‌ మనల్ని బలవంతంగా పక్కదారి పట్టించింది.

యావత్‌ ప్రపంచం నానా కష్టాలూ పడింది. కానీ, ఆర్థికంగా మిగిలిన అన్ని దేశాల కంటే అమెరికాయే బాగా నిలదొక్కుకుంది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ, మనం నిర్మించుకున్న ఆర్థిక వ్యవస్థ ఎంతో పరిపుష్టమైంది. సరైన పునాదులు లేకుండా ఆర్థిక వ్యవస్థ దీన్ని తట్టుకోవడం సాధ్యం కాదు. ఏవిధంగా చూసినా సంఖ్యల పరంగా మనం ముందు ఉండడం సాధ్యమయ్యేది కాదు.

మన ఇంధన వనరులన్నిటికీ ద్వారాలు తెరిచాం. చమురు, సహజ వాయువుల ఉత్పత్తిలో మనమే ప్రపంచంలో ఇంత వరకూ ప్రథమ స్థానంలో ఉన్నాం. ఈ విధానాల ఆధారంగా మనం ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకున్నాం. అమెరికాలో ఉద్యోగాల కల్పనలో మనం కొత్త పుంతలు తొక్కాం. ఆఫ్రికన్‌ అమెరికన్లయినా, హిస్పానిక్‌ అమెరికన్లయినా, ఆసియా అమెరికన్లయినా, మహిళలైనా, ఇంకా ఎవరైనా వారిలో నిరుద్యోగ సమస్యను గణనీయంగా తగ్గించాం.

ఆదాయాలు మిన్నంటాయి. వేతనాలు బాగా పెరిగాయి. అమెరికా కల నెరవేరింది. కొద్ది సంవత్సరాలలో కోట్లాది మంది పేదరికం నుంచి బయటికి వచ్చారు. ఇది నిజంగా ఒక అద్భుతం. స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రికార్డులు నెలకొల్పింది. అతి తక్కువ కాలంలో 148 పర్యాయాలు అత్యున్నత స్థాయికి ఎదిగింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రిటైరై, పింఛన్లు పొందగలిగారు. 401 (కె) మంది కనీ వినీ ఎరుగని స్థాయికి చేరుకున్నారు. ఇటువంటి సంఖ్యా వివరాలను మనం గతంలో చూడలేదు. మహమ్మారికి ముందు, మహమ్మారి తర్వాత కూడా ఇది కొనసాగింది.

మనం ఉత్పత్తి రంగానికి పటిష్ఠమైన పునాదులు వేశాం. వేలాది కొత్త కర్మాగారాలు ప్రారంభించాం. 'మేడ్‌ ఇన్‌ అమెరికా' అనే బ్రాండ్‌ పేరును తీసుకు వచ్చాం.

శ్రామిక కుటుంబాల జీవితాలు చక్కగా ఉండాలన్న ఏకైక ధ్యేయంతో చైల్డ్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను రెట్టింపు చేశాం. శిశు సంరక్షణ, అభివృద్ధికి సంబంధించిన నిధులను భారీగా విస్తరించాం. రేపటి ఉద్యోగాల కోసం కోటి 60 లక్షల మంది అమెరికా కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రైవేట్‌ రంగంతో కలిసి చర్యలు తీసుకున్నాం.

మన దేశాన్ని ప్రాణాంతక మహమ్మారి చుట్టుముట్టినప్పుడు మనం ఒకటి కాదు, రెండు రకాల వ్యాక్సిన్‌లను తయారు చేశాం. అత్యంత వేగంగా ఉత్పత్తి చేశాం. మరిన్ని వ్యాక్సిన్‌లు తయారు కాబోతున్నాయి. మనం చేయలేమన్నారు. కానీ, మనం చేసి చూపించాం. ఇప్పుడు దీన్ని 'వైద్యరంగ అద్భుతం' అంటున్నారు. ఇప్పుడంతా దీన్ని 'వైద్య రంగ అద్భుతం' అనే అంటున్నారు. మరో ప్రభుత్వమైతే దీన్ని ఉత్పత్తి చేయడానికి 3,4,5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా పట్టేది. కానీ, మనం 9 నెలలో ఉత్పత్తి చేశాం.

మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినవారికి మనం సంతాపం ప్రకటిస్తున్నాం. ఈ మహమ్మారిని పూర్తిగా తుడిచిపెడతామని మృతుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం.

ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలినప్పుడు, మన దేశం ఏనాడూ ఎరగనంత వేగంగా మన ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి చర్యలు తీసుకున్నాం. మనం 4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటించాం. సుమారు 5 కోట్ల ఉద్యోగాలను కాపాడాం. నిరుద్యోగ రేటును సగానికి తగ్గించాం. ఈ సంఖ్యలను మన దేశం ఏనాడూ చూడలేదు.

ఆరోగ్య సంరక్షణలో మనం పారదర్శకతను, అవకాశాలను సృష్టించాం. అనేక విధాలుగా ఔషధ పరిశ్రమను ఆదుకున్నాం. అనేక దేశాలను జాబితాలో చేర్చుకుని, తక్కువ ధరలకు ఔషధాలను దిగుమతి చేసుకోగలిగాం.

మనం వి.ఏ. చాయిస్‌, వి.ఏ. అకౌంటబిలిటీ, రైట్‌ టు ట్రై, ఇంకా క్రిమినల్‌ జస్టిస్‌ సంస్కరణలను రూపొందించాం.

అమెరికా సుప్రీం కోర్టుకు సంబంధించి మూడు కొత్త న్యాయ వ్యవస్థలను తీసుకు వచ్చాం. రాజ్యాంగానికి భాష్యం చెప్పేందుకు కొత్తగా 300 మంది న్యాయమూర్తులను నియమించాం.

ట్రంప్‌ తన ప్రసంగంలో కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ వీడ్కోలు చెబుతూ వైట్‌హౌస్‌ నుంచి ఆయన నిష్క్రమించారు.

 


                    Advertise with us !!!