
ఆంధ్రప్రదేశ్లోని పలు దేవాలయాలపై దాడులు జరగడం వాస్తవమేనని, అలజడి తగ్గించేందుకే ఆలయాలను సందర్శిస్తున్నట్లు త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన నందలూరులోని సౌమ్యనాథ స్వామి ఆలయం, ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించుకున్నారు. విగ్రహాల ధ్వంసం వెనుక కనిపించని శక్తులున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల్లో భక్తిభావం పెరిగినప్పుడే ఆలయాల సంరక్షణ సాధ్యపడుతుందని చెప్పారు. ప్రజలు సైతం ఆలయాల రక్షణ బాధ్యతలు తీసుకోవాలని చినజీయర్ స్వామి సూచించారు. పర్యటనలో ఉన్న చినజీయర్ స్వామిని ముస్లిం, క్రిస్టియన్ ప్రతినిధులు కలిసి మాట్లాడారు. సందర్శన అనంతరం ఆలయాల్లోని విగ్రహాల స్థితిగతులు, సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలిస్తామని ఆయన తెలిపారు.