డబ్ల్యూహెచ్‌వో లోకి మళ్లీ అమెరికా...

America will join WHO

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. అయితే పదవిని అలకరించిన తొలి రోజునే బైడెన్‌ అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో మళ్లీ అమెరికా చేరబోనున్నది. బైడెన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఈ ప్రక్రియ జరగనున్నట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్‌ గురించి ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైన కారణంగా దాని నుంచి తప్పుకుంటున్నట్లు గత ఏడాది ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ట్రంప్‌ అధికారంలోకి రాగానే తీసుకున్న కీలక నిర్ణయాలను కూడా బైడెన్‌ ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. ముస్లిం దేశాల నుంచి వచ్చేవారిపై ఉన్న నిషేధాన్ని బైడెన్‌ సర్కార్‌ ఎత్తివేయనున్నది. మెక్సికో సరిహద్దుల్లో చేపడుతున్న గోడ నిర్మాణాన్ని కూడా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. బైడెన్‌ తన తొలి రోజే ఈ నిర్ణయాలు తీసుకునే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది.