ఇదిగో... జాక్ మా కనిపించారు

will-meet-again-alibabas-jack-ma-makes-first-live-appearance-in-three-months-in-online-meet

చైనా దిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఎట్టకేలకు కనిపించారు. గ్రామీణ ఉపాధ్యాయులతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో జాక్‌మా పాల్గొన్నారంటూ చైనా అధికారిక మీడియా బుధవారం ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘జాక్ మా అదృశ్యమేమీ కాలేదు. 100 మంది గ్రామీణ ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కోవిడ్ ముగిసిన తర్వాత మళ్లీ కలుద్దాం...’’ అని ఆయన టీచర్లతో చెప్పారంటూ చైనా మీడియా పేర్కొంది. దిగ్గజం జాక్ మా రెండు నెలలుగా కనిపించలేదు. అయితే ఈ అదృశ్యం వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్న ఊహాగానాలు అప్పట్లో విపరీతంగా వినిపించాయి. ఈ వీడియోతోనైనా అనుమానాలకు తెర పడుతుందా? లేదా అన్నది ఆసక్తికరం. మరోవైపు ఈ వీడియోపై కార్పొరేట్ శక్తులు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. జాక్ మా టీవీ షోలకు గానీ, సోషల్ మీడియాకు గానీ చాలా దూరంగా ఉంటారని, హఠాత్తుగా ఈ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం ఏంటని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలలుగా అదృశ్యం

జాక్ మా రెండు నెలలుగా అదృశ్యమయ్యారు. చైనా ప్రభుత్వ వ్యవహార శైలిపై జాక్ మా కొన్ని రోజుల క్రితం తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్ షాపులుగా మాత్రమే ఉన్నాయని, కొత్తగా ఏమాత్రం వ్యవహరించడం లేదని ఓ ఉపన్యాసంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చైనా పాలకులకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఆయన వ్యాపారాలపై చైనా ప్రభుత్వం విరుచుకుపడటం ప్రారంభించింది. అయితే చైనాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే అదృశ్యం కావడం జాక్‌మా నుంచే ప్రారంభం కాలేదు. గతంలో హాంకాంగ్ లోని ప్రచురణ సంస్థకు చెందిన ఐదుగురు కూడా కనిపించకుండా పోయారు. వీరిని చైనాయే నిర్బంధించిందన్నది అందరికీ తెలిసిందే.