
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి.. చిన్నమ్మగా పేరొందిన కే.శశికళ ఈ నెల 27వ తేదీన జైలు నుంచి విడుదల కానున్నారు. బెంగళూరు జైలు అధికారులను ఉటంకిస్తూ ఆమె తరపు న్యాయవాది రాజా సేథురాపాండియన్ తెలిపారు.2016లో జయలలిత దుర్మరణం తర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించిన శశికళ, నాలుగేండ్ల క్రితం అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని జైలు పాలయ్యారు. అయితే నాలుగేండ్ల జైలుశిక్ష పూర్తి కావడంతో పాటు రూ.10 కోట్ల జరిమానను చెలిస్తే శశికళ విడుదల అవుతారు. త్వరలో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శశికళ జైలు నుంచి విడుదల కానుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత (2016), ఎంకే కరుణానిధి (2018) మరణించడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది.
జయలలిత హయాంలో అన్నాడీఎంకేలో శక్తిమంతమైన వ్యక్తిగా శశికళ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే కీలక పాత్ర పోషించనున్నారు. అయితే, సీఎం ఎడపాడి కే పళనిస్వామి మాత్రం అన్నాడీఎంకేలోకి శశికళను అనుమతించబోమని తేల్చేశారు. అన్నాడీఎంకే మద్దతుదారు బీజేపీ పరోక్ష ఒత్తిడితో మాత్రం శశికళ తిరిగి అధికార పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.