
బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... రాజకీయాలను కీలక మలుపు తిప్పారు సీఎం మమత బెనర్జీ. వచ్చే ఎన్నికల్లో తాను ‘నందిగ్రామ్’ నుంచి బరిలోకి దిగితున్నట్లు ప్రకటించారు. నందిగ్రామ్‌తో పాటు భవానీ పూర్ నుంచి కూడా బరిలోకి దిగుతానని తెలిపారు. రోజురోజుకీ ప్రతిపక్ష బీజేపీ తుపాను వేగంతో బెంగాల్లోకి దూసుకొస్తున్న నేపథ్యంలో సీఎం మమత ప్రకటనకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం మమత జాదవ్‌పూర్ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మమతా బెనర్జీ ఓ వ్యూహం ప్రకారమే నందిగ్రామ్‌ను ఎంచుకున్నారు. ఈసారి కూడా తృణమూల్‌కు 200 సీట్లు వస్తాయని, తిరిగి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నందిగ్రామ్ గడ్డపై సెజ్‌లకు వ్యతిరేకంగా ఎవరు ఉద్యమాలు చేశారో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. బీజేపీ అందరికీ డబ్బులను ఎరగా వేస్తోందని, అందుకే అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని పరోక్షంగా సుబేందుపై ఆరోపణలను గుప్పించారు.
నందిగ్రామ్ ప్రకటన ఎందుకు ప్రాముఖ్యమైందంటే...
నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు మమత ప్రకటించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమైన అంశం. రాబోయే ఎన్నికలు ఇటు తృణమూల్ కాంగ్రెస్‌కు, అటు బీజేపీకి జీవన్మరణ సమస్య. పైగా... నందిగ్రామ్ సుబేందు అధికారి సొంత నియోజకవర్గం. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. బీజేపీలో చేరి, తృణమూల్‌ను రాజకీయంగా అంతం చేయాలని సుబేందు, బీజేపీ ద్వయం ప్లాన్ వేసింది. దీనికి అడ్డుకట్టవేయాలని మమత డిసైడ్ అయ్యారు. నందిగ్రామ్‌లో సుబేందును ఓడిస్తే ఇక తిరుగుండదని మమత ప్లాన్‌గా భావిస్తున్నారు. పైగా ఈ నియోజకవర్గం తృణమూల్ ‘ఆయువు పట్టు.’ పైగా మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య అధికారంలో ఉన్న సమయంలో తృణమూల్ నందిగ్రామ్‌లో పెద్ద ఉద్యమాన్నే చేసింది. ‘సెజ్’లను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీశారు. సెజ్‌ల పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్న భూముల వ్యవహారంలో స్థానిక రైతులకు అండగా నిలిచి మమత ‘రైతు బంధు’ గా పేరు గడించారు. దీంతో పాటు ‘మా, మాటీ, మానుష్’ నినాదాన్ని కూడా ఇక్కడి నుంచే ఇచ్చారు. మమత రాజకీయ జీవితంలో ‘నందిగ్రామ్ ఉద్యమం’ ఓ మైలు రాయి. ఈ ఉద్యమంతో పాటు సింగూర్ ఉద్యమం కూడా మమతను ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర చేసింది. అయితే అప్పట్లో సుబేందు తృణమూల్‌లో ఉండేవారు. ఇప్పటి సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. ఆయనే దగ్గరుండి, సర్వస్వం తానై నందిగ్రామ్‌లో ఉద్యమం నడిపారు.
సుబేందును ‘వాయు వేగాన్ని’ అడ్డుకోడానికే.....
నందిగ్రామ్ అంటేనే సుబేందు అన్నంతగా అక్కడ సుబేందు అధికారి పాతుకుపోయారు. పైగా అది ఆయన సొంత నియోజకవర్గం. ‘రఫ్ అండ్ టఫ్’ రాజకీయాలు చేస్తారని ఆయనకు పేరుంది. కేవలం నందిగ్రామే కాదు... బెంగాల్ సగానికి పైగా సుబేందు తన అధికారాన్ని చలాయిస్తారని పేరుంది. చాలా నియోజకవర్గాలు సుబేందు కనుసన్నల్లోనే నడుస్తాయి. అంతలా బెంగాల్ రాజకీయంపై సుబేందు పట్టు సాధించారు. అయితే ఆయన హఠాత్తుగా బీజేపీలో చేరిపోయారు. ఈ పరిణామమే సీఎం మమతకు శరాఘాతమై కూర్చుంది. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం సుబేందుపై పెద్ద బాధ్యతలనే మోపింది. తనకు పట్టులేని నియోజకవర్గాల్లో పట్టు సాధించేలా చేయడం, తృణమూల్ కీలక నేతలను బీజేపీలోకి లాగడంతో పాటు మరికొన్ని ముఖ్య పనులను బీజేపీ సుబేందుపై మోపింది. దీంతో ఆయన దాదాపు రాష్ట్రమంతా పర్యటించాల్సి ఉంటుంది. దీన్నే అదునుగా వాడుకోవాలని మమతా బెనర్జీ స్కెచ్ వేశారు. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగినట్లైతే సుబేందు బాధ్యతల రీత్యా ఈ నియోజకవర్గంపై అంతలా దృష్టి సారించరని, దీని ద్వారా చాలా సులంభంగా ఆయన్ను ఓడించవచ్చని తృణమూల్ అంచనా. సుబేందు సొంత నియోజకవర్గంలోనే ఆయన్ను, బీజేపీని దెబ్బ తీయాలని మమత ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.