ఇద్దరు సీఎంల మధ్య మళ్లీ రేగిన భూవివాదం

yediyurappa-condemns-uddhav-thackerays-statement-on-border-towns

కర్నాటక, మహారాష్ట్ర మధ్య నలుగుతున్న సరిహద్దు వివాదం మరోసారి రచ్చై కూర్చుంది. అయితే ఈసారి నేరుగా ముఖ్యమంత్రులే తలపడుతుండటం, వాగ్వాదానికి దిగడం గమనించదగ్గ పరిణామం. కర్నాటక భూభాగంలో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేసుకుంటామని సీఎం ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి. ‘‘మహారాష్ట్ర సంస్కృతితో సంబంధమున్న ప్రాంతాలను వెనక్కు తెస్తాం. సరిహద్దు యుద్ధ అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి ఇదే. దాన్ని సాధించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.’’ అంటూ ఉద్ధవ్ ట్వీట్ చేశారు.

భగ్గుమన్న సీఎం యడియూరప్ప

కర్నాటక వైపు నుంచి ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోడానికి తాము ఏమాత్రం సిద్ధంగా లేమని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. కర్నాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు సిద్ధమని సీఎం ఉద్ధవ్ ట్వీట్ చేయడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు సమాఖ్య వ్యవస్థకే విరుద్ధమని, కర్నాటకలో మహారాష్ట్రీయులు, కన్నడీగులు సోదరభావంతోనే నివసిస్తున్నారని యడియూరప్ప పేర్కొన్నారు.

ఎప్పడిదీ వివాదం...?

అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో బెళగావితో పాటు మరికొన్ని ప్రాంతాలు మైసూరులో కలిశాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా మరాఠీ భాషనే వాడతారు. దీంతో తమ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. దీనిపై 1948 లో ‘మహారాష్ట్ర ఏకీకరణ సమితి’ పోరాటం సాగిస్తోంది. 1956 జనవరి 17 న జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి జనవరి 17 న మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఉద్ధవ్ ట్వీట్ చేశారు.

 


                    Advertise with us !!!