
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదని ప్రముఖ సినీనటి, బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. విచ్చల విడిగా దోపిడీలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్థి పథంలో దూసుకెళ్తుందన్నారు. ప్రజలు కోరుకున్నది ఇలాంటి తెలంగాణ కాదు. నా తెలంగాణ ఎటువైపు పోతుందో అర్థం కావడం లేదు. నా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకున్న రాష్ట్రాన్ని సాధించాలన్నా.. అభివృద్ధి తెలంగాణ కావాలన్నా మరోసారి తీవ్రస్థాయిలో ఉద్యమ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చిత్తశుద్ది, ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అన్నారు.