
అమెరికాలో జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటిగా ఉన్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) కొత్త అధ్యక్షుడిగా భువనేశ్ బూజాల బాధ్యతలు చేపట్టారు. నాష్విల్లె నగరంలో జరిగిన ఆటా బోర్డు మీటింగ్‌లో నూతన కార్యవర్గం కూడా పదవి బాధ్యతలు స్వీకరించింది. తదుపరి ప్రెసిడెంట్‌గా మధు బొమ్మినేని ఎన్నికయ్యారు.
వాషింగ్టన్ డీసీలో ఉంటున్న భువనేశ్ 2004 సంవత్సరం నుంచి ఆటాలో ఉత్సాహంగా పాలుపంచుకొంటున్నారు. 2014లో జరిగిన ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌లో కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన నాశ్విల్లే నగరంలో జనవరి 16న జరిగిన అట కార్యవర్గ సమావేశంలో ప్రెసిడెంట్ పదవిని అధిరోహించారు. డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆటా బోర్డు అఫ్ ట్రస్టీస్‌గా జయంత్ చల్లా, కాశీ విశ్వనాధ్ కొత్త, పరశురాం పిన్నపురెడ్డి, శారద సింగిరెడ్డి, సోమశేఖర్ నల్ల, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, హను తిరుమల్ రెడ్డి, ప్రశీల్ గూకంటి, రఘువీర్ రెడ్డి, రామ్ అన్నాడీ , రవీందర్ గూడూర్, రింద సామ, శరత్ వేముల, సుధీర్ బండారు, విజయభాస్కర్ తుపల్లి ఎన్నికయ్యారు. ఆటా ప్రెసిడెంట్‌గా భువనేశ్ బుజాల, సెక్రటరీగా హరిప్రసాద్ రెడ్డి లింగాల, ట్రెజరర్‌గా సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ ట్రజరర్‌గా విజయ్ కుందూరు ఎన్నిక అయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆటా కొత్త అధ్యక్షుడు భువనేశ్ బుజాల మాట్లాడుతూ.. ఆటా ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తున్నామని చెప్పారు. ఆపదలో ఉన్న తెలుగు వారు ఆటా సేవ 1-844-ATA-SEVA టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చెయ్యవల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆటా ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆటా ఎల్లప్పుడూ పెద్ద ముందుంటుందని పేర్కొన్నారు. మన మాతృభూమిలో సేవ కార్యక్రమాలు నిర్వహించాలనుకునే ప్రవాసులు ఆటాను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ నిర్వహణ కార్యక్రమలో అమెరికాలో పుట్టి పెరిగిన మన పిల్లలను బాగస్వాములను చేయటానికి తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఆయన బోర్డును కోరారు. యూత్ కమిటీ ఏర్పాటు చేశారు.
మొదటిసారిగా ఆటా కన్వెన్షన్‌ను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో 2022 సంవత్సరంలో జులై 1 నుంచి 3 తేదీలలో నిర్వహిస్తున్నామని అందరూ ఈ కాన్ఫరెన్స్ కు రావాలని కోరారు. కోవిడ్ - 19 సమయంలో సహాయక చర్యలు, సంస్థ బాధ్యతలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి పదవి విరమణ చేసిన పరమేష్ భీంరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన రవి పట్లోళ్ల, మాజీ అధ్యక్షుడు కరుణాకర్ ఆసిరెడ్డిని బోర్డు అభినందించింది. నాష్విల్లే నగరంలో ఆతిధ్యం ఇచ్చిన ఆటా సభ్యులకు బోర్టు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆటాకి తోడ్పాటు అందిస్తున్న లోకల్ ఆర్గనైజేషన్స్ ను బోర్డు ప్రశంసించింది.