ఫేస్‌బుక్‌, ట్విటర్ లకు కేంద్రం ఝలక్

Parliamentary panel on IT summons Facebook and Twitter officials on Jan 21

జాతీయంగా, అంతర్జాతీయంగా వ్యక్తిగత గోప్యతపై అత్యున్నత స్థాయిలో ప్రచారం హోరెత్తుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్‌, ట్విట్టర్లకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఝలక్‌ ఇచ్చింది. పౌరుల హక్కుల పరిరక్షణ, వారి హక్కుల దుర్వునియోగాన్ని నివారించడం, డిజిటల్‌ స్పేస్‌లో మహిళల భద్రత తదితర అంశాలపై విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 21వ తేదీన విచారణ జరుగుతుందని తెలిపింది. వ్యక్తిగత గోప్యతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఫేస్‌బుక్‌, ట్విటర్ట్‌లకు విచారణకు హాజరు కావాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆదేశించింది.

ఇంతకుముందు గతేడాది అక్టోబర్‌లో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ప్రతినిధులు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. డేటా ప్రొటెక్షన్‌, ప్రైవసీ అంశాలపై చర్చించారు. ఫేస్‌బుక్‌ అనుబంధ వాట్సాప్‌ తన యూజర్ల ప్రైవసీ పాలసీని అప్‌డేట్‌ చేస్తున్నట్లు ప్రకటించి.. తర్వాత వెనక్కు తగ్గింది. ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటా షేర్‌ చేసుకుంటామని వాట్సాప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వాట్సాప్‌ యూజర్లు లక్షల మంది మూకుమ్మడిగా ప్రత్యామ్నాయ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌లు టెలిగ్రాం, సిగ్నల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో కొత్త ప్రైవసీ పాలసీ అమలును ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మే 15వ తేదీకి వాట్సాప్‌ వాయిదా వేసింది.