
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తన బృందంలో 20 మంది భారతీయ అమెరికన్లకు కీలక పదవులు కల్పించారు. వీరిలో 13 మంది మహిళలే. అమెరికా జనాభాలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న భారతీయ అమెరికన్లకు ప్రభుత్వ యంత్రాంగంలో ఈ స్థాయిలో పదవులు లభించటం విశేషం. అందులోనూ శక్తిమంతమైన వైట్‌హౌజ్‌లో 17 మందికి చోటు దక్కటం మనవారి ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నది. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఈ నెల 20న జో బైడెన్ ప్రమాణం చేయనున్నారు. భారతీయ మూలాలున్న కమలాహ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే ఇంతమంది భారతీయ అమెరికన్లకు అధ్యక్ష బృందంలో చోటు దక్కటం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో మరింత మంది భారతీయ అమెరికన్లకు పదవులు దక్కే అవకాశం ఉన్నది.
అత్యంత కీలకమైన వైట్‌హౌజ్ మేనేజ్మెంట్, బడ్జెట్ డైరెక్టర్‌గా నీరా టాండన్‌ను బైడెన్ నియమించారు. యూఎస్ సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తి, అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా, స్టేట్ ఫర్ సివిలియన్ సెక్యూరిటీ, డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ అండర్ సెక్రటరీగా ఉజ్రా జెయా నియమితులయ్యారు. బైడెన్ సతీమణి, అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు పాలసీ అడ్వైజర్‌గా మాలా అడిగా, డిజిటల్ డైరెక్టర్‌గా గరిమా వర్మను నియమించారు. వైట్‌హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రినా సింగ్ నామినేట్ అయ్యారు.
తొలిసారిగా, కశ్మీర్ మూలాలున్న ఇద్దరు ఇండియన్ అమెరికన్లు బైడెన్ బృందంలో చోటు దక్కించుకున్నారు. వైట్‌హౌజ్ డిజిటల్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ మేనేజర్‌గా అయేషా షా నియమితులు కాగా, జాతీయ ఆర్థిక మండి డిప్యూటీ డైరెక్టర్‌గా సమీరా ఫాజిలీ నామినేట్ అయ్యారు. వినయ్‌రెడ్డికి స్వీచ్రైటింగ్ డైరెక్టర్‌గా నియమించారు. అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా వేదాంత్ పాటిల్‌ను, ప్రెసిడెన్షియల్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్ రాఘవన్‌ను నామినేట్ చేశారు. కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ముగ్గురికి, వైట్‌హౌజ్ కౌన్సిల్లో ఇద్దరికీ చోటు లభించింది. కొవిడ్ టెస్టింగ్ పాలసీ అడ్వైజర్‌గా విదుర్ శర్మను నామినేట్ చేసిన బైడెన్ క్లైమేట్ పాలసీ సీనియర్ అడ్వైజర్‌గా సోనియా అగర్వాల్‌ను నియమించారు.