ప్రవాస భారతీయులు కోటీ 80 లక్షలు!

India has world s largest diaspora

ఇతర దేశాల్లో జీవిస్తున్న భారతీయుల సంఖ్య 2020 నాటికి కోటీ 80 లక్షల పైమాటేనని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ప్రపంచంలోని అతి పెద్ద 'శక్తివంతమైన, చైతన్యశీలమైన' ప్రవాస సమూహంలో ఒకటిగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. భారత దేశం నుంచి వచ్చే వారిలో ఎక్కువ మంది యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌, అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో స్థిరపడుతున్నారని అది తెలిపింది.

''ప్రపంచంలోని బహుళజాతి జనాభాలలో అతి పెద్దది భారతదేశమే. ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయుల సంఖ్య 18 మిలియన్ల పైమాటే. ఇది చెప్పుకోదగ్గ సంఖ్య. భారతీయ వలస జనాభా గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశమేమిటంటే, వీరు ప్రపంచమంతా విస్తరించారు'' అని ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (యు.ఎన్‌.డి.ఇ.ఎస్‌.ఏ)లో జనాభా విభాగంలో పనిచేస్తున్న జనాభా వ్యవహారాల అధికారి క్లేర్‌ మెనోజీ తెలియజేశారు.

సాధారణంగా ఎక్కువ బహుళజాతి జనాభాలు ఒక దేశంలోనో, ఒక ప్రాంతంలోనో స్థిరపడతాయని, కానీ, భారతీయులు మాత్రం గల్ఫ్‌ నుంచి ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వరకు అన్ని దేశాల్లో, అన్ని ఖండాల్లో వ్యాపించి ఉన్నారని మెనోజీ తెలిపారు. ''ఇది ప్రపంచంలోనే అత్యంత 'శక్తిమంతమైన, చైతన్యశీలమైన' జనాభా అని ఆమె అభివర్ణించారు.

యు.ఎన్‌.డి.ఇ.ఎస్‌.ఏ జనాభా విభాగం 'అంతర్జాతీయ వలసలు 2020 విశేషాలు' పేరుతో గత శుక్రవారం నాడు ఒక నివేదిక విడుదల చేసింది. 2020 నాటికి తమ దేశం బయట నివసిస్తున్న భారతీయుల సంఖ్య కోటీ 80 లక్షలు (18 మిలియన్లు) అని వెల్లడించింది. ఇదే విధంగా అత్యధిక ప్రవాస జనాభా కలిగిన దేశాలు మెక్సికో, రష్యా (తలొక 11 మిలియన్లు), చైనా (10 మిలియన్లు), సిరియా (8 మిలియన్లు) అని నివేదిక తెలియజేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ జనాభా కలిగిన దేశం మాత్రం భారతదేశమేనని అంటూ, ఈ విషయంలో ఆ తరువాతి స్థానం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (3.5 మిలియన్లు), అమెరికా (2.7 మిలియన్లు), సౌదీ అరేబియా (2.5 మిలియన్లు) ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది.

భారతదేశం నుంచి వచ్చే వలసదారులకు ఆతిథ్యం ఇస్తున్న ఇతర దేశాలలో ఆస్ట్రేలియా, కెనెడా, కువైట్‌, ఒమెన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, బ్రిటన్‌లు కూడా ఉన్నాయి. 2000, 2020 మధ్య ఇతర దేశాలకు వలస వెళ్లే జనాభా బాగా పెరిగిపోయింది. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి జరిగింది. దీనివల్ల భారత్‌ బాగా లబ్ధి పొందింది. భారత్‌ నుంచి సుమారు కోటి మంది వలస వెళ్లారు. ఆ తరువాతి స్థానాలు వరుసగా సిరియా, వెనిజులా, చైనా, ఫిలిప్పీన్స్‌కు దక్కుతాయి. భారతదేశం నుంచి ఎక్కువగా కార్మిక, కుటుంబ కారణాల వల్ల వలస వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో బలవంతంగా వలసలు చేయించడం అన్నది చాలా తక్కువే (10 శాతం మాత్రమే)నని యు.ఎన్‌.డి.ఇ.ఎస్‌.ఏ జనాభా విభాగం డైరెక్టర్‌ జాన్‌ విల్‌మోత్‌ ఈ నివేదిక విడుదల చేస్తూ విలేఖరులకు తెలిపారు.

భారతదేశం నుంచి వలస వచ్చినవారిలో ఎక్కువ మంది ఉద్యోగం కోసమే అయినప్పటికీ, చదువుల కోసం, కుటుంబ కారణాల వల్ల వచ్చిన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుందని మెనోజీ వెల్లడించారు.