వైకాపా వాళ్లను కేసుల నుంచి తప్పిస్తారా? : చంద్రబాబు

Chandrababu Naidu Press Meet

ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలపై 150 దాడులు జరిగే వరకు రాష్ట్రం ప్రభుత్వం పట్టించుకోలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆలయాలపై జరిగిన దాడులతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, ఉన్మాదులు, మతిస్థిమితం లేనివారే దాడులకు పాల్పడ్డారని భోగి రోజు డీజీపీ అన్నారని పేర్కొన్నారు. కనుమ రోజు మాట మార్చిన డీజీపీ, ఆలయాలపై దాడులను ప్రతిపక్షాలకు అంటగడుతున్నారంటూ మండిపడ్డారు. దాడులు చేసిన వైకాపా వాళ్లను కేసుల నుంచి తప్పిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిపై ఉన్న భక్తితో దాడులను బయటపెట్టిన వాళ్లపై కేసులు పెడతారా? విధ్వంసాలు చేసిన వైకాపా వాళ్లపై కేసులు లేవా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్క్రిప్ట్‌, సీఎం జగన్‌ డైరెక్షన్‌లో డీజీపీ బాగా నటిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైకాపా దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలకు తిరుపతి ఉప ఎన్నిక అవకాశం లాంటిదన్నారు. వైకాపా ఓటమి ద్వారా చరిత్రాత్మక తీర్పునకు తిరుపతి వేదిక కావాలని, దేశానికే ఒక సందేశాన్ని తిరుపతి ప్రజలు పంపాలని చంద్రబాబు కోరారు.

 


                    Advertise with us !!!