
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి రోజు 140 కేంద్రాల్లో పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే 3.64 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు, 20 వేల కొవాగ్జిన్ టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు తొలిటీకాను పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మకు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విజయవాడ జీజీహెచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొని టీకా పంపిణీని ప్రారంభించారు. తొలి టీకా పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారికి ఇచ్చారు. రాష్ట్రంలోని 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. రాష్ట్రానికి 4.96 లక్షల డోసుల టీకా వచ్చింది. ఇందులో 20 వేల డోసులు కొవాగ్జిన్ (భారత్ బయోటెక్), మిగిలినవి కొవిషీల్డ్ (సీరం). తొలివిడతలో కొవిషీల్డ్నే లబ్ధిదారులకు వేయనున్నారు.
తొలి రోజు ఒక్కోచోట వందమంది చొప్పున 332 కేంద్రాల్లో 33,200 మందికి టీకాలు ఇవ్వబోతున్నారు. ప్రాధాన్యక్రమంలో వీరి సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచారం వెళ్లడం మొదలైంది. దీని ప్రకారం వారు టీకా వేయించుకోవాలి. గుర్తింపుకార్డు చూపిస్తేనే పంపిణీ కేంద్రాన్ని అనుమతిస్తారు. కనీసం 15 రోజుల వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రోజూ 33,200 మందికి టీకా వేస్తారు. టీకా వేయించుకున్న వారికి తిరిగి 28 రోజుల తర్వాత మలివిడత టీకా వేస్తామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని తెలిపారు. ఈ 332 కేంద్రాల్లో కలిపి 2,324 మంది విధులు నిర్వర్తించబోతున్నారు. ప్రతి కేంద్రంలో మూడు గదులు ఏర్పాటు చేశారు. టీకా పంపిణీ సందర్భంగా ఎవరికైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తితే వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేక బృందాలను వైద్యశాఖ సిద్దం చేసింది.