
అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈనెల 20వ తేదీన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంకోసం ఆహ్వానపత్రాలను కూడా అందంగా ముద్రించారు. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్, లేడీ గాగా వంటి పలువురు ప్రముఖ పాప్ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అమెరికాలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడిగా జో బైడెన్(78), ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్(56) వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వెస్ట్‌ఫ్రంట్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చాలా కొద్దిమంది మాత్రమే హాజరుకానున్నారు. పలు కార్యక్రమాలు వర్చువల్‌గానే ఉంటాయి. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో 10వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్లో పహారాకు నియమించారు.