తానా అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ

TANA President Elections 2021

ఉధృతమవుతున్న తానా ఎన్నికల ప్రచారం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) అధ్యక్ష పదవికి పోరు ఈసారి ఉధృతంగా జరిగేటట్లు కనిపిస్తోంది. ఎన్నడూ లేనంతగా ప్రెసిడెంట్‍ ఎలక్ట్ పదవికోసం నలుగురు పోటీ పడుతున్నారు. నాలుగు దశాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న తానా  అమెరికాలోనూ, ఇటు తెలుగురాష్ట్రాల్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. రెండేళ్ళకోమారు జరిగే తానా మహాసభలు వస్తున్నాయంటే ప్రపంచం మొత్తం ఆ వేడుకకోసం ఎదురు చూసేది. ఆ మహాసభల్లో పాల్గొనడమే ఓ ప్రతిష్టాత్మకమని అప్పుట్లో కళాకారులు, సాహితీవేత్తలు భావించేవారు. అలాంటి తానాకు నాయకత్వం వహించేందుకు ఎంతోమంది ఉవ్విళ్ళూరేవారు. గతంలో ఆ పదవికి పెద్దలు మాత్రమే పోటీ పడేవారు. తరువాత యువ నాయకులు కూడా మేము కూడా పోటీ చేస్తామంటూ ముందుకు వచ్చారు. తాజాగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి తాము సిద్ధమేనంటూ ప్రస్తుత తానా ఫౌండేషన్‍ అధ్యక్షుడు నిరంజన్‍ శృంగవరపు, మాజీ బోర్డ్  చైర్మన్‍ నరేన్‍ కొడాలి, ఫౌండేషన్‍ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస గోగినేని ప్రకటించారు. తానా చరిత్రలో మొదటిసారిగా ఈ పదవికి ముగ్గురు పోటీ పడుతున్నారు. తానా పెద్దలు గతంలో ఎన్నికలను నివారించేందుకు అభ్యర్థులతో చర్చించి ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేలా చూసేవారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో ఈ పదవికి చతుర్ముఖ పోటీ ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పోటీపడుతున్న అభ్యర్థులంతా ఎవరికివారు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

ఎన్నికల ప్రచారసరళి మారింది...

తరం మారింది..దాంతోపాటు ఎన్నికల ప్రచార తీరు కూడా మారింది. సోషల్‍మీడియా బాగా పాపులర్‍ కావడంతో తానా ప్రచార సరళి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సరళిని మించిపోయేలా జరగడం ప్రారంభమైంది. ఎవరికివారు సోషల్‍ మీడియాలో తమ ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు మీడియాలో కూడా తమ ప్రచారాన్ని చేస్తున్నారు. శ్రీనివాస గోగినేని మొదటగా ప్రచారాన్ని ప్రారంభించారు. టీవీలోనూ, పత్రికల్లోనూ తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తరువాత నిరంజన్‍ శృంగవరపు కూడా తాను కూడా బరిలోకి దిగుతున్నట్లు పత్రికల ద్వారా ప్రకటించారు. సోషల్‍మీడియాలో కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు నరేన్‍ కొడాలి కూడా పోటీలోకి దిగుతున్నట్లు సోషల్‍ మీడియా ద్వారా ప్రకటించారు. దాంతో తానా అధ్యక్ష ఎన్నికల వేడి పుంజుకుంది. మరోవైపు తానా పెద్దలు ఈ పోటీని ఎలా నివారించాలనే విషయంలో ఆలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పోటీ పడుతున్న అభ్యర్థులు మాత్రం తాము పోటీ చేసే తీరుతామని ఖచ్చితంగా ప్రకటించడంతో అధ్యక్ష పదవికి పోటీ ఖాయమైనట్లే.

ప్రారంభమైన ప్రశ్నల పరంపర...

తానా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్లు అభ్యర్థులు ప్రకటించిన వెంటనే సోషల్‍మీడియా వేదికగా ప్రశ్నలు, విమర్శలు, ఆరోపణల పర్వానికి తెరలేస్తోంది. సోషల్‍ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తరువాత   తానా అభ్యర్థులు ప్రచారానికి సోషల్‍ మీడియాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. మరోవైపు సోషల్‍ మీడియాను ఉపయోగించుకుని ప్రత్యర్థులు తమపోటీ అభ్యర్థులపై విమర్శనాస్త్రాలను ప్రయోగిస్తున్నారు.

ఇందులో భాగంగా విద్యాగారపాటి నాలుగు ప్రశ్నలను ప్రస్తుత తానా ఫౌండేషన్‍ అధ్యక్షుడు, తానా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నిరంజన్‍ శృంగవరపుపై ఎక్కుపెట్టి సంధించారు.

ఆ ప్రశ్నలు ఇవే...

ఫెరా రెన్యువల్‍ సమయం గడిచిపోయినా రెన్యువల్‍ చేయకపోవడం మీ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.

ఇండియాలో తానా ఫౌండేషన్‍ ట్రస్టీలు ఇద్దరు చనిపోయారు. వారి ప్లేస్‍లో మీరు వేరేవాళ్ళను ఎందుకు నియమించలేదు?
కోవిడ్‍ సమయంలో మీరు తానాకు 100,000 డాలర్లు విరాళం ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు కదా? ఆ నిధులను దేనికి ఖర్చు పెట్టారు?
తానా ఫౌండేషన్‍ నిధులను వివిధ స్వచ్ఛంద సంస్థలకు కేటాయించారన్న దానిపై మీ సమాధానమేమిటి?

సమాధానాలిచ్చిన నిరంజన్‍ వర్గం

విద్యాగారపాటి అడిగిన ప్రశ్నకు తానా ఫౌండేషన్‍ సెక్రటరీ ద్వారా నిరంజన్‍ శృంగవరపు సమాధానాలిచ్చారు.  ఫెరా రెన్యువల్‍ గడువు తీరిపోలేదని ఇంకా సమయం ఉందని అంటూ భారత ప్రభుత్వం వెలువరించిన జీవో కాపీని చూపించారు. అలాగే తానాకు తాను విరాళం ఇచ్చిన 100,000 డాలర్లు దేనికి ఖర్చు పెట్టాలన్న దానిపై తానా బోర్డ్ గతంలోనే చర్చించిందని దాని గురించి వివరాలను ఆయన తానా బోర్డ్ను అడిగి తెలుసుకోవచ్చన్నారు. సామాజిక మాధ్యమంలో అలాంటివి చర్చించడం మంచిది కాదన్నారు. తానా ఇండియా ఫౌండేషన్‍ ఓ ఎన్‍జీవో సంస్థ, ట్రెజరర్‍ అకస్మాత్తుగా మరణించడంతో సేవా కార్యక్రమాలు నిలిచిపోకుండా ఇతర ఎన్‍జీవో సంస్థల ద్వారా నిధులు మంజూరు చేసి సేవా కార్యక్రమాలు చేశామని నిరంజన్‍ శృంగవరపు పేర్కొన్నారు. మరణించిన తానా ట్రస్టీల స్థానంలో  ఇతరులను నియమించడం కూడా జరిగిందన్నారు.

శ్రేయోభిలాషుల మాట...

తానా ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అని, ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తోందని, ఎంతోమంది సభ్యులు తానాలో ఉన్నారని, సేవ చేయడంలో తానా సభ్యులు ఎల్లప్పుడూ ముందుంటారన్న మంచి పేరు ఉంది. కాని తానా  ఎన్నికల సమయంలో కొంతమంది సభ్యులు ప్రత్యర్థులను ఇరుకునపెట్టాలన్న ఉద్దేశ్యంతో సంస్థకు సంబంధించిన అంతర్గత విషయాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తుంటారు. దానికి ఎదుటివర్గం సమాధానమివ్వడం వంటివి జరుగుతోంది. అలా కాకుండా  భవిష్యత్తులో తానాకు ఏ విధంగా సేవ చేయనున్నారు? తానా ఇమేజ్‍ను ఎలా విస్తృతం చేయనున్నారన్న వంటి విషయాలపై వారిని ప్రశ్నిస్తే బావుంటుందని శ్రేయోభిలాషులు అంటున్నారు.

 


                    Advertise with us !!!