
తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ 2.5/5
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
నిర్మాణ సంస్థ : ఎక్స్‌బీ ఫిలిమ్స్ క్రియేటర్స్
నటీనటులు : ఇళయదళపతి విజయ్, విజయ్ సేతుపతి, మాళవికా మోహన్, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్, గౌరి జి కిషన్, అళగమ్ పెరుమాళ్, శ్రీమాన్, పూవైయార్ తదితురులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్
ఎడిటర్ : ఫిలోమన్ రాజు
నిర్మాత : జేవియర్ బ్రిట్టో
దర్శకత్వం : లోకేశ్ కనకరాజ్
విడుదల తేది : 13. 01. 2021
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డావులే మాస్టారు! ఈ ఫస్ట్ లైన్ లోనే ఈ సినిమా రివ్యూ ఎలా ఉంటుందో అర్ధమయ్యే ఉంటుంది 'మాస్టర్’ సినిమా విషయం లో అదే జరిగింది ఈ సంక్రాంతి మాస్టారు ఇరగదీసాడు అని సౌత్ ఇండియా సినీ పండితులు మంత్రాలు వల్లించారు ఏం జరిగింది మాస్టర్ అంటే విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలు చెప్పాలి అలా చేస్తే మైండ్‌కి ఇట్టే ఎక్కేస్తుంటుంది. కొంతమంది మాస్టర్లు ఎంత చించుకున్న వారు చెప్పిన పాఠాలు ఎక్కవు.పుస్తకాలు ఒకటే చెప్పే విధానంలో తేడా ఉంటే రిసీవింగ్‌లో లెక్క తప్పుతుంది ‘మాస్టర్’ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తూ.. అగ్ర కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. వరుసగా సినిమాలను ప్రకటిస్తూ సత్తా చాటుతున్నాడు. పేరుకు తమిళ్ హీరో అయినా.. తన ప్రతి సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి మార్కెటింగ్ సంపాదించుకున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన చిత్రమిది. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో ఆగిపోయింది. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా ‘మాస్టర్’ అనే సినిమాతో బోగి రోజున బుధవారం ప్రేక్షకుల మందుకు వచ్చాడు. మాములుగా విజయ్ మూవీ అంటేనే ఫ్యాన్స్‌లో క్రేజ్ విపరీతంగా ఉంటుంది. అలాంటిది ఈ చిత్రంలో విజయ్‌తో పాటు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అటు కోలీవుడ్ ఇండస్ట్రీ.. ఇటు అభిమానుల్లోనూ ఎక్స్‌పెక్టెషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ సంక్రాంతికి ఈ సినిమా ఇరగదీస్తుంది అన్నారు టాలీవుడ్ జనం మరి నిజమైన సినీ ప్రేక్షకజనం ఏం తీర్పు ఇచ్చారో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
భవాని(విజయ్ సేతుపతి) వరంగల్‌లో ఓ పేరు మోసిన రౌడీ. తాను ఎలా ఉంటాడో జనాలకు ఎక్కువ తెలియదు కానీ. తను ఎంతటి క్రూరుడో జిల్లా మొత్తానికి తెలుసు. లారీలలో మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ, రాజకీయంగా ఎదగాలని చూస్తాడు. అందులో భాగంగా మొదటగా లారీ యూనియన్ అధ్యక్షుడు కావాలనుకుంటాడు. పోటీలో ఉన్న ప్రత్యర్థులను హతం చేసి ఏకగ్రీవంగా లారీ యూనియన్ అధ్యక్షుడు కావాలని ప్లాన్ వేస్తాడు. ఇదిలా ఉంటే..జేడీ మాస్టర్ (విజయ్) ఎలాంటి నియమ నిబంధనలు లేని ఓ కాలేజీ ప్రొఫెసర్. మద్యానికి బానిసై తోటి సిబ్బందికి తలనొప్పిగా మారుతాడు. అతనంటే సహచర ఉద్యోగులకు ఇష్టం లేకపోయినా... విద్యార్థులకు మాత్రం ఆయనే హీరో. జేడీ సర్ లేనిదే కాలేజీలో ఎలాంటి కార్యక్రమాలు జరనిగవ్వరు. ఆయన కోసం ఏ పని చేయడానికైనా విద్యార్థులు సిద్దంగా ఉంటారు. అలాంటి జేడీ కొన్ని కారణాల వల్ల వరంగల్‌లోని బాల నేరస్థులకు పాఠాలు బోధించాల్సి వస్తుంది. తొలుత అయిష్టంగానే అక్కడి వెళ్లిన జేడీకీ.. ఆదిలోనే అనుకోని ఒక సంఘటన ఎదురవుతుంది. ఈ క్రమంలో జేడీకి భవానికి పరోక్షంగా పోరు మొదలవుతుంది. అసలు బాల నేరస్థులకు, భవానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మద్యానికి బానిసైన జేడీ.. ఉన్నపళంగా తాగుడు మానేసి, పిల్లలను రక్షించేందుకు ఎందుకు పూనుకున్నాడు? భవాని ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యాన్ని జేడీ ఏవిధంగా కుప్పకూల్చాడనేదే మిగత కథ.
నటీనటుల హావభావాలు :
హీరో విజయ్ క్యారెక్టరైజేషన్ కూడా ఏ మాత్రం కొత్తగా లేదు. తాగుబోతు ప్రొఫెసర్ మంచి మనిషిగా మారడానికి బలమైన కారణం చూపించిన దర్శకుడు తొలుత అతన్ని తాగుబోతు ప్రొఫెసర్‌గా ఎందుకు ప్రజెంట్ చేశారన్నది చెప్పలేదు. అయితే విజయ్ మాత్రం తన పెర్పామెన్స్ పరంగా ఫుల్ మీల్స్ అనేట్టుగానే చేశాడు. ఊర మాస్ మాస్టర్‌గా తీన్మార్ స్టెప్పులు వేస్తూ.. స్టైలిష్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి చాలా క్రూరంగా కనిపించాడు. మాస్ గెటప్‌లో ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకున్నాడు. అతని డైలాగ్‌లు బాగా పేలాయి. విజయ్- విజయ్ సేతుపతి ఎదురపడే సీన్ లో పోటాపోటీగా నటించారు. విజయ్ పాత్ర రొటీన్ కాగా.. విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్ వైవిధ్యంగా ఉంటుంది. విజయ్-విజయ్ సేతుపతిల మధ్య క్లైమాక్స్ ఫైట్ బావుంది. హీరోయిన్లు సినిమాలో ఉండాలి కాబట్టి మాళవికా మోహనన్, ఆండ్రియాలు హీరోయిన్స్‌గా ఉన్నారంటే ఉన్నారు అంతే. కమర్షియల్ సినిమాలో హీరో పక్కన పాటల కోసమైనా హీరోయిన్ని పనికట్టుకుని సీన్లో పెడుతుంటారు. కానీ ‘మాస్టర్’లో అలాంటి స్కోప్ కూడా లేదు. ఆండ్రియాని చివర్లో విలన్లపై బాణాలు వేయడానికి పెట్టినట్టు ఉండగా.. మాళవికా మోహనన్ని రెండు మూడు సీన్లకు పరిమితం చేశారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీకి ఆస్కారమే లేదు. ఇక ఇతర పాత్రల్లో చేసిన వాళ్లంతా తెలుగు నటి నటులు కాకపోవడంతో ఆ పాత్రలు మన వారికి కనెక్ట్ అయ్యే విధంగా అయితే లేవు.
సాంకేతికవర్గం పనితీరు :
‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో వస్తున్న చిత్రం కావడంతో మాస్టర్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలు దర్శకుడు అందుకోలేకపోయాడనే చెప్పాలి. విజయ్ లాంటి మాస్ హీరోతో ఓ సందేశాత్మక చిత్రానికి కమర్షియల్ మసాలాలు జోడించి చెప్తామనుకొన్న డైరెక్టర్ తడబడ్డాడు. అయితే ‘మాస్టర్’ సినిమాతో ఆ అంచనాలను అందుకోలేకపోయాడు దర్శకుడు. అనిరుధ్ మ్యూజిక్ విషయానికి వస్తే.. పాటలపై కంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌పైనే ఎక్కువ శ్రద్ధపెట్టినట్టుగా అనిపిస్తుంది. హీరో ఎంట్రీకి పది నిమిషాల పాటు తీన్మార్ దరువుతో మోత మోగించాడు. చిట్టి స్టోరీ, మాస్టర్ కమింగ్ సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. కొన్ని చోట్ల మరీ ఆర్ ఆర్ మోతాదుకి మించి ఉన్నట్టుగా అనిపిస్తుంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కాలేజ్, జైలు ఈ రెండు లొకేషన్స్‌లోనే ఎక్కువ సీన్లు ఉండటంతో పరిమితమైన లొకేషన్లలోనే చిత్రీకరణ జరిగినట్టుగా అనిపిస్తుంది. ఇక డబ్బింగ్ కూడా మక్కీకి మక్కీ తమిళ్ డైలాగ్‌లు చెప్పినట్టుగా ఉన్నాయి. అక్కర్లేని సీన్లతో మరీ మూడు గంటల నిడివి అవసరమా అనిపిస్తుంది. ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్‌కి కత్తిరేస్తే క్రిస్పీగా అనిపించేది ఎడిటింగ్ మోడిఫ్య్ వుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
హీరో విలన్ లకు ఎంత మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ కథలో పసలేకపోతే ఎన్ని ఎలివేషన్స్, ఊర మాస్ ఎలిమెంట్స్ పెట్టినా లాభం ఉండదు. విజయ్, విజయ్ సేతుపతి.. ఇద్దరూ ఇద్దరే. ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోలకు డీల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఓ మోస్తరు కథనైనా తమ భుజాలపై వేసుకుని బాక్సీఫీస్ వద్ద కాసులు కురిపించే సత్తా ఉన్న ఈ ఇద్దరు హీరోలను సరిగా ప్రజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు. తొలిభాగం అసలు కథ చెప్పకుండా హీరోని, విలన్ని హైలెట్ చేయడానికే కేటాయించాడు. మత్తుకు బానిసైన ఫ్రొఫెసర్ పట్ల విద్యార్థులు అంతలా ఎందుకు అభిమానం చూపిస్తారో బలమైన కారణాలు చూపించలేకపోయారు. అసలు కథ ఏంటో సెకండాఫ్‌లో చూపిస్తాడు అనుకుంటే.. అక్కడ కూడా కొన్ని సాగతీత సీన్లు ఇబ్బంది పెడతాయి. కథ కూడా సగటు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతుంది. బాల నేరస్తుల అబ్జర్వేషన్ హోమ్ నేపథ్యంలో కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. చివరాఖరుకు చెప్పాల్సింది ‘మాస్టర్’ మరీ మాస్టర్ పీస్ కానీ కాదు. ఫస్టాఫ్ పర్వాలేదు కానీ.. సెకండాఫ్ బోరింగ్. విజయ్ సేతుపతికి మంచి మార్కులు, విజయ్‌కి పాస్ మార్కులు. ఇక దర్శకుడికైతే తమిళ్ ఆడియన్స్ నుంచి పాస్ మార్కులు పడొచ్చు కానీ.. తెలుగు ప్రేక్షకుడిని మెప్పించడం కష్టమే.