
దేశాధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ మరో ఎనిమిది రోజుల్లో అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దీనితో పాటే, రోజుకు 3,000 మందికి పైగా పొట్టనబెట్టుకుంటున్న ప్రాణాంతక కరోనా మహమ్మారితో పోరాటం జరిపే బాధ్యతను కూడా ఆయన భుజాలకెత్తుకోబోతున్నారు.
ఇక సెనేట్‌లో సంఖ్యాబలాన్ని సాధించడంలో డెమోక్రాట్లు విజయం సాధించారు. ప్రతినిధుల మహాసభలో కొద్దిపాటి సంఖ్యాబలాన్ని కూడగట్టుకోగలిగారు. వైట్‌హౌస్‌ను, కాంగ్రెస్ ఉభయ సభలను తమ అజమాయిషీలో తెచ్చుకున్నందువల్ల, మహమ్మారిని నియంత్రించడంలో జో బైడెన్ ముందు కొత్త మార్గాలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడిందని మా సహచరుడు, 'ది టైమ్స్'లో ఆరోగ్య సంరక్షణ వ్యవహారాలు చూసే అబి గుడ్నో పేర్కొన్నారు.
''ఆయనకు కొన్ని వాస్తవిక, ఆచరణాత్మక ఆలోచనలున్నాయి. అయితే గియితే ఆయనకు అండ నిలిచే కాంగ్రెస్ ఉంది. ఆయన తన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి అది మద్దతునిస్తుంది'' అని అబి వివరించారు. ''ట్రంప్ ఆలోచనల కంటే అవి మెరుగ్గా ఉంటాయా లేదా అన్నది మనం చూడాలి. మహమ్మారిని నియంత్రించడంలో రిపబ్లికన్ల ఆలోచనల కంటే, దృక్పథం, పద్ధతుల కంటే బాగుంటుందా అన్నది వేచి చూడాలి'' అని అబి అన్నారు.
తాను పదవీ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే పది కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరగాలని బైడెన్ ఆశిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే పథకాన్ని ఆయన ప్రవేశపెడతారు. అష్టకష్టాలు పడుతున్న అమెరికన్లు, వ్యాపారాలు, స్థానిక ప్రభుత్వాలు, స్కూళ్లు వగైరాలకు ఊరట కలిగించడానికి ఒక భారీ ఉద్దీపన ప్యాకేజీని తీసుకు వస్తానని బైడెన్ వాగ్దానం చేశారు. వేలాది కోట్ల డాలర్ల ఈ ప్యాకేజీకి కాంగ్రెస్ ఒప్పుదల ఉంటుందని ఆయన ఆశిస్తున్నారు.
డెమోక్రాట్లు అధికారంలోకి వచ్చినందువల్ల, ఆరోగ్య సంరక్షణ మీద చర్యలు తీసుకోవడానికి కూడా బైడెన్‌కు అవకాశం కలిగిందని అబి అన్నారు. ''అందరికీ వైద్య సంరక్షణ'' లేక ప్రజలకే వైద్య అవకాశాలు వదిలేయాలన్న ఆలోచన తదితర అంశాలలో భారీ వ్యవస్థాగత మార్పులు చేయాలని భావిస్తున్నారు. అయితే, కరోనా వైరస్‌పై పోరాటంలో తక్షణ సత్ఫలితాలను సాధించేందుకు డెమోక్రాట్లు అఫోర్డబుల్ కేర్ యాక్ట్‌లో సవరణలు తీసుకు వచ్చే అవకాశం ఉంది.
''మరింత మందిని ఆరోగ్య బీమా కిందకు తీసుకు రావడం ద్వారా కోవిడ్ బారి నుంచి చాలామందిని రక్షించవచ్చు. కోవిడ్ బాధితులను ఆర్థికంగా ఆదుకోవడం ద్వారా సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు'' అని అబి వివరించారు.
వ్యాక్సిన్ సంబంధిత వస్తు సామగ్రిని అమెరికన్ కంపెనీలు మరింతగా ఉత్పత్తి చేయడానికి వీలుగా రక్షణ ఉత్పత్తి చట్టాన్ని ఉపయోగించుకోవాలని తాను భావిస్తున్నట్టు బైడెన్ తెలిపారు. ఆయన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నట్టు (దీని మీద ఉపాధ్యాయ సంఘాలలోని బైడెన్ మిత్రులు వ్యాఖ్యానించాల్సి ఉంది) చెప్పారు. తన మొదటి 100 రోజుల పదవీ కాలంలో ప్రతి ఒక్క అమెరికన్ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆయన కోరుతున్నారు. ఆశించినదాని కంటే తక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సినేషన్ చేయించుకుంటుండడంతో, పలువురు ప్రజారోగ్య సంరక్షణాధికారులు అబిని కలిసి, వ్యాక్సిన్ వేయించుకోవడానికి సందేహించడాన్ని కూడా బైడెన్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
''వ్యాక్సిన్ వల్ల ఎంత భద్రత ఉందో వివరాలతో సహా తెలియజేసి, వ్యాక్సిన్ భద్రత గురించి, దాని సమర్థత గురించి తెలియజేస్తూ బైడెన్ ఒవల్ ఆఫీసు ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగించే పక్షంలో వ్యాక్సిన్ వేయించుకునేవారి సంఖ్య పెరగవచ్చు'' అని అబి ఆశాభావం వ్యక్తం చేశారు. ''ప్రస్తుత ప్రభుత్వ తీరుతెన్నులకు భిన్నంగా బైడెన్ ఈ పని చేస్తారనే భావిస్తున్నాను'' అని అబి పేర్కొన్నారు.