
క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడిపై ఉల్ఫ్ నిష్క్రమణ
గత వారం క్యాపిటల్ హిల్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడికి బాధ్యత వహిస్తూ దేశీయ భద్రతా వ్యవహారాల శాఖ (హోమ్‌లాండ్ సెక్యూరిటీ) ఆపద్ధర్మ మంత్రి చాడ్ ఉల్ఫ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 20న జో బైడెన్ కొత్త అధ్యక్షుడుగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 'సాయుధ నిరసనలు' జరగబోతున్నట్టు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం జరిగింది.
రాష్ట్రాల స్థాయిలో ఉన్న పోలీస్ శాఖలను పర్యవేక్షించడంతో పాటు, ఈ నెల 20న బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆయన శాఖ భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఈ నెల 20న ట్రంప్ పదవీ కాలం ముగిసే వరకూ తాను ఈ పదవిలో కొనసాగుతానని ఉల్ఫ్ గత వారం తెెలిపారు.
''ఈ ప్రభుత్వ పదవీ కాలం ముగిసే వరకూ పదవిలో కొనసాగాలనుకున్నాను. ఇప్పుడు ఈ చర్య తీసుకోవాల్సి రావడం చాలా బాధాకర విషయం'' అని గత సోమవారం నాడు ఉల్ఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సిబ్బందికి ఒక ఈమెయిల్లో తెలిపారు. ''దురదృష్టవశాత్తూ, ఇటీవలి సంఘటనల దృష్ట్యా ఈ చర్య తీసుకోక తప్పలేదు. ఆపద్ధర్మ మంత్రిగా బాధ్యతల నిర్వహణ విషయంలో నాపై కోర్టు చేసిన, చేస్తున్న నిరర్థక వ్యాఖ్యలు కూడా ఇందుకు తోడయ్యాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
''అధికారం బదిలీ అవుతున్న ఈ కీలక సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు, విమర్శలు హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ పనితీరును ప్రభావితం చేయడమే కాక, వనరులను కూడా దారి మళ్లిస్తాయి'' అని ఆయన అన్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆయన రాజీనామా అమలులోకి వచ్చింది.
ఉల్ఫ్ స్థానంలో ఆపద్ధర్మ హోమ్‌లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మంత్రిగా ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధిపతి పీటర్ గెయ్నర్ను నియమించారు. ట్రంప్ పదవీ కాలం ముగిసే వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.
ఒక పోలీస్ అధికారితో సహా అయిదుగురిని పొట్టనబెట్టుకున్న జనవరి 6 సంఘటన జరిగిన తర్వాత ట్రంప్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన మూడవ వ్యక్తి ఉల్ఫ్. గత వారం విద్యాశాఖ మంత్రి బెట్సీ డివోస్, రవాణా శాఖ మంత్రి ఎలైన్ చావ్ రాజీనామా చేశారు.
చాలా నెలల నుంచి ఉల్ఫ్ తన పదవిలో అక్రమంగా కొనసాగుతున్నట్టు హోమ్‌లాండ్ సెక్యూరిటీకి చెందని కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సభ్యుడు అయిన బెన్నీ థాంప్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. ''ఈ రోజు ఆయన తన శాఖకు రాజీనామా చేయడం కూడా ప్రశ్నార్థకమే. దేశంలో సంక్షోభంలో ఉన్న వేళ, దేశీయ ఉగ్రవాదులు ప్రభుత్వం మీద దాడులకు పన్నాగం పన్నుతున్న సమయంలో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనేమీ ఓ సిద్ధాంతానికి కట్టుబడి ట్రంప్ ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నట్టు కనిపించడం లేదు'' అని ఆయన విమర్శించారు.
''ఇటీవలి ఫెడరల్ కోర్టు నిర్ణయాల కారణంగానే ఆయన రాజీనామా చేసిన విషయం నిజమే. అయితే, ఆయన విధాన నిర్ణయాలు నిజంగానే నిరర్థకం. ఈ పరిస్థితుల్లో కెన్ కూచినల్లి కూడా రాజీనామా చేయడం మంచిది'' అని ఆయన అన్నారు. ట్రంప్ పదవీ కాలం ముగుస్తున్న దశలో పలువురు అధికారులు పెద్ద ఎత్తున నిష్క్రమిస్తున్నారు.