
పేదవారికి చేసే సేవను నారాయణ సేవగా అభివర్ణించిన వివేకానందుడి ఆలోచనలను ప్రజలంతా అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వివేకానందుడికి ట్విటర్ ద్వారా నివాళులర్పించారు. భారతదేశ సంస్కృతి, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా భారతీయులను జాగృతం చేసిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానందుడని కొనియాడారు. ప్రపంచ యువనికపై భారతదేశం ఓ శక్తిగా విరాజిల్లాలన్న సంకల్పంతో యువతను ఉత్తేజితం చేసి శారీరక, మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మికత ఆవశ్యకత కోసం ఆయన చేసిన బోధనలు అనుసరణీయమన్నారు. యువత ఈ దిశగా అడుగులు వేసి జీవితాలను ఆనందమయం చేసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు.