అధిష్ఠానంపై కత్తి దూస్తున్న సింధియా

Vasundhara Raje Samarthak Manch comes up in Rajasthan members say want Raje as CM in 2023

మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే సింధియా కొత్త వివాదానికి తెర లేపారు. ఇన్నాళ్లూ చాలా మౌనంగా ఉంటూ, పార్టీ కార్యకలాపాలకు అంటీ ముట్టనట్టుగానే ఉండిపోయిన ఆమె.. హఠాత్తుగా వార్తల్లో నిలిచారు. ఆమె మద్దతుదారులు ఏకంగా ఓ పార్టీని స్థాపించేశారు. అంతేకాదు... వచ్చే ఎన్నికల్లో ఆమెనే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనీ బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. 2023 నాటికి వసుంధరను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ‘వసుంధర రాజే సమర్థక్ రాజస్థాన్ మంచ్’ అన్న పార్టీని స్థాపించామని అధ్యక్షుడు విజయ్ భరద్వాజ్ ప్రకటించారు. ఇప్పుడు ఈ టాపిక్ బీజేపీలో హాట్ టాపిక్‌ అయి కూర్చుంది. ఇప్పటికే 25 జిల్లాలకు కార్యవర్గాన్ని కూడా ప్రకటించేశారు. వసుంధర రాజే పాలనలో సాధించిన విజయాలు, ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. వీటన్నింటితో పాటుగా రాజకీయ పార్టీలకుండే అనుబంధ సంఘాలను కూడా ప్రకటించనున్నారు. ఐటీ సెల్, మహిళా విభాగం, యువజన విభాగం... ఇలా అనుబంధ సంఘాలను కూడా ప్రకటించనున్నారు.

బీజేపీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు..

వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా తిరిగి వసుంధర రాజే సింధియాను ప్రకటించాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ ప్రతిపాదనను బహిరంగంగానే వెలిబుచ్చుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై మాజీ సీఎం వసుంధర ఎలాంటి మాటా మాట్లాడకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. సీఎం అశోక్ గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ మధ్య వివాదం ముదిరి... ప్రభుత్వం పతనం అంచుల వరకు వచ్చినా... ఈ అగ్రనేత మాత్రం ఎలాంటి మాటా మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె మద్దతుదారులు ఏకంగా పార్టీని ప్రకటించి, బీజేపీ మూల సిద్ధాంతమైన ‘వ్యక్తి పూజ’ను ప్రోత్సహిస్తున్నా... వసుంధర మాత్రం కిమ్మనడం లేదు. బీజేపీ ఎమ్మెల్యే, ఆమె మద్దతు దారైన ప్రతాప్ సింగ్ సింఘ్వి వసుంధరను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సిందేనని బహిరంగంగానే డిమాండ్ చేశారు. ‘‘రాజస్థాన్ బీజేపీలో వసుంధర మోస్ట్ పాపులర్ నాయకురాలు. వసుంధరను సీఎం అభ్యర్థిగా ప్రకటించి, ఎన్నికలకు వెళ్తేనే రాజస్థాన్‌లో బీజేపీ జెండా ఎగరుతుంది. సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేసే విషయంలో అధిష్ఠానం ఆమెను సంప్రదించాలి.’’ అని సింఘ్వీ డిమాండ్ చేశారు.

రాష్ట్ర నేతలకు హైకమాండ్ పిలుపు

వసుంధరకు మద్దతుగా ఓ పార్టీ రావడం, సీఎం చేయాలని బహిరంగంగానే డిమాండ్లు తలెత్తుతున్న నేపథ్యంలో అధిష్ఠానం అప్రమత్తమైంది. రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియాను, శాసనసభా పక్షనేత రాజేంద్ర రాథోడ్ తదితరులను హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించింది. ఈ విషయంపై పూనియా మాట్లాడుతూ... ‘‘ఇదేమీ పెద్ద విషయం కాదు. దీని వెనుక ఎవరున్నారన్నది మాత్రం ఇంకా గుర్తించలేదు. అయితే ఈ వ్యవహారం మాత్రం అధిష్ఠానం దృష్టిలో పడింది. పార్టీకి ఒకే ఫేస్ ఉంది. అది ప్రధాని మోదీ.’’ అని పూనియా స్పష్టం చేశారు.

అధిష్ఠానంపై కక్ష తీర్చుకుంటున్నారా?

బీజేపీ మోదీ, షా యుగం ప్రారంభమైన తర్వాత మెళ్లి మెళ్లిగా సీనియర్లను పక్కనబెడుతూ... రాజకీయ అవసరాల దృష్ట్యా అవసరమున్న నేతలను మోదీ,షా ద్వయం తెరపైకి తెస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా మాజీ సీఎం, సీనియర్ నేత వసుంధర రాజే సింధియాను పక్కనపెట్టారు. సంస్థాగత వ్యవహారాల్లో కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ ఆమె వర్గీయులకు, ఆమెకు బీజేపీ సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మోదీ,షా యుగం ప్రారంభం కాని సమయంలో మాత్రం రాజస్థాన్‌లో వసుంధర ఎంత అంటే అంతే. పైగా రాజకుటుంబం. తిరుగులేని అధికారం. కానీ... ఎప్పుడైతే మోదీ,షా యుగం ప్రారంభమైందో... వసుంధరకు, పార్టీకి కాస్త గ్యాప్ పెరిగింది. ప్రస్తుత సీఎం గెహ్లోత్, యువనేత పైలట్ మధ్య వివాదం ముదిరినా, కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుల్లోకి వెళ్లినా... ఓ అగ్రనేతగా, మాజీ ముఖ్యమంత్రిగా వసుంధర కిమ్మనలేదు. సహజంగా ఆ సమయంలో ప్రతిపక్షాలు యమ యాక్టివ్‌గా మారడం రాజకీయాల్లో సహజం. కానీ... వసుంధర మాత్రం ఆ పరిస్థితులను బీజేపీకి అనుకూలంగా మార్చలేకపోయారని, ఉద్దేశపూర్వకంగానే అలా చేశారనీ ఆరోపణలు వచ్చాయి. సీఎం గెహ్లోత్‌కు పరోక్షంగా వసుంధర సహకరిస్తున్నారని, ఆయన సీఎం పీఠానికి ఇబ్బందులు రాకుండా వసుంధర కాపాడుతున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. ఓ రెండు ప్రకటనలు మినహా వసుంధర పెద్దగా స్పందించలేదు.

సరైన సమయానికి ‘ఉనికి’ చాటుతున్న సింధియా

కాలం కలిసిరాని సమయంలో పది అడుగులు వెనక్కి వేస్తే... కాలం కలిసొస్తున్న సమయంలో మాత్రం దూసుకుపోవాలన్నది రాజకీయ సూత్రం. 2023 లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ సమయానికల్లా తన ఉనికిని, అవసరాన్ని బీజేపీ అధిష్ఠానానికి రుచి చూపించాలని వసుంధర డిసైడ్ అయ్యారని ఆమె వర్గీయులు అంటున్నారు. అందుకే ఏకంగా అనుయాయులతో ఓ పార్టీని స్థాపించి, అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలని వసుంధర నిర్ణయించుకున్నారు. ఇది కాస్త... పార్టీలో గందరగోళానికి, గ్రూపు రాజకీయాలకు కారణం అవుతుందని తెలిసినా... వసుంధర మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎలాగైనా... రాజకీయంగా రాష్ట్రంలో పట్టును పెంచుకోవాలన్న దిశగానే ఆమె అడుగులు వేస్తున్నారు.