సత్తా చాటే సమయం వచ్చింది...నిరంజన్‌ శృంగవరపు

Niranjan Srungavarapu to contest TANA Executive Vice President

అమెరికాలో తెలుగువెలుగులను చాటడంతోపాటు...అమెరికాలో ఉన్న తెలుగువారు తమ హక్కుల సాధనలో  ఎదుర్కొంటున్న కష్టాలను అమెరికా ప్రభుత్వానికి తెలియజేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేసే బలమైన సంస్థగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఉండాలని, అమెరికాలో తెలుగువాళ్ళ కేరాఫ్‌ అడ్రస్‌గా 'తానా' నిలవాలన్న ఆకాంక్షతో, తానాను ఆ విధంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో తానా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్లు, ప్రస్తుత తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.

అమెరికాలోని తెలుగువారి సాంస్కృతిక, ఇతర సేవలకు వేదికగా ఉన్న 'తానా' ఇక ముందు కూడా వీటిని కొనసాగిస్తూ, మరోవైపు అమెరికాలో ఉన్న తెలుగువారికి రాజ్యాంగపరంగా ఎదురయ్యే కష్టాలను, సమస్యలను పరిష్కరించే సంస్థగా తానా ఎదగాలంటే ఈ ఎన్నికల్లో పనిచేసేవారికే పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. చాలాకాలంపాటు తానా కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయి ఎన్నికల సమయంలో ముందుకు వచ్చే నాయకుల కన్నా, నిరంతరం తానా  తరపున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నాయకుల వల్లనే తానా ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే మిత్రులు, సన్నిహితులు, ఇతర పెద్దలు ఇచ్చిన సూచనలు, సలహాతో తానా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు నిరంజన్‌ శృంగవరపు పేర్కొన్నారు. తానాతో ఉన్న 15ఏళ్ళ అనుబంధం వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలను తానా తరపున, తానా ఫౌండేషన్‌ తరపున నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అమెరికాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కోవిడ్‌ సమయంలో, లాక్‌డౌన్‌ సమయంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా వారిని ఆదుకునేందుకోసం తానాకు 100,000  డాలర్లను సొంత నిధుల నుంచి విరాళంగా ఇవ్వడంతోపాటు, ఇతర సభ్యులు, దాతలతో కలిసి వివిధ సహాయ కార్యక్రమాలను చేపట్టాను. ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నవారికి నిత్యావసర వస్తువుల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు, ఇతర ఎన్‌జీవో సంస్థలకు అవసరమైన సరకులను, ఆర్థిక సహాయాన్ని ఫౌండేషన్‌ తరపున అందించడం జరిగింది. మారుమూల ప్రాంతాల్లో కూడా తానా ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలను ఈ సమయంలో చేసిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.

తానా కార్యనిర్వాహకవర్గంతో ఎన్నో ఏళ్ళు కలిసి పనిచేసిన అనుభవం, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా టీమ్‌ను నడిపిన అనుభవం వల్ల తానా అధ్యక్షుడిగా ఎన్నికైతే అందరినీ కలుపుకుని సమష్టిగా తానాను ముందుకు నడిపించాలన్న ఉద్దేశ్యంతో ఈ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

సేవా కార్యక్రమాలు, ఇతర ఏ కార్యక్రమాలైనా విజయవంతం కావాలంటే అందుకు తగ్గ ప్లానింగ్‌, ఇతరులతో కలిసిపోయే గుణం, దాతలతో కార్యక్రమం గురించి చక్కగా వివరించి వారి నుంచి సహాయాన్ని స్వీకరించడం వంటివి ఎంతో ముఖ్యం. ఫౌండేషన్‌ ద్వారా కోవిడ్‌ సమయంలో నా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలే నా లీడర్‌ షిప్‌ క్వాలిటీని మీకందరికీ తెలియజేశాయి. ఆ అనుభవంతో, తానాను మరింత బలమైన సంస్థగా నిర్మించడానికి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాను.

తానా అధ్యక్షునిగా గెలిపిస్తే అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ తానాను ఓ బలమైన సంస్ధగా తయారు చేయడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆసరా ఇచ్చే సంస్థగా రూపొందిస్తాను. తెలుగువారి సాంస్కృతిక, చారిత్రక, భాషా వైభవానికి ప్రతీకగా తానా ఉండటంతోపాటు, అమెరికాలో తెలుగువారి కష్టాలను ప్రభుత్వానికి తెలియజేసే బలమైన సంస్థగా, కృషి చేసే సంస్థగా తానా ఎదగాలన్నది నా ఆకాంక్ష.

అలాగే అమెరికాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీకి తానా ఎంతో సేవ చేస్తోంది. ఈ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగాలన్న ఆలోచనతో, తానా స్వయంగా తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా అనాథాశ్రమాలను, ఆసుపత్రులను, వృద్ధాశ్రమాలను నిర్మించి సేవ చేస్తే బావుంటుందని భావిస్తున్నాను. తానా నాయకత్వ టీమ్‌తోనూ, దాతలు, ఇతరుల సహాయంతో ఈ అనాథాశ్రమాలు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాల నిర్మాణాలు, నిర్వహణ వంటివి ఆచరణలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను.

రాబోయే తరానికి తానా ప్రాతినిధ్యం వహించే సంస్థగా నిలవాలి. రేపటి చిన్నారులకు వేదికగా తానా మారాలి. ఇలాంటి పలు లక్ష్యాలతో తానాను మరింతగా మెరుగుపరిచి, పనిచేసేవాళ్ళకే పదవులు అన్నట్లుగా కోవిడ్‌ కష్టకాలంలో  నేను చేసిన పనితీరు, కాన్ఫరెన్స్‌ విజయాల్లో నేను చేసిన పనులు, వివిధ సేవా కార్యక్రమాలు, తానాకు విరాళం ఇవ్వడంతోపాటు దాతల నుంచి విరాళాలు వచ్చేలా చేసిన కృషి వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని తానా అధ్యక్షునిగా గెలిపించి, అమెరికాలో తెలుగోడి సత్తా చాటే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు నిరంజన్‌ శృంగవరపు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.