
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రముఖ విద్యుత్‌కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ ఘనత సాధించడంపై ఆయనే ఆశ్చర్యానికి గురైనట్లున్నారు. అందుకే వింతగా ఉంది అంటూ ట్వీటర్లో స్పందించారు. ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు అని టెస్లా ఓనర్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ పేరుతో ఉన్న ఓ ట్విటర్ ఖాతా నిన్న ఓ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌ను మస్క్‌కు ట్యాగ్ చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ వింతగా ఉంది అని అన్నారు. ఆ తర్వాత కాసేపటికి మంచిది బ్యాక్ టు వర్క్ అని మరో ట్వీట్ చేశారు. మస్క్ స్పందన నెటిజన్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంత చమత్కారమైన వ్యక్తి.. నిజమైన లెజెండ్ అంటే ఈయనే అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల జాబితాలో మస్క్ అగ్రస్థానంలో నిలిచినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకటించింది. టెస్లా షేర్ల విలువ పెరగడంతో ఆయన ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ స్థానంలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఉండగా.. మస్క్ ఆయనను దాటేశారు.