కర్నూలు మున్సిపాలిటీకి రూ.7 లక్షల విలువైన వాహనం విరాళం

Potluri Ravi and Muppa Rajsekhar have donated the Hydraulic Truck to Kurnool Municipal Corporation

సేవా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికుల కోసం తానా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి, వంశీ గ్రూప్‌ అధినేత ముప్పా రాజశేఖర్‌ లు ఏడు లక్షల రూపాయలు విలువ చేసే వాహనాన్ని కర్నూలు మున్సిపల్‌  కార్పొరేషన్‌ కు అందజేశారు. ఓ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ ద్వారా మున్సిపల్‌ కమీషనర్‌ డీకే  బాలాజీ ఐఏఎస్‌ కు పారిశుధ్య వాహనం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న  తానా కార్యదర్శి పొట్లూరి రవి, ముప్పా రాజశేఖర్‌ల సేవా నిరతిని, వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్న కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు.

ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ పొట్లూరి రవిని ఆదర్శంగా తీసుకుని జన్మభూమి అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఎటువంటి కష్టాలు, ఆటంకాలు లేకుండా చదువుకోవాలన్న ఆశయంతో జిల్లాకు చెందిన వందమంది పేద విద్యార్థులకు పొట్లూరి రవి సహకారంతో 15 లక్షల రూపాయలకు పైగా ఉపకార వేతనాలు అందించినట్లు ముప్పా రాజశేఖర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం సహకరిస్తే తల్లి, తండ్రి లేని విద్యార్థుల కోసం ఉత్తమశిక్షణ అందించటానికి అన్నీ సదుపాయాలతో విద్యాసంస్థ నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 

కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామని, జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‌ కోఆర్డినేటర్‌ ముప్పా రాజశేఖర్‌ తెలిపారు.

Click here for Photogallery

 


                    Advertise with us !!!