హతవిధీ...... సీఎం అయినా పవర్ లేదు...

nitish-kumar-says-had-no-desire-to-become-cm-expresses-anguish-over-jd-u-mlas-joining-bjp-in-arunachal-pradesh

అరుణాచల్ ప్రదేశ్‌లో మొదలైన ప్రకంపనలు బిహార్‌ను తాకాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీకి జంప్ అయ్యారు. మొత్తం 7 మంది విజయం సాధిస్తే... అందులో ఆరుగురు బీజేపీలోకి జంప్ కావడం రాజకీయంగా పెను ప్రకంపనలే రేపింది. దీనిపై జేడీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంకీర్ణ రాజకీయాల్లో ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని, ఇలాంటివాటిని తాము ఆమోదించమని జేడీయూ నేత త్యాగి తీవ్రంగా మండిపడ్డారు. బిహార్ వేదికగా బహిరంగంగా ఎలాంటి రాజకీయ ప్రకంపనలు రాకపోయినా... లోలోపల మాత్రం జేడీయూ కుతకుతలాడుతున్నట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. రాజకీయంగా మోదీ,షా ద్వయం వేసిన చట్రంలో సీఎం నితీశ్ ఇరుక్కున్నారు. ఓ వైపు జేడీయూతో పొత్తు పెట్టుకుంటూనే నితీశ్‌ను రాజకీయంగా మింగేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని జేడీయూ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ముందు నుంచీ జేడీయూ, బీజేపీ మధ్య అంత సఖ్యత లేదు. అయినా ‘రాజకీయ అవసరాల’ నిమిత్తమై ఇద్దరూ ‘బలవంతంగా సంసారం’ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే... సీఎం నితీశ్ ఏకంగా ప్రధాని మోదీపైనే గురి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మోదీ రావాల్సిన అవసరం లేదని, తామే ఒంటిచేత్తో నడిపిస్తామని ప్రకటించారు. ఆ సమయంలో రాజకీయంగా బీజేపీ అంత బలంగా బిహార్‌లో వేళ్లూనుకోలేదు. కానీ... తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. బీజేపీ 74సీట్లు సాధిస్తే, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. అయినా సరే... బీజేపీ వ్యూహాత్మకంగా నితీశ్‌నే సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఈ తాజా పరిణామాలు బిహార్‌ను మధ్యంతర ఎన్నికల దిశగా నడిపిస్తాయా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కుర్చీలో నితీశ్..... అయినా ముందరి కాళ్లకు బంధం

తమ కంటే తక్కువ స్థానాలే వచ్చినా... నితీశ్‌నే బీజేపీ సీఎం చేసింది. అయితే... నితీశ్ ఎలాంటి రాజకీయ, పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ ముందరి కాళ్లకు బంధం వేస్తోందని జేడీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు గడిచినా... కేబినెట్ కూర్పు ఓ కొలిక్కి రాలేదు. కేబినెట్ కూర్పు కొలిక్కి రాకపోవడానికి బీజేపీ వ్యవహార శైలే కారణమని వార్తలొచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో... అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో నితీశ్ వ్యవహారం అడకత్తరలో పోక చెక్కలా తయారైంది. బీజేపీ వ్యవహార శైలితో చిర్రెత్తిన సీఎం నితీశ్.... ‘‘నాకు సీఎం పదవిపై ఆసక్తి లేదు’ అని బాంబు పేల్చారు. ‘‘సీఎం పీఠంపై నాకు ఆశ లేదు. గతంలోనే ఈ విషయం చెప్పాను. కానీ బీజేపీయే బలవంతంగా నన్ను ఈ సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఫలితలు బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. ఈ పదవిని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను.’’ అని నితీశ్ వ్యాఖ్యానించారు. అయినా సరే.. బీజేపీ మాత్రం విడిచిపెట్టడం లేదు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ స్పందించారు. బిహార్‌లో మాత్రం తమ నాయకుడు నితీశేనని స్పష్టం చేశారు. సీఎం పదవిని తిరస్కరించడం నితీశ్‌కు తగదని, సీట్లు తక్కువ వచ్చినా, నితీశే తమ సీఎం అని ఎన్నికలకు ముందే తాము ప్రకటించామని ఆయన గుర్తు చేశారు. ప్రజా తీర్పు కూడా నితీశ్ నాయకత్వానికే లభించిందని, బిహార్ లో తమ కూటమి మధ్య బంధాలు బాగానే ఉన్నాయని సుశీల్ మోదీ తెలిపారు.

సీఎం నితీశ్‌ను ఇరుకున పెడుతున్న ఆర్జేడీ

సీఎం నితీశ్‌తో బీజేపీ, ఆర్జేడీ చెడుగుడు ఆడుతున్నాయి. ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకొని, బీజేపీ పొత్తు నుంచి సీఎం నితీశ్‌ను బయటికి లాగాలని ఆర్జేడీ చూస్తోంది. ఎన్డీయే కూటమి నుంచి నితీశ్ బయటికి రావాలని ఆర్జేడీ నేత ఉదయ్ నారాయణ్ పిలుపునిచ్చారు. బీజేపీకి గుడ్ బై చెప్పి, తమతో కలిసి రావాలని కోరారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు సీఎం అప్పగిస్తే... వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. నితీశ్ ఇంకా ఎన్డీయే కూటమిలో కొనసాగితే... నితీశ్‌ను బీజేపీ క్రమంగా మింగేస్తుందని ఉదయ్ నారాయణ్ హెచ్చరించారు. ఇక మరో ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ మరో సంచలన ప్రకటన చేశారు. జేడీయూకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీలో రావడానికి రంగం సిద్ధమైపోయిందని బాంబు పేల్చారు. ‘‘జేడీయూకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లోనే ఉన్నారు. గతంలోనే మా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ మేమే సమయం కాదు. ఆగమని చెప్పాం. ఫిరాయింపు వ్యతిరేక చట్టం కారణంగా వారు తమ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.’’ అని శ్యామ్ రజక్ అన్నారు. ఈ పరిణామాలను చూస్తే అటు బీజేపీ, ఇటు ఆర్జేడీ రెండూ సీఎం నితీశ్‌ను తమ తమ చట్రాల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిసిపోతోంది. అయితే ఈ చట్రం నుంచి నితీశ్ ఎలా బయటపడతారో మరి.