
తెలుగుటైమ్స్. నెట్ రేటింగ్ 3/5
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నటీనటులు:
సాయితేజ్, నభా నటేశ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
సాంకేతిక వర్గం: ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటర్: నవీన్ నూలి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: వెంకట్ సి.దిలీప్, నిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్. దర్శకత్వం: సుబ్బు
విడుదల తేదీ :25-12-2020
తెలుగు సినిమా ప్రేమికులకు ఎనిమిది నెలల వ్యవధి తరువాత థియేటర్లో సినిమా చూసే అవకాశం వచ్చింది. తగిన జాగ్రత్తలతో ప్రేక్షకుడు థియేటర్ లో మెగా హీరో సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చూసాడు. ఇక లాక్డౌన్ తరువాత థియేటర్లలో విడుదలవుతోన్న ఫస్ట్ బిగ్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ కు ఇండస్ట్రీలోని స్టార్లు అంతా సపోర్ట్ చేశారు. సినిమాకి వచ్చే రెస్పాన్స్ చూసి మిగిలిన సినిమాలను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ సాయి తేజ్ తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి తేజ్ ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాలతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆ జోష్‌ను ఇలాగే కొనసాగించాలని ఆచి, తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి కామెడీనే నమ్ముకొని కొత్త దర్శకుడితో ప్రయోగం చేశాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ డిఫెరెంట్ టైటిల్‌తో ముందుకు వచ్చాడు. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.
అందుకే సాయి తేజ్ సినిమా కోసం వాళ్లతోపాటు మిగిలిన వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇన్ని అంచనాల నడుమ ఈ రోజు శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది? సుప్రీం హీరో హ్యాట్రిక్ విక్టరీ కొట్టాడా లేదా? భారీ ప్రమోషన్స్ ఈ చిత్రాన్ని ఏ మేరకు నిలబెట్టాయి? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ఎలాంటి బాదర బందీ లేకుండా ప్రేమ, పెళ్లి లొల్లి లేకుండా స్వతంత్రంగా బతుకాలనుకునే వైజాగ్ స్టూడెంట్ విరాట్ (సాయి తేజ్). మన రాజ్యాంగం మనకు స్వేచ్చగా బతకమని కొన్ని హక్కులను ఇస్తే, వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్స్‌తో నాశనం చేస్తున్నామని తెగ భాద పడిపోతుంటారు. తన స్నేహితులు కూడా ఇలా నాశనం కాకూడదని, జనాలకు ఈ నిజాన్ని తెలియజేయాలని ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఫౌండేషన్‌ని స్థాపించి యువతకు గీతోపదేశాలు ఇస్తాడు. అబ్దుల్ కలాం, ఆర్ నారాయణ మూర్తి, అటల్ బిహారి వాజ్‌పేయిలను ఆదర్శంగా తీసుకొని స్వేచ్ఛగా బతికేద్దామని యువతకు పిలుపునిస్తాడు. అంతే కాదు.. మామయ్య వేణు(రావు రమేష్) సపోర్టుతో పెళ్లి చేసుకునే పడే కష్టాలు ఏంటో, సోలోగా ఉంటే జరిగే లాభాలేంటో తెలియజేయడానికి 108 శ్లోకాలతో కూడిన బుక్‌ను రాసి ప్రచారం చేస్తాడు. ఇక విరాట్ శ్లోకాలు విన్న కొంతమంది యువకులు.. ప్రేమ, పెళ్లి పక్కన పెట్టి సోలోగా బతికేస్తారు. విరాట్ కూడా తన సిద్దాంతాలకు కట్టుబడి.. తనకు ప్రపోజ్ చేసిన ప్రతి అమ్మాయిని చులకన చేసి మాట్లాడుతుండాడు.
చదువు పూర్తయ్యాక ఉద్యోగ రిత్యా విరాట్ హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాడు. స్నేహితులతో కలిసి బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తన స్నేహితులందరూ ఒక్కొక్కరు పెళ్లి చేసుకొని విరాట్‌కు హ్యాండ్ ఇస్తారు. ఇక తను గట్టిగా నమ్మిన ఆర్ నారాయణ మూర్తి కూడా మనిషి ప్రకృతి ధర్మం పాటించాలని, పెళ్లి చేసుకోవాలని టి వి ఇంటర్వ్యూలో చెబుతాడు. అది విన్న విరాట్.. రియలైజ్ అవుతాడు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన స్నేహితుడి పెళ్లికి వెళ్తాడు. అక్కడ పెళ్లి కూతురు అమృత(నభా నటేశ్) విరాట్‌ను చూసి, తన పెళ్లి ఆపేసుకుంటుంది. పెళ్లంటూ చేసుకుంటే విరాట్‌నే చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పేస్తుంది. విరాట్ కూడా అమృతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు అమృత.. విరాట్‌కు అనుకోని షాక్ ఇస్తుంది? ఆ షాక్ ఏంటి? పెళ్లి కోసం అతను పడిన పాట్లు ఏంటి? తను చెప్పిన సిద్దాంతాలే తనకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టాయనేదే మిగతా కథ.
నటీనటుల హావభావాలు
ఇక నటీ నటుల విషయానికి వస్తే హీరో సాయి తేజ్ ప్యూర్ సింగిల్ రోల్ వరకు సూపర్బ్ గా చేసాడు అని చెప్పాలి. పెళ్లి అంటే ఇష్టంలేని విరాట్ పాత్రలో సాయితేజ్ ఒదికి పోయాడు. అలాగే కామెడీని అయితే పర్ఫెక్ట్ గా పండించాడు.కామెడీతో ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా పండించాడు. డైలాగ్ మాడ్యులేషన్స్‌తో పాటు ఎక్స్‌ప్రెస్ చాలా బాగున్నాయి. అంతే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే ముందు సినిమాల కంటే తన నటనలో మరింత మెరుగు కనిపిస్తుంది. వీటితో పాటుగా తన డాన్స్ మూమెంట్స్ కానీ ఫైట్స్ లో తన సాలిడ్ పర్శనాలిటీతో తేజ్ చాలా సెటిల్డ్ గా కనిపిస్తాడు. ఇక యంగ్ యాక్ట్రెస్ నభా నటేష్ విషయానికి వస్తే ఆమె ఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయమే పట్టినా తన రోల్ ను చాలా బాగా చేసింది మంచి నాచురల్ లుక్ తో మెరుగైన నటనను కూడా కనబర్చి తన నటనకు మంచి స్కోప్ ను ఈ చిత్రంలో చూపింది.అమృత పాత్రకు నభా నటేశ్ 100 శాతం న్యాయం చేసింది. యాక్టింగ్‌లో సాయి తేజ్‌తో పోటి పడింది. ఇక సీనియర్ నటులు నరేష్ రావు రమేష్ మరియు రాజేంద్ర ప్రసాద్ లు అత్యుత్తమ నటనను కనబర్చారు. రావు రమేష్ అయితే తన కామెడీ టైమింగ్ తో మరోసారి ఆకట్టుకుంటారు. లాస్ట్ టైం కూడా సాయి తేజ్ మరియు ఈయన మధ్య మంచి కామెడీ చూసాము ఇందులో ఇంకాస్త ఎక్కువే కనిపిస్తుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక భాద్యతాయుతమైన రోల్ లో కనిపించి ఆకట్టుకుంటారు.
సాంకేతిక వర్గం పనితీరు
యంగ్ దర్శకుడు సుబ్బు విషయానికి వస్తే ట్రైలర్ తోనే మినిమం హోప్స్ ను తనపై తెచ్చుకోగలిగాడు ఈ దర్శకుడు మరి సినిమా పరంగా వస్తే తన తాను ఎంచుకున్న లైన్ ఫస్ట్ హాఫ్ ను హ్యాండిల్ చేసిన విధానం కానీ సింప్లీ సూపర్బ్ అనిపిస్తాయి. కానీ దానిని సెకండాఫ్ లో చూపించకపోవడం చాలా నిరాశ కలిగించే అంశం అని చెప్పక తప్పదు. మరిన్ని ఎమోషన్స్ ఆసక్తిగా అనిపించే కథనం మరింత యాడ్ చేసి ఉంటే బాగున్ను అలాగే క్లైమాక్స్ ను కూడా మరింత అందంగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సాంకేతిక నిపుణుల్లో మొదట చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉన్న థమన్ కోసమే మాట్లాడాలి. థమన్ ఈ సినిమాకు మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. మంచి పాటలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ను అందించి కీలక పాత్ర పోషించాడు. కెమెరా పనితనం కానీ ఎడిటింగ్, లిరిక్స్ విజువల్ అత్యున్నత స్థాయిలో కనిపిస్తాయి నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి..
విశ్లేషణ :
పెళ్లి అంటే ఇష్టంలేని ప్రవరాఖ్యుడు కథలు తెలుగు తెరపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. మొదట్లో పెళ్లి వద్దనుకుంటారు తర్వాత హీరోయిన్ చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సినిమాలు బోలెడన్ని వచ్చాయి. ఇక డైరెక్టర్ సుబ్బు కూడా ఈ రూల్స్‌ని బ్రేక్ చేయలేదు. కానీ చూపించే విధానం మాత్రం కాస్త కొత్తగా ఉంది. కామెడీతోనే ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. మనిషికి తోడు అవసరమని, భాగస్వామి లేకుంటే ఎదురయ్యే ఇబ్బందులేంటో కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే హీరో అలా బ్రహ్మచారిగా ఉండాలని ఎందుకు డిసైడ్ అయ్యాడో కారణం చెప్పలేదు. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్తో లాగేశారు. హీరో హైదరాబాద్‌కు రావడం, ఫ్రెండ్స్ మారిపోయి పెళ్లి చేసుకోవడం, హీరో రియలైజ్ అయి పెళ్లి చేసుకోవాలనుకోవడం అన్నీ చకచకా జరిగిపోతాయి. ఇక ఇంటర్వెల్ ముందు హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్‌లో మాత్రం అంతగా ట్విస్ట్లేమి ఉండవు. తర్వాత ఏం జరగబోతుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించగలడు. ఇక హీరో,హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. వెన్నెల కిషోర్ కామెడీని కాస్త పెంచితే బాగుండేది. ప్రీ క్లైమాక్స్ సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సైతం సింపుల్‌గా ఉండటం కొంచెం మైనస్ అయిందని చెప్పొచ్చు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో తమన్ మ్యాజిక్ చేశాడు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. చివరగా చెప్పేది ఏమిటంటే మంచి వినోదాత్తంగా చిత్రంగా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది.