
భారత్లో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్దికి అగ్రరాజ్యం అమెరికా ఆర్తిక సహకారం అందిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రకటించింది. గత మూడు దశాబ్దాలుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత వృద్ధికి కూడా ఇది ఆటంకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కీలక మౌలిక సదుపాయల ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భారత నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)లో అమెరికా 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది అని యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్సీ) వెల్లడించింది.
ఎన్ఐఐఎఫ్ నిధుల సేకరణ తుది రౌండ్లో ఈ పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. దీనిపై ఎన్ఐఐఐఎఫ్ సీఈవో సుజయ్ బోస్ హర్షం వ్యక్తం చేశారు. డీఎఫ్సీ నిర్ణయం భారత్లో మౌలిక సదుపాయాల పెట్టుబడులను మరింత బలోపేతం చేసిందని బోస్ అన్నారు. దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధి కోసం చేపట్టే ఇన్ఫాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులను ఉపయోగించనున్నట్లు ఎన్ఐఐఎఫ్ తెలిపింది.