లాక్ డౌన్ తరువాత మొదలైన భారీ చిత్రాలు..పెద్ద హీరోల షూటింగ్ ల సందడి

star heroes movie shootings starts after lock down

టాలీవుడ్ లో మూడు రిలీజులు ఆరు షూటింగులు
క్లాప్... సౌండ్.... కెమెరా....యాక్షన్ లతో మారు మ్రోగుతున్న షూటింగ్ స్పాట్లు 
   

టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమా రిలీజులు తక్కువ గా  షూటింగులు ఎక్కువగా  జరుగుతున్నాయి. 60 పై పడ్డ హీరోలు, యంగ్ హీరోలు, చిన్న హీరోలు అందరు వారి వారి షూటింగులతో మళ్ళీ బిజీ అయిపోయారు. కరోనా సృష్టించిన కలకలం వల్ల చిత్ర పరిశ్రమ వ్యాపారం చిన్నాభిన్నమయింది. సినిమాలకు క్రితం వున్నా మార్కెట్‌ మునుపటి స్థితికి రావడానికి మళ్లీ ఎన్నాళ్లకు వస్తుందో ఏమో అన్న పరిస్థితి ఈనాడు ప్రతి నిర్మాతకు కనిపిస్తుంది. గతంలో వలే సినిమాను ఎలాంటి భయం, బెరుకు లేకుండా ధైర్యంగా రిలీజ్‌ చేసుకోవచ్చో నిర్మాతకు గ్యారంటీ లేదు దీంతో ఆర్టిస్టు, టెక్నీషియన్లు పారితోషకాలు తగ్గించుకోవాంటూ నిర్మాత మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పారితోషికాు తగ్గించుకునే విషయంలో అగ్ర హీరోలెవరూ ఇంకా హామీ ఇచ్చినట్టు కనిపించడం లేదు. అది అలా ఉండగా నిర్మాతలు ఆర్టిస్టు, టెక్నీషియన్లు షూటింగ్ చేద్దామన్న మొన్నటి వరకు ప్రభుత్వం  అనుమతి ఇవ్వకపోవడంతో షూటింగులు జరుగలేదు.

ప్రభుత్వం  ఇప్పుడు కరోనా నియమ నిబంధనలతో షూటింగ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది.  కొత్త సినిమాలు ప్రారంభం కాకపోయినా కరోనా కు ముందుగా మొదలెట్టిన మూవీస్ కి నిర్మాతలు వడ్డీలు ఎలా కట్టాలా అనే సందిగ్ధం లో వున్నారు. ఇక చేసేది ఏం లేదు   ఫినిష్ చేయడానికి....  నిండా మునిగినవాడికి చలి ఏంటని  నిర్మాతలు ఎలా ఉంటే ఆలా జరుగుతుందని షూటింగులు పునః ప్రారంభించేసారు. దాదాపు ఎనిమిది నెలలుగా షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్న హీరోలు..ఇపుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ రంగంలోకి దిగారు. 

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ల 'ఆచార్య'

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో మెగా పవర్ రాంచరణ్, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య చిత్రం కరోనా కు ముందుగా మొదలైంది.   దీనికి సంభందించి 20 శాతం షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని వినికిడి.  ఇక షూటింగ్ షూటింగ్ కి  ఆల్ సెట్.. ఆచార్య షూటింగ్ కు  అన్ని సిద్ధం చేసుకునే సమయానికి ప్రజెంట్ సిచ్యుయేషన్‌ చూస్తే... ఒక సినిమా వంద ప్రశ్నలు అన్నట్టుగా ఉంది ఈ మెగా మూవీ పరిస్థితి. అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లుగానే కనిపిస్తున్నాయి. చిరంజీవి కరోనా అనంతరం తొలిసారి మళ్ళీ  కెమెరా ముందుకు రాబోతున్నారు. అనుకునేలోపు ఆయనకు కరోనా వచ్చిందని మెగాస్టార్ స్వయంగా ట్వీట్ చేసారు  ఆ విషయంలో చిరు ఆచార్య టీం ఎంతో  టెన్షన్ పడ్డారు.  ఆయనకు కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. లక్షణాలు లేకపోవడంతో రెండు రోజుల్లో మళ్లీ టెస్టు చేసుకోగా..నెగిటివ్ వచ్చిందని..మొదట చేసిన టెస్ట్ ఫలితం తప్పుగా వచ్చిందని చిరు చెప్పారు. మెగాస్టార్ అసలు వస్తారో లేదో అనుకున్న ఇటీవల పెళ్లి చేసుకున్న  కాజల్‌ కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో డేట్స్ ఇచ్చేసింది.  నీహరిక పెళ్లి కోసం చిరు బ్రేక్ తీసుకున్నా.. ఆ టైంలో కాజల్ సీన్స్‌ కవర్‌ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు కొరటాల. ఇప్పటికే చిరు రిక్వెస్ట్‌కు ఓకే చెప్పిన రాజమౌళి కూడా… ఎప్పుడంటే అప్పుడు  చరణ్ ని  రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. రెండు రోజుల క్రితం  నిహారిక పెళ్లి సంబరాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక  చిరు, చరణ్ కాంబో సీన్స్‌ కూడా కానిచ్చేసేలా స్కెచ్‌ వేస్తున్నారు ఆచార్య టీం. ఈ నెల 20నుండి ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటున్నదని  మెగా ఫ్యాన్స్‌  ఉత్సహంగా వున్నారు.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను  #బిబి 3

నందమూరి బాలకృష్ణ బోయపాటి  సినిమా అనగానే నందమూరి అభిమానులకు ఎక్కడ లేని పవర్ వస్తుంది. 'సింహ,' 'లెజెండ్' లాంటి భారీ సక్సెస్‌ల తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో హాట్రిక్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీ కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకొని కరోనా కారణంగా వాయిదాపడింది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ప్రస్తుతం  తిరిగి సెట్స్ మీదకు రావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  కానీ బాలయ్య కు  ఎప్పుడు లేని విధంగా ఈ చిత్రానికి హీరోయిన్ల కొరత ఏర్పడింది. ఈ చిత్రంలో అవకాశం రావడమే అదృష్టం అన్న  సయేశా సైగల్ అగ్రిమెంట్ చేసుకుని కూడా వెనుకంజ వేసింది. ఇప్పుడు చివరాఖరికి ప్రగ్య జైస్వాల్ ఖరారైంది డిసెంబర్ మధ్యలో షూటింగ్ ప్రారంభం కానుంది.   కాగా తాజాగా ఈ చిత్ర టైటిల్ విషయమై ఓ ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది. బాలయ్య డిఫరెంట్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు విన్నాం. కానీ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ మూవీకి 'సూపర్ మ్యాన్' టైటిల్ ఫైనల్ చేసేశారని తెలుస్తోంది. కథను బట్టి చూస్తే సూప‌ర్ మ్యాన్ అనే టైటిల్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని భావించిన బోయపాటి.. బాలయ్య ముందు ఆ ప్రపోజల్ పెట్టడంతో ఆయన సైతం ఓకే అనేశారని టాక్.80 వ దశకం లో సీనియర్ ఎన్టీర్ 'సూపర్ మ్యాన్' టైటిల్ తో ఓ చిత్రం వచ్చింది కానీ.... అది  ప్లాప్ అయ్యింది. 

అక్కినేని నాగార్జున 'వైల్డ్ డాగ్'

సీనియర్ హీరోల్లో తొలుత మేక్ అప్ వేసుకున్న హీరో  కింగ్ నాగార్జున. సుమారు ఏడు నెలలు సినిమా షూటింగ్‌కు దూరమైన నాగ్.. ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’తో బిజీ అయ్యారు.అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. ఇది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌వుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని మ‌నాలీలో ఉన్న సుంద‌ర ప్రదేశాల్లో మొద‌లైంది. నాగార్జున షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అక్కడి ప్రకృతి సౌంద‌ర్యానికి ఆయ‌న ప‌ర‌వ‌శించిపోయారు. ప్రేక్షకుల‌తో ఆ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు కూడా. ‘‘హాయ్‌.. ఇది రోహ్‌తంగ్ పాస్ (రోహ్‌తంగ్ క‌నుమ‌)లోని అంద‌మైన ఉద‌యం. స‌ముద్ర మ‌ట్టానికి మూడు వేల తొమ్మిది వంద‌ల ఎన‌భై మీట‌ర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం. అంటే ప‌ద‌మూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్రమాద‌క‌ర‌మైన క‌నుమ‌. న‌వంబ‌ర్ నుంచి మే నెల వ‌ర‌కు దీన్ని మూసేస్తారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం ఇక్కడ‌కు వ‌చ్చాం. ఈ సినిమా షూటింగ్ చాలా బాగా జ‌రుగుతోంది. అంద‌మైన ప‌ర్వతాలు, నీలాకాశం, జ‌ల‌పాతాలు.. ఇక్కడ ఉండ‌టం ఎంతో బాగుంది. ఏడు నెలల‌ త‌ర్వాత ఇటువంటి ప్లేస్‌కు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. 21 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది. ఆ త‌ర్వాత (హైద‌రాబాద్‌) వ‌చ్చేస్తాను. ల‌వ్ యు ఆల్‌. సీ యు’’ అంటూ ఉత్సాహంగా చెప్పారు నాగార్జున‌. ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  సుదీర్ఘంగా  ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో స‌హా ప్రధాన పాత్రధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.  

య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మగా నాగార్జున ఇప్పటివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా పాత్రను చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వ‌ల్ల సినిమాలో ఆయ‌న‌ను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్రలో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. కాగా,  ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు నాగార్జున ‘బిగ్ బాస్’ షో ద్వారా కెమెరా ముందుకు వచ్చారు.  తన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.  చివరి దశకు వచ్చిన  బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న సభ్యులకు క్లాసులు పీకుతున్నారు.

నారప్ప షూటింగ్లో జాయిన్ అయిన వెంకటేష్..

తాజాగా హీరో వెంకటేష్.. నారప్ప కోసం మళ్లీ రంగంలోకి దిగాడు. నారప్ప షూటింగ్‌లో జాయిన్ అయిన వెంకటేష్.. చిత్ర యూనిట్ షూటింగ్ మొదలైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ చిత్రం కరోనా లాక్‌డౌన్‌ కంటే ముందు జనవరి 2020 లో స్టార్ట్ అయినా  ఈ సినిమాకు సంబంధించిన 80 శాతం షూటింగ్ కంప్లీటైంది.  మిగిలిన 20 శాతం షూటింగ్ ఈ నెల రోజుల్లో కంప్లీట్ కానుంది. ఈ సినిమాను తమిళంలో హిట్టైన ‘అసురన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.  వెంకటేష్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మరోసారి వెంకటేష్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు వీ క్రియేసన్స్ బ్యానర్‌లో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సామ్‌.కె నాయుడు అందిస్తుండగా, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌ గాంధీ నడికుడికర్‌, కథ  వెట్రిమారన్‌, ఫైట్స్‌ పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, లిరిక్స్‌ సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం రాస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి లేదా వచ్చే సమ్మర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

అసురన్‌లో ధనుశ్ డబుల్ రోల్లో యాక్ట్ చేసాడు. తెలుగులో మాత్రం వెంకటేష్‌తో పాటు మరో హీరో కూడా  యాక్ట్ చేస్తున్నాడు. ‘అసురున్’ చిత్ర విషయానికొస్తే.. కుల వ్యవస్థ దాని మూలంగా జరిగిన గొడవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ నేటివిటీకి ఈ కథ చక్కగా సరిపోయింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో హీరో.. ఊర్లో వాళ్ల కాళ్లు మొక్కడం.. ఆవు పేడ‌ను ధనుశ్ చేత్తో ఎత్తడం వంటి రియలిస్టిక్ సన్నివేశాలున్నాయి. తమిళ హీరోలు.. ప్రేక్షకులను అభిమానులను కాకుండా.. కథకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆయా సన్నివేశాల్లో నటిస్తుంటారు. ధనుశ్ కూడా కథకున్న ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా ఈ సన్నివేశాల్లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించాడు. మరి తెలుగు ప్రేక్షకులు ఇటువంటి కథ కథనం ఉన్న చిత్రాన్ని వెంకటేష్ ఏ మేరకు చేసి మెప్పిస్తాడనేది చూడాలి.  

పవర్ స్టార్ అటు పొలిటికల్ మీట్స్, ఇటు వకీల్ సాబ్ షూట్

అక్టోబర్‌లోనే వకీల్ సాబ్ షూటింగ్ మళ్లీ మొదలైనా కూడా పవన్ జాయిన్ కాలేదు. అయితే ఇప్పుడు ఆయన షూటింగ్‌లో అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా  వైరల్ అయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. కోర్ట్ సీన్స్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ షూటింగ్‌లో పవన్ అడుగు పెట్టడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్‌కి ముందే దాదాపు 80 శాతం పూర్తయింది. కేవలం కొన్ని రోజుల పార్ట్ మాత్రమే మిగిలిపోయింది. ఇప్పుడు అది పూర్తి చేయబోతున్నాడు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ అయన పుట్టిన రోజు సందర్భంగా  ‘వకీల్ సాబ్’ నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ఈ పోస్టర్ . గాంధీ, అంబేద్కర్ వంటి మహానుభావుల్ని ఈ మోషన్ పోస్టర్‌లో చూపిస్తూ.. లాయర్ గెటప్‌లో సీరియస్ లుక్‌లో దర్శనం ఇచ్చారు పవన్ కళ్యాణ్. చేతిలో క్రిమినల్ లా బుక్ పట్టుకుని చేతితో కర్ర పట్టుకుని వకీల్ సాబ్.. నేరస్థుల కీళ్లు విరిచేందుకు రెడీ అని చెప్పకనే చెప్తున్నాడు. మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో సత్యమేవ జయతే అంటూ వచ్చే ఆర్ ఆర్ మోషన్ పోస్టర్‌కి మరింత హైప్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించబోతుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త వచ్చింది. వేణు. హీరోయిన్ శృతి హాసన్ కూడా త్వరలోనే జాయిన్ కానుంది. ఆమె వస్తే మిగిలిన షూటింగ్ కూడా పూర్తైపోతుందని ఇప్పటికే అనౌన్స్ చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు పవన్ ఆ 20 రోజులు డేట్స్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిసరాల్లో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చేస్తున్నారు యూనిట్. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. హీరో పవన్ కళ్యాణ్ మాత్రం కూడా రావడంతో వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు వేణు. హిందీ సినిమా 'పింక్' రీమేక్‌గా వకీల్ సాబ్ వస్తుంది. తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి దీనిని విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం 20 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయనున్నాడు వేణు శ్రీరామ్. ఎందుకంటే ఆయనది చాలా తక్కువ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది.

హీరోయిన్ శృతి హాసన్‌తో ఉన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌తో పాటు కొన్ని కోర్టు సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతో త్వరగానే అయిపోతుందని చెప్తున్నాడు వేణు శ్రీరామ్. కచ్చితంగా ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీ ఎంట్రీ ఇస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. నిజానికి ఈ సినిమాను మేలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్స్ అన్నీ వ్యర్ధమయ్యాయి. ప్రస్తుతం ఈయన వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్, హరీష్ శంకర్, సాగర్ కే చంద్ర సినిమాలకు కూడా కమిట్‌మెంట్ ఇచ్చాడు. దాంతో పాటే సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్ సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి. అయితే ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా కూడా రెండేళ్లలోపే పూర్తి చేయాలని చూస్తున్నాడు పవన్. ఎందుకంటే 2024 ఎన్నికలకు మళ్లీ సిద్ధం కానున్నాడు జనసేనాని. ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా పార్టీని బతికించుకోడానికే అంటాడు పవన్ కళ్యాణ్. 

త్వరలో అమెరికా వెళ్లనున్న  ’సర్కారు వారి పాటటీం

మహేష్ బాబు 2020 ప్రారంభం లో  అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఎప్పటిలాగే మహేష్ బాబు ఈ సినిమా పూజా కార్యక్రమాలకు హాజరు కాలేదు. కానీ కుటుంబ సభ్యులైన భార్య నమ్రత, కూతురు సితార ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఆ సంగతి పక్కన పెడితే.. ఈ మూవీని పరుశురామ్ సోషల్ మెసేజ్‌ కథతో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.ఇక మరోవైపు సోషల్ మెసేజ్‌తో పాటు అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అందులో భాగంగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడని తెలుస్తోంది.  

ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తుండగా.. మరో కథానాయికగా నివేదా థామస్ పేరును పరిశీలిస్తున్నారు.‘సర్కారు వారి పాట’ కోసం మహేష్ బాబు తొలిసారి ఓ పాట పాడబోతున్నట్టు సమాచారం. ఇంతకు ముందు ‘బిజినెస్ మేన్’లో కొద్దిగా సింగర్‌గా ఓ పాటను హమ్ చేసిన సూపర్ స్టార్.. ’సర్కారు వారి పాట’ కోసం పూర్తి స్థాయి సింగర్ అవతారం ఎత్తనున్నారు.మహేష్ బాబు.. సర్కారు వారి పాట తర్వతా రాజమౌళి సినిమా ఉంది. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరో యేడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకున్నా.. అతను రామ్ చరణ్ సినిమాతో బిజీగా కానున్నాడు. ఈ సినిమా కంప్లీట్ కావడానికి వచ్చే యేడాది పూర్తి కావొచ్చు.ఈలోగా మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ తర్వాత వెంటనే..  ఎస్  ఎస్ రాజమౌళి తో దుర్గా ఆర్ట్స్ కె యల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రం.... వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

ఇప్పటికే వెంకీ కుడుములు మహేష్ బాబను కలిసి ఈ సినిమా స్టోరీ నేరేట్ చేసి ఓకే చేయించుకున్నాడట. ఫుల్ ఔట్ అండ్ ఔట్ కామెడీ యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని పూర్తి చేసే పనిలో పడ్డాడు వెంకీ కుడుముల. మహేష్ బాబు .. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ అయిపోయే లోపు వెంకీ కుడుముల ఈ సినిమా పూర్తి స్టోరీని ‘బౌండెడ్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టుకోమని మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు మరో అగ్ర నిర్మాణ సంస్థ భాగస్వామ్యంలో నిర్మించనున్నారు.మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విషయానికొస్తే..  

పాన్ ఇండియా మూవీస్ తో రెబెల్ స్టార్ ప్రభాస్ బిజీ బిజీ

ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ కి చెందినవే! ఇటీవల ‘రాధేశ్యామ్‌’  ఇటలీ లో  పెద్ద యాక్షన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసింది టీమ్‌.  ఈ చిత్రం  యాక్షన్‌ పండగలా ఉంటుందని కూడా అంటోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రానికి రాధాకష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకష్ణ మూవీస్‌ నిర్మిస్తున్నాయి.  నెల రోజుల పాటు  ఇటలీ లో చిత్రీకరణ జరిపారు. ఈ విషయం గురించి దర్శకుడు రాధాకష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సన్నివేశాలను పూర్తి చేయడానికి సుమారు వెయ్యి మంది వంద రోజుల పాటు శ్రమించారు. అందరి సహకారం వల్ల రెండేళ్ల కల నెల రోజుల్లో నిజంగా మారింది. ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్, కెమెరామేన్‌ మనోజ్‌ పరమహంస, యాక్షన్‌ డైరెక్టర్‌ నిక్‌ పోవెల్, అలానే నిర్మాతలకు ప్రత్యేక కతజ్ఞతలు. ఇంతకు ముందెప్పుడూ చూడని యాక్షన్‌ను, సాహసాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాం’’ అన్నారు.

ఈ సినిమాకి సంబంధించి తాజాగా  ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారన్నదే ఆ వార్త. ఈ నీటిలోపల సన్నివేశాల్లో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ కనిపిస్తారట. ఇవి ప్రేమ సన్నివేశాలని సమాచారం. కీలక సందర్భంలో వస్తాయని, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిసింది. ఈ సన్నివేశాలను ప్రత్యేక సెట్లో, ప్రత్యేక కెమెరాలతో చిత్రీకరించారట కెమెరామేన్‌ మనోజ్‌ పరమహంస. చిత్రబృందం త్వరలోనే హైదరాబాద్‌ షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది.ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్‌ కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్‌ వేస్తున్నట్లు సమాచారం. ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కి వర్క్‌ చేస్తుండటం విశేషం. ఆయన పర్యవేక్షణలో ఈ సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. నిజానికి యాక్షన్‌ పార్ట్‌ కన్నా ప్రేమకథ ఎక్కువ ఉంటుందని ఇటీవల ఓ సందర్భంలో ప్రభాస్‌ పేర్కొన్నారు. అయితే ఉన్న తక్కువ యాక్షన్‌ పార్ట్  కూడా భారీ స్థాయిలో ఉంటుందట. మరి.. క్లైమాక్స్‌కే 30 కోట్లతో సెట్‌ వేస్తున్నారంటే యాక్షన్‌ పార్ట్‌ భారీగా ఉంటుందని ఊహించుకోవచ్చు.  ఈ క్రమంలో ‘ఆది పురుష్‌’ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఆగస్టు 11, 2022న ఆదిపురుష్‌ విడుదల కానుందని తెలిపింది. ఈ మేరకు చిత్ర బృందం ట్వీట్‌ చేసింది. ఈ వార్తతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆది పురుష్‌’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదో భారీ బడ్జెట్‌ ఫ్యాంటసీ చిత్రం. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణాసురుడిగా కనిపించనున్నారు. భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా చిత్ర యూనిట్‌ ఆదిపురుష్‌ రిలీజ్‌ డేట్‌ని కూడా  ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రభాస్ ఇంకా కమిట్ అయినా సినిమాలు వైజయంతి బ్యానర్ లో నాగ అశ్విన్ దర్శకత్వం లో ఒక సినిమా ఇందులో ఇంకా  అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనె నటిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది.   హీరో ప్రభాస్‌, 'కేజీఎఫ్‌' ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు పేరు ఖరారు అయింది. ఈ సినిమాకు ‘సలార్‌’  అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని విజయ్‌ కిరగందూర్‌ (కేజీఎఫ్‌ మూవీ ప్రొడ్యూసర్‌) నిర్మించనున్నారు. ప్రభాస్‌  ప్రస్తుతం 'రాధేశ్యామ్‌' సినిమాతో బిజీగా ఉన్నారు.  అలాగే ప్రభాస్‌ ప్రధాన పాత్రలో’ఆదిపురుష్‌’, తెరకెక్కబోతుంది. సలార్‌ సినిమాలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది జవవరిలో సలార్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకుంది!  

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా  ‘రౌద్రం రణం రుధిరం’ ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు.  ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలియజేసారు. ఇక తెలుగు తెరపై  చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు బడా మాస్ హీరోలు  కలిసి నటిస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి. పైగా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో అంచనాలున్నాయి. ఇప్పటికే  విడుదలైన టీజర్లు ఎన్టీర్,  రామ్  చరణ్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రాజమౌళి దాదాపు ఏడు నెలల లాంగ్ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ టెస్ట్ షూట్ చేసారు. దాంతో అంతా సేఫ్ అని భావించి.. ఇటీవల ఓ ట్రయల్ షూట్ నిర్వహించి మీడియా కి పంపారు  వీ ఆర్ బ్యాక్ అంటూ దాదాపు ఏడు నెలల నుంచి షూటింగ్ స్పాట్ అలాగే ఉంది. దీంతో షూటింగ్ జరిగే ప్రదేశాన్ని శానిటైజ్ చేసి దుమ్ము దులిపే పనిలో పడ్డారు.  అన్ని సెట్ చేసుకొని  రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాడు. దర్శకుడు రాజమౌళి. అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టాడు జక్కన్న. < /p>

మారేడుమిల్లి అడవిలో అల్లు అర్జున్  'పుష్ప' షూటింగ్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తోన్న ‘పుష్ప’ సినిమా షూటింగ్  అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ‘పుష్ప’ అనే టైటిల్‌ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అప్‌డేట్  ప్రకటించగానే అల్లు అర్జున్ అభిమానులు,  ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇంతకు ఆ అప్డేట్ ఏటంటే షూటింగ్ స్టార్ట్ చేయడం,  అదే విధంగా బన్నీ లుక్ కూడా చాలా రఫ్‌గా ఉండటం,  అల్లు అర్జున్ మూడోసారి సుకుమార్ దర్శకత్వంలో మూడోసారి చిత్రం చేయడం ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. ‘రంగస్థలం’ లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న బ్లాక్ బస్టర్ మూవీని రూపొందించిన సుకుమార్.. ఈ ఏడాది ఏప్రిల్ 8న చిత్ర టైటిల్‌ను, బన్నీ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఫస్ట్ లుక్ విడుదల చేసిన తరవాత కరోనా మహమ్మారి వల్ల ఇప్పటి వరకు సుమారు ఎనిమిది నెలల పాటు ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. ‘పుష్ప’ షూటింగ్‌పై రకరకాల వదంతులు ఈ ఎనిమిది నెలల కాలంలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఈ సినిమాలో బన్నీ గందపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నారనే విషయం కూడా చర్చనీయాంశం అయ్యింది.  

ఇదిలా ఉంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను చాలా వరకు అటవీ ప్రాంతంలో చిత్రీకరించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తొలుత కేరళ అడవి ప్రాంతం అనుకున్నారు, మరో సారి ఆదిలాబాద్ లోని ఏజెన్సీ ప్రాంతం అనుకున్నారు.   దీని కోసం చాలా అటవీ ప్రాంతాలను పరిశీలించిన సుకుమార్.. చివరికి తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఎంపిక  ఎంపిక చేసుకున్నారు  అంతేకాదు, మారేడుమిల్లిలోని ఒక ఫారెస్ట్ రిసార్ట్‌ను కూడా అద్దెకు తీసుకుని అక్కడే అల్లు అర్జున్ ఫామిలీ తో పాటు అక్కడే కూతురు అర్హ పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. 

టాప్ హీరోలతో పాటు మాస్ మహా రాజా రవి తేజ చేస్తున్న క్రాక్ షూటింగ్  ఇటీవల  గోవా లో జరిగింది. రానా దగ్గుబాటి విరాట పర్వమ్ షూటింగ్ లో... హీరో వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో చేస్తున్న సినిమా షూటింగ్ లో.   నాగ చైతన్య లవ్ స్టోరీ షూటింగ్ లో,  హీరో  నాని టక్ జగదీశ్ షూటింగ్, హీరో  నితిన్ రంగ్ దే షూటింగ్,  హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ షూటింగ్ లో.... హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే షూటింగ్ పూర్తి చేసి విడుదలకు రెడీ చేసారు. హీరో నాగ సూర్య రెండు షూటింగులతో పాల్గొంటున్నాడు అందులో ఒకటి  లక్ష్స్ కాగా సొంత బ్యానర్ లో మరొకటి. హీరో నిఖిల్ హీరో సత్య దేవ్ తిమ్మరుసు షూటింగ్ లో, హీరో  శ్రీ విష్ణు,  ఇలా చిన్న పెద్ద హీరోలందరూ షూటింగ్ లలో బిజీ బిజీ గా వున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగులన్నీ కరోనా కి ముందు ప్రారంభించినవే ఎక్కువగా వున్నాయి కొత్త సినిమా ప్రారంభాలు జరిగినప్పుడే సినీ పరిశ్రమ నిలదొక్కుకుంది అనుకోవాలి.           

 


                    Advertise with us !!!