
ఆయన అధ్యక్షుడు అయిన దగ్గర్నుంచి కమల దళంలో కొత్త ఉత్సాహం కనపడుతోంది. ఆ ఉత్సాహానికి విజయాలు తోడై కాషాయ పార్టీ కదనరంగంలో ఉరకలేస్తోంది. నిన్న మొన్నటి వరకు కరీంనగర్ వరకే పరిమితమైనా, దుబ్బాక ఎన్నికల సమయంలోనే అన్నీ తానై తెరాసకు ఓటమి రుచి చూపించిన సంజయ్... సత్తా ఎజీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జాతీయస్థాయిలో తెలిసింది. గ్రేటర్ ఫలితాల తర్వాత బండి సంజయ్ గురించి గూగుల్ లో నెటిజన్లు సెర్చ్ చేయడం బాగా పెరిగిందని సమాచారం.
సర్జికల్ స్ట్రైక్...ప్రత్యర్ధులకు స్ట్రోక్..
మున్సిపల్ కార్పొరేటర్ గా చేశాక రెండుసార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్.. భారీ మెజారిటీతో కరీంనగర్ ఎంపీగా గెలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే లోక్ సభ సభ్యుడుగా గెలిచినా... సంజయ్ పెద్దగా టాక్ ఆఫ్ ద పొలిటికల్ సర్కిల్ కాలేదు. ఒక యోథుది సత్తా సరైన స్థానంలో నిలిపినప్పుడే తెలుస్తుందన్నట్టు... భాజాపాకు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు అయ్యిన తర్వాత ఇప్పుడు తెలంగాణ అంతటా ఆయన గురించే చర్చ. బీజేపీ లో హేమాహేమీలుగా పేరు పొందిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి నాయకులందరినీ సంజయ్ వెనక్కి నెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని “సర్జికల్ స్ట్రైక్” క్షిపణితో హైజాక్ చేసి రాజకీయ దురంధరుడైన కేసీఆర్ కు "చెక్ పెట్టిన తీరు ఇప్పుడు అందర్నీ ఆయనవైపు తిరిగేలా చేసింది.
భాజాపాకు అచ్చి వచ్చిన ఫక్తు హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో ఆయనకున్న ఆర్ఎస్ఎస్ నేపధ్యం ఉపకరించింది. పార్టీ ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేసే నేతగా పేరు తెచ్చుకోవడం వల్లనే ఆయన్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఎలాగైనా సరే 2023లో రాష్ట్రంలో అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో ఉన్న జాతీయ పార్టీ రాష్ట్రంలో నిర్మోహమాటంగా హిందుత్వ ఎజెండా అమలు, పార్టీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బలోపేతం చేసేందుకు సంజయ్ మాత్రమే సరైన వ్యక్తిగా భావించడం సరైనదేని ఆయన నిరూపించారు.
మిడిల్ క్లాస్ టూ..పొలిటికల్ స్టార్..
సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు సంజయ్. ఆయన తండ్రి బండి నర్సయ్య ప్రభుత్వ టీచర్‌గా పనిచేసేవారు. అయితే.. ఎక్కువ కాలం డిప్యుటేషన్ మీద జిల్లా పరిషత్ లో విధులు నిర్వహించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేశారు. దాదాపు 25 ఏళ్ల కిందట ప్రమాదవశాత్తూ ఇంటిపైన ట్యాంక్ కూలి ఆయన మరణించారు. అమ్మ శకుంతల గృహిణి. ఇద్దరు అన్నలు, ఒక అక్క తర్వాత ఇంట్లో అందరికంటే చిన్నవాడైన బండి సంజయ్ కుటుంబం ఎక్కువ కాలం కరీంనగర్ కాపువాడలో నివసించేది. ఆ సమయంలో సంజయ్‌ని సరస్వతి శిశుమందిర్‌లో చేర్పించారు. అలా శిశుమందిర్ నుంచే ఆయనకు ఆరెస్సెస్ తో అనుబంధం ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశారు.
సరస్వతి శిశుమందిర్ ద్వారా తనకు విద్యతో పాటు క్రమశిక్షణ అలవడిందని ఆయన చెబుతారు. తనకు నాయకత్వ లక్షణాలను ఆర్ఎస్ఎస్ నేర్పిందని.. ఇప్పటికీ స్వయక్ సేవక్ ని అని చెప్పుకోవడానికి గర్వపడతానని బండి సంజయ్ ఓ సందర్భంలో చెప్పారు. ఆ తర్వాత వీరి కుటుంబం జ్యోతినగర్ కు షిఫ్ట్ అయ్యారు. బండి సంజయ్ భార్య అపర్ణ ఎస్బీఐ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. యువకుడిగా ఉన్నప్పటి నుంచీ విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన సంజయ్...కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్‌గా మున్సిపల్ కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు. ఇప్పటి దాకా అవినీతికి దూరంగా ఉండటం.. రాజకీయంగా విమర్శలు చేయడమే తప్ప అన్ని పార్టీల వారితోనూ వ్యక్తిగతంగా కలుపుగోలుగా ఉండటం వంటి సుగుణాలు ఆయనకు కార్యకర్తల్లో సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచింది.
అద్వానీకి...టీ అందించిన గతం..
1996లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సురాజ్ రథయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను చుట్టివచ్చిన ఆయన.. కరీంనగర్ యాత్రకు వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వేకువజామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చూశారు. మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంట గంటకు టీ ఇప్పించే పని అప్పగించారు. తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసి సంజయ్‌ని అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జ్ గా నియమించారు. ఈ హోదా బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పింది. ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్ ని ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్ లో సహాయక్ గా పంపించారు. సెంట్రల్ ఆఫీసులో ఉండి అద్వానీకి, వెంకయ్యనాయుడుకు సేవలు చేశారు. ఈ సమయంలో వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని బండి సంజయ్ చెబుతారు. హిందూ ధర్మాన్ని అనుసరించే బండి సంజయ్‌కి.. చిన్ననాటి నుంచే తన నుదిటిపై కుంకుమ బొట్టును ధరించడం అలవాటు. అలా బొట్టు పెట్టుకోవడం వల్ల కొన్ని విద్యా సంస్థల్లో అనుమతి నిరాకరించారని ఆయన అంటుంటారు. అలాగని.. తన పద్ధతి మార్చుకోలేదని గర్వంగా చెబుతారు.
దుబ్బాక, గ్రేటర్లలో తనదైన ముద్ర..
నిజానికి దుబ్బాక ఎన్నికల్లో అభ్యర్ధి రఘునందన్‌రావు మీదే భారం మొత్తం మోపి ఇతర అగ్రనాయకత్వం అంతా అంటీ ముట్టనట్టు ఉన్నప్పటికీ... బండి సంజయ్ మాత్రం అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో తన బాధ్యతను నిర్వర్తించారు. ప్రచార సమయంలోనే తనదైన శైలి చూపించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. ఆ ఎన్నిక గెలవడంతో రెట్టించిన ఉత్సాహంతో గ్రేటర్లో్ మరింతగా తన వ్యూహాలకు పదను పెట్టారు. సర్జికైల్ స్ట్రైక్, దారుస్సలాం కూల్చివేత లాంటి వ్యాఖ్యలకు వెనుకాడలేదు. అవసరాన్ని బట్టి తమకు సంబంధం లేని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిని కూడా నెత్తినేసుకున్నారు. అదే సమయంలో తమకు అవసరం లేదనుకుని జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ తనంత తానే మద్ధతు ఇస్తానన్నా అక్కర్లేదని చెప్పకనే చెప్పారు.
ఏదైతేనేం... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ పీఠాన్ని తొలి లక్ష్యంగా ఎంచుకున్న భాజాపాకు లక్ష్య సాధనకు సరైన సారధి దొరికాడనేది సుస్పష్టం. రానున్న రోజుల్లో కెసియార్ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అనే సత్తా తనకుందని సంజయ్ తెలియజెప్పారు. అదే చేత్తో ఇక తెలంగాణలో తమకు తిరుగులేదనే ధీమాను కెసియార్ ఫ్యామిలీకి దూరం చేశారు.