గ్రేటర్... ఓవర్ టూ సాగర్...

BJP eyes Jana Reddy s son for Nagarjuna Sagar seat

ఎక్కడో స్విచ్‌ ఉంటుంది. ఎక్కడో లైట్‌ వెలుగుతుంది. ఎక్కడో ఓ కంపెనీ కుప్పకూలుతుంది. మరెక్కడో స్టాక్‌ మార్కెట్‌ మొత్తం కుదేలవుతుంది. ఇదే రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. రాజకీయాల్లో గెలుపోటములు అప్పటికి మాత్రమే పరిమితం కావు. ఒక ఎన్నిక ప్రభావం తప్పకుండా మరో ఎన్నికపై ఉంటుంది. ఓడిన పార్టీకి వెనువెంటనే మరో ఎన్నిక రావడం శాపంగా అనిపిస్తే...గెలిచిన పార్టీకి వెంటనే మరో ఎన్నిక రావడం వరంగా అనిపిస్తుంది. 

తాజాగా గ్రేటర్‌ ఎన్నికల్లో భాజాపా సాధించిన అనూహ్య ఫలితాలు ఇప్పుడు ఆ పార్టీకి ఎక్కడ లేని ఉత్సాహాన్ని అందించాయి. మొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యే సీటు గెలుచుకోవడం దాని  వెంటనే కొన్ని రోజుల వ్యవధిలోనే తెలంగాణకు తలకాయ లాంటి హైదరాబాద్‌ ఎన్నికల్లో ఊహించనన్ని స్థానాలు దక్కించుకోవడం, అధికార పార్టీకి చావు తప్పి కన్నులొట్టపోయేలా చేయడం ద్వారా ఆ పార్టీ మంచి ఊపు మీద ఉంది. అదే ఊపులో ఇప్పుడు మరో ఎన్నిక కోసం ఆ పార్టీ సిద్ధమవుతోంది. నాగార్జున సాగర్‌ శాసనసభ్యుడు నోముల నర్సింహులు మృతితో మరో ఉప ఎన్నిక తెలంగాణలో జరుగనుంది. ఇక్కడ నుంచి తెరాస అభ్యర్ధిగా గెలిచిన నర్సింహులు ఆకస్మిక మరణంతో ఏర్పడ్డ ఖాళీలో పాగా వేయాలని భాజాపా ఇప్పుడు ఉవ్విళ్లూరుతోంది. 

‘గ్రేట్‌’ ఎఫెక్ట్‌...

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో భాజాపా సాధించిన ఫలితాలు ఇప్పుడు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా మార్చాయి. ఇప్పుడు ఇక ఈ ఉప ఎన్నికను ఎంత మాత్రం అధికార పార్టీ ఆషామాషీగా తీసుకోదనేది నిస్సందేహం. అది తమ సిట్టింగ్‌ సిట్‌ అయినా, దివంగత ఎమ్మెల్యేకు మంచి పేరున్నా, ఆ సానుభూతి తమకు పనికి వస్తుందనే ఆలోచన ఉన్నా కూడా తెరాస పార్టీ ఈ ఎన్నికను తేలిగ్గా తీసుకోబోదు. ఎందుకంటే అచ్చంగా ఇదే పరిస్థితులే ఉన్నప్పటికీ దుబ్బాక ను కోల్పోయామనేది ఆ పార్టీ మరచిపోదు. మరోవైపు గ్రేటర్‌లో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు ఈ ఎన్నికలో కూడా ఓటమి పాలైతే... అది తమ ప్రభుత్వంపై అనేక రకాలుగా ప్రభావం చూపే అవకాశం ఉందని తెరాసకు తెలుసు. నిజానికి గ్రేటర్‌లో అనుకున్న స్థాయి విజయం లభించి ఉంటే సాగర్‌ ఎన్నికను ఈజీగా తీసుకునే అవకాశం ఉండేది. అయితే అలా జరగలేదు. 

ఇక భాజాపా విషయానికి వస్తే... వరుస విజయాలు కొనసాగించాలని ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఢిల్లీ నుంచి లభిస్తున్న సంపూర్ణ మద్ధతుతో స్థానిక భాజాపా నాయకత్వం అస్త్రశస్త్రాలు పదును పెడుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న జానారెడ్డి కుమారుడైన రఘువీర్‌రెడ్డిని అక్కడ తమ అభ్యర్ధిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఆరోగ్య చికిత్సల కోసం కేరళలో ఉన్న జానరెడ్డితో భాజాపా నేతలు నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. భాజాపా ఆఫర్‌కి జానా కూడా అంగీకరించినట్టు, ఈ నెల 7న కాషాయ కండువా కప్పుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని తాజాగా శనివారం జానారెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు. 

 

ఏదేమైనా భాజాపా యత్నాలు ఫలించి రఘవీర్‌రెడ్డిని అభ్యర్ధిగా నిలబెట్టగలిగితే అది తెరాస పాలిట పెద్ద సవాలుగా పరిణమించడం ఖాయం. సామాజిక వర్గ ప్రాబల్యం పరంగా చూస్తే అలాగే స్థానికుడైన జానారెడ్డికి బాగా పట్టున్న  ప్రాంతం నాగార్జున సాగర్‌.  కాంగ్రెస్‌ నేతలు సైతం రఘువీర్‌ రెడ్డిపైనే వల వేసినట్టు సమాచారం. అయితే రఘువీర్‌రెడ్డి కూడా భాజాపా వైపే మొగ్గు చూపుతున్నట్టు వినిపిస్తోంది. తాజాగా గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు కూడా జానారెడ్డి కుటుంబంలో ఈ ఆలోచనను బలపరచేలా చేస్తోంది. దాదాపుగా రాజకీయ జీవితం తుదిదశకు చేరుకుంటున్న జానారెడ్డి... తనకన్నా తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించే అవకాశాలే హెచ్చు. తాను పార్టీ మారకుండా కుమారుడు మాత్రం కాషాయ పార్టీ లో జేరేందుకు అంగీకరించవచ్చు. అదే జరిగితే నాగార్జున సాగర్‌ మరో దుబ్బాక కాకుండా చూసుకోవడం తెరాసకు తలకు మించిన భారమే.