కారు మురిసె.. కమలం విరిసె...

TRS Wins GHMC Election but BJP Wins Battle for Hyderabad

దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు దాదాపుగా తెలిశాయి. ఓట్ల లెక్కింపు రోజైన శుక్రవారం సాయంత్రం 5.30గంటల వరకూ ఫలితాల సరళిని గమనిస్తే... 40స్థానాలకు కాస్త అటూ ఇటూగా భాజాపా, 70స్థానాలకు అటూ ఇటూగా తెరాస దక్కించుకోనున్నాయని తెలుస్తోంది.  ఏదైతేనేం... మొత్తం మీద ఈ ఎన్నికల్లో భాజాపా రెండవస్థానంలో నిలిచింది. ప్రతిపక్షమే కనపడకుండా పోయిన తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. 

వ్యూహాలు ఫలించి...ఊపిరి పీల్చుకున్న తెరాస...

ఈ ఫలితాలు అధికార పార్టీకి అద్భుతమైనవి అనకపోయినా...ఖచ్చితంగా ఊపిరిపీల్చుకునేలా చేసినవే అని చెప్పాలి. రాష్ట్రం మొత్తానికి కీలకమైన హైదరాబాద్‌లో ఓడిపోవడం అనేది ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమేనని చెప్పాలి. గ్రేటర్‌ పాలనా పగ్గాలు కోల్పోతే అది రేపటి పార్టీ పతనానికి తొలి మెట్టు అవుతుందనే స్పృహ తెరాసను సర్వశక్తులూ ఒడ్డేలా చేసింది. ఓ రకంగా దుబ్బాక ఓటమి ఆ పార్టీని బాగా అప్రమత్తం చేసిందనే చెప్పాలి. సిటింగ్‌ ఎమ్మెల్యే సీటును అది కూడా సానుభూతి పవనాలు సైతం పనిచేయకుండా తమ నుంచి భాజాపా లాక్కోవడంతో భాజాపా యుద్ధానికి సర్వసన్నధ్ధంగా ఉన్నట్టు తెరాసకు అర్ధమైంది. దాంతో గ్రేటర్‌ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. భాజాపా పూర్తిగా సన్నద్ధమయ్యేలోగా ఇంకా పాలనా వ్యవధి 3నెలలు ఉండగానే... ముందస్తుగా గ్రేటర్‌ ఎన్నికలకు పచ్చజెండా ఊపేసింది. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు కాబట్టి వెంటనే గ్రేటర్‌ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లదనే అంచనాలను తలకిందులు చేసింది. దీంతో అన్ని రకాలుగా బలమున్న అధికార పార్టీతో తలపడేందుకు సరిపడా సిద్ధమయ్యేందుకు విపక్షాలకు తగినంత వ్యవధి లేకుండా పోయింది. 

చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టి..నిలిచిన భాజాపా

గల్లీ ఎన్నికలవి...అంటూ కెటియార్‌ నిర్వచించిన గ్రేటర్‌ ఎన్నికల కోసం ఢిల్లీ స్థాయిలో పావులు కదిపిన భారతీయ జనతాపార్టీ గెలుపు దక్కకపోయినా అనుకున్నది సాధించగలిగింది. ఊపిరి పీల్చుకోనివ్వనంత వేగంగా అస్త్రాలను సంధించి తెరాసను ఉక్కిరిబిక్కిరి చేయడం, థీటైన పోటీ ఇవ్వడంతో పాటు మ్రిగిలిన ప్రతిపక్ష పార్టీలను పూర్తిగా కనుమరుగయ్యేలా చేసి ఏకైక ప్రత్యామ్నాయంగా మారడం అనే రెండు లక్ష్యాలను భాజాపా నెరవేర్చుకోగలిగింది. దుబ్బాక ఫలితం చూశాక భాజాపాలో ఉత్సాహం, నమ్మకం మరింత ఇనుమడించాయి. గ్రేటర్‌లో గత ఎన్నికల్లో నాలుగు స్థానాలకు పరిమితమైన పార్టీ ఇప్పుడు ఈ స్థాయి ఫలితాలు సాధించడానికి తొలి స్ఫూర్తి దుబ్బాకే నని చెప్పాలి. గ్రేటర్‌ నోటిఫికేషన్‌ వెలువడిన దగ్గర్నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తో మొదలుపెట్టి అతిరధ మహారధుల్ని సైతం ప్రచారానికి దించింది. బయటకు 80స్థానాలు గెలుస్తాం అని భాజాపా చెప్పినప్పటికీ... తెరాసను 80లోపు పరిమితం చేయాలని కనీసం 40 స్థానాలు దక్కించుకోవాలని అంతరంగికంగా లక్ష్యాలు నిర్ధేశ్యించుకుంది. మొత్తం మీద అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగింది. 

 


                    Advertise with us !!!