జిహెచ్ఎంసి ఓ ‘గ్రేట్’ పోలింగ్ స్టోరీ...

GHMC election voting percentage

ఉదయం 7గంటలకు పోలింగ్‌ బూత్‌లు తెరచుకున్నాయి. హోరెత్తిన ప్రచారం ధాటికి ఓటర్లు బారులు తీరడం తధ్యం అనుకున్నవారి అంచనాలు కొన్ని గంటల్లోనే కుప్పకూలాయి. నెలబ్రిటీలు వేలెత్తి చూపిస్తూ స్ఫూర్తిని అందించాలని చూసినా గ్రేటర్‌ ఓటర్‌ పోలింగ్‌ బూత్‌ వైపు దృష్టి సారించలేదు. మధ్యాహ్నం వరకూ పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్ల సంచారం అరకొరగానే కనపడింది. మధ్యాహ్నం తర్వాత పెరుగుతుందిలే అనుకున్నారు. అదీ జరగలేదు. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో  ఓటర్ల నిరాసక్తతపై పుంఖాను పుంఖాలుగా కధనాలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లో ఈ తరహా ఓటింగ్‌ క్షమార్హం కాదని, డిజిటల్‌ ఓటింగ్‌ నుంచి నిర్భంద ఓటింగ్‌ దాకా ఏవేవో చర్యలు చేపట్టాల్సిందేనని సోషల్‌ మీడియాలో నెటిజన్ల నుంచి విశ్లేషకుల దాకా చెబుతూ వచ్చారు. పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లో కేవలం 3.1 శాతమే ఓటింగ్ నమోదైంది. 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదు కాగా.. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 25.34 శాతం పోలింగ్ జరిగింది. 4 గంటల వరకు 29.76 శాతమే పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5గంటల వరకూ కూడా 36శాతం దాటకపోవడంతో... గ్రేటర్‌ చరిత్రలో అత్యల్ప పోలింగ్‌ శాతం జరిగిన ఎన్నికలుగా వీటిని దాదాపు అందరూ నిర్ధారించేశారు. 

పొద్దుపోతుండగా... పోటెత్తిందా?

అకస్మాత్తుగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య పలు ప్రాంతాల్లో కొన్ని పోలింగ్‌ బూత్‌ల దగ్గర జనం రద్దీ కాస్త పెరిగింది. దీంతో పూర్తి స్థాయి మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే పోలింగ్‌ శాతం ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.  తుది లెక్కలు తేలేటప్పటకి పోలింగ్‌ శాతాన్ని ఒకేసారి ఏకంగా 10శాతానికిపైగా పెంచింది. మొత్తం మీద జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 46.48శాతం వరకూ పోలింగ్‌ జరిగినట్టు ఎన్నికల కమిషన్‌ తేల్చింది. ఇప్పటిదాకా జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఇదే అత్యధికంగా ప్రకటించింది. దీంతో అప్పటిదాకా ఓటర్లను ఆడిపోసుకుంటూ కూర్చున్నవారికి దిమ్మ తిరిగింది.  పెరిగిన ఓట్ల శాతంతో తాము 100 స్థానాలు కైవం చేసుకుంటామని తెరాస నేతలు ధీమాగా చెబతుంటే... మరోవైపు అంచనాలకు అందకుండా పోలింగ్‌ పెరగడంతో ఇప్పుడు దీనిపై రకరకాల సందేహాలు రేగుతున్నాయి.

లెక్కలకందని ప్రకటనలు..

ఒక్కసారిగా పెరిగిన పోలింగ్‌ శాతం పట్ల పలు పార్టీలు దర్యాప్తును కోరుతామంటున్నాయి. పలు చోట్ల రిగ్గింగ్‌ జరిగినట్టు ఆరోపిస్తున్నాయి. వీరి ఆరోపణలకు ఆధారాలనూ చూపిస్తున్నాయి. సూరారం డివిజన్‌లో 6గంటల లోపు 43శాతం పోలింగ్‌ అంటూ ప్రకటించిన అదే అధికారి మరో ప్రకటనలో 56శాతంగా ప్రకటించారని... అంటూ ఇలాంటి పలు సోదాహరణలతో భాజాపా ఆరోపణలు గుప్పిస్తుస్తోంది. పోలింగ్‌ బూత్‌లలో ఆషా వర్కర్లు తదితర దిగువ స్థాయి మునిసిపల్‌ సిబ్బందిని నియమించారని అంటున్నారు. ఇదిలా ఉంటే అధికార పార్టీకేమీ తక్కువ కాకుండా కాచిగూడ తో పలు డివిజన్లలో భాజాపా శ్రేణులు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని వినిపిస్తోంది.  ఈ ఎన్నికల్లో మళ్లీ తీసుకొచ్చిన బ్యాలెట్‌ పద్ధతి కూడా రిగ్గింగ్‌కు దోహదం చేసిందంటున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత భారీ ఎత్తును ఓటింగ్ జరిగితే.. లైవ్ వెబ్ క్యాస్టింగ్‌లో ఓటర్లు కనిపించాల్సి ఉండగా.. అలా జరగలేదని.. బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో జరిగిన ఎన్నిక కావడంతో.. అవకతవకలకు ఆస్కారం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

‘పోలింగ్ పర్సంటేజ్ ఏక్‌దమ్ పెరిగింది’ అంటూ ఓ తెలుగు దినపత్రిక వెలువరించిన ఓ కథనాన్ని బీజేపీ నాయకురాలు డీకే అరుణ  ట్వీట్ చేశారు. ఐదు గంటల తర్వాత అనూహ్యంగా పోలింగ్ పెరిగిందని.. చాలా చోట్ల ఆ గంట వ్యవధిలోనే 12 నుంచి 18 శాతం వరకు పోలింగ్ నమోదైందని ఆ పత్రిక కథనాన్ని వెలువరించింది.  ఓటర్లు పెద్దగా క్యూలైన్లలో లేకున్నా.. సాయంత్రం వరకు పోలింగ్ బూత్‌లు ఖాళీగా దర్శనం ఇచ్చినా.. ఆరు గంటలు ముగిసే సరికి 46.6 శాతం పోలింగ్ నమోదైంది. చివరి గంటలో దాదాపు 9 శాతం పోలింగ్ జరగడంతో అవకతవకలు జరిగాయేమోనని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరగడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వ‌స్తున్నాయి. రేపు వెలువ‌డే ఫ‌లితాల త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదానిపై కొంత అవ‌గాహ‌న రావ‌చ్చు. అప్ప‌టిదాకా గ్రేట‌ర్ ఎన్నిక‌ల పోలింగ్ గ్రేట్ మిస్ట‌రీయే.