
ఆంధప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. అధికార పక్షం తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పీకర్ పోడియం ఎదుట నేలపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తుపాను పరిహారంపై చర్చలో టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు చేసిన ఆరోపణలపై సీఎం జగన్ సమాధానమిచ్చారు. దానిపై మాట్లాడేందుకు చంద్రబాబు యత్నించగా అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతూ టీడీపీ సభ్యులతో కలిసి స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని, రౌడీయిజం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సభలో టీడీపీ ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఆ పార్టీ చెందిన 12 మందిని సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, బెందాళం అశోక్, మంతెన రామారాజు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, వేగుల్ల జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఒకరోజు వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ ప్రకటించారు.