చలితో పెరుగుతున్న కరోనా

How coronavirus has spread across the world

అగ్ర రాజ్యం అమెరికా కరోనా ధాటికి మరోసారి చిరుగుటాకులా వణికిపోతుంది.  కరోనా ప్రారంభకాలంలో ఎంతోమందిని కోల్పోయిన అమెరికా మళ్ళీ కరోనా సెకండ్‍వేవ్‍లో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులు.. చలికాలం పెరగడంతో వైరస్‍కు మరింతగా విజృంభిస్తోందని దాని కారణంగా రోజు రోజుకు అమెరికాలో కేసుల తీవ్రత మరింత పెరుగుతోందని అంటున్నారు.  ప్రజలు మాస్కులు, భౌతికదూరం పాటించకుండా నిర్లక్ష్యపు ధోరణితో తిరుగుతుండటంతో రికార్డుస్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇంతకాలం కాస్త తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా తీవ్రత పెరగటంతో  వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అత్యధిక కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలు, జనసమూహిక ప్రాంతాలకే పరిమితమైన వైరస్‍.. తాజాగా ఇతర చోట్లకు కూడా విస్తరిస్తోందని దీనివల్ల అక్కడి ప్రాంతాల్లో కేసుల వ్యాప్తి త్వరగా జరిగేందుకు అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత కూడా దీనికి కారణమని చెబుతున్నారు.   

అమెరికాలో ప్రస్తుతం కరోనా సెకండ్‍ వేవ్‍ మొదలు కావడంతో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అమాంతం పెరిగింది. వైరస్‍ వల్ల ప్రతిరోజు అమెరికాలో వెయ్యి నుంచి రెండువేల మంది వరకు మరణిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో కోవిడ్‍ 19 వల్ల 2లక్షల 64వేల మందికిపైగా మరణించారు. రెండునెలల్లోనే 64వేల మంది మరణించగా.. రానున్న నెలరోజుల్లో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, అమెరికా మృత్యుదిబ్బగా మారబోతుందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నమోదవుతున్న కేసులు, మరణాల లెక్కలపై అమెరికా ప్రముఖ వైద్యుడు ఆంథోనీ ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విలయం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరినాటికి మరణాల సంఖ్య 3 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. జాగ్రత్తలు పాటించకపోతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు. కొలరాడో, ఇదాహో, ఇండియానా, మైనే, మిచిగాన్‍, మిన్నెసోటా, రోడ్‍ ఐలాండ్‍, వాషింగ్టన్‍ మరియు విస్కాన్సిన్‍ రాష్ట్రాలలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దక్షిణ డకోటా, అయోవా, మరియు వ్యోమింగ్‍ వంటి రాష్ట్రాల్లో కరోనా తిరిగి విజృంభిస్తోంది. ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్‍ మొదలైనట్లు హెల్త్ కేర్‍ వర్కర్లు అంటున్నారు. దక్షిణ డకోటాలో కరోనా పాజిటివ్‍ కేసుల సంఖ్య 50 శాతానికి చేరుకుంది. అయోవా మరియు వ్యోమింగ్‍ రాష్ట్రల్లో 40 శాతానికి చేరుకుంది.

టెక్సాస్‍లో రోజురోజుకు వేలసంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 90 రోజులలో ఈ సంఖ్య బాగా పెరిగింది. టెక్సాస్‍లో ఇప్పటివరకు నవంబర్‍ మూడవవారం వరకు దాదాపుగా 18,000 మంది మరణించారు. విస్కాన్సిన్‍ మరియు ఇల్లినాయిస్‍ రాష్ట్రాల్లో కూడా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  కరోనా కేసుల సంఖ్యను అరికట్టడానికి డెన్వర్‍లో కర్ఫ్యూ విధించాలని డెన్వర్‍ మేయర్‍ మైఖేల్‍ హాంకాక్‍ కార్యాలయం నిర్ణయించింది. సిటీలో కఠినమైన ఆంక్షలను విధించారు. మిగతా రాష్ట్రాల్లోని గవర్నర్లు కూడా కరోనా కట్టడికి చర్యలు చేపట్టారు.

థాంక్స్ గివింగ్‍తో పెరిగిన కేసులు

అమెరికాలో థాంక్స్ గివింగ్‍ వారం కావడంతో అందరికీ సెలవులు ప్రకటించారు. కరోనా సంక్షోభం కారణంగా  ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దంటూ ప్రభుత్వం సూచించింది. నవంబర్‍ చివరివారమైన థాంక్స్ గివింగ్‍ వారంలో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తారు. మార్కెట్లు కిటకిటలాడిపోతాయి. గతంలోలాగానే ప్రజలు సామూహికంగా రోడ్డుపై వస్తే కేసులు పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు నవంబర్‍ మూడవ వారం వరకు అమెరికాలో కోటి 30 లక్షల వరకు కేసులు నమోదైతే 2 లక్షల 60 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

థ్యాంక్స్ గివింగ్‍ సెలవులు రావడంతో చాలామంది వివిధ చోట్లకు తమవారితో ప్రయాణమయ్యారు. దాంతో గత కొద్ది రోజుల నుంచి ఎయిర్‍పోర్టులు నిండిపోయాయి. దీనివల్ల అమెరికాలో ఒక్కసారిగా కరోనా కేసులు, మరణాలు పెరిగిపోయాయి. లక్షలోపు ఉండే కేసులు ఇప్పుడు లక్షన్నర నుంచి రెండు లక్షలు దాటేస్తున్నాయి. మరోపక్క ఒకేరోజు కరోనా కారణంగా 2,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గడిచిన ఆరునెలల్లో ఒకే రోజు ఇంతమంది మరణించడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. అమెరికాలో ఏ ఎయిర్‍పోర్టులో చూసినా కిక్కిరిసిన జనాలు కనపడుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. థ్యాంక్స్ గివింగ్‍ను కుదిరినంత వరకు వర్చువల్‍గా జరుపుకోవాలని అధికారులు సూచిస్తూ వచ్చారు. కాని ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

న్యూయార్క్ లో ఆంక్షలు

న్యూయార్కు నగరంలో  కొవిడ్‍-19 మహమ్మారి ప్రబలుతున్న దృష్ట్యా ఇన్‍ డోర్‍, అవుట్‍ డోర్‍ సమావేశాల్లో 10 మందికి పరిమితం చేయాలని, రాత్రి 10 గంటలకు బార్‍లు, రెస్టారెంట్లు, జిమ్‍లు మూసివేయాలని గవర్నర్‍ ఆండ్రూ క్యూమో ఆదేశాలు జారీ చేశారు.

చికాగో సిటీలో

చికాగోలో కూడా కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని స్టే హోం అడ్వైజరీని జారీ చేశారు.  30 రోజులపాటు స్టే హోం అడ్వైజరీ అమలులో ఉంటుందని వెల్లడించారు. అత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి, స్కూల్‍, ఆఫీస్‍కి వెళ్లడానికి తప్ప పట్టణ ప్రజలు ఇంటి నుంచి బయటికి రావొద్దని అధికారులు  సూచించారు. సమావేశాలు, సోషల్‍ ఈవెంట్‍లలో సభ్యుల సంఖ్య 10 మందికి మించరాదని తెలిపారు. 

కాలిఫోర్నియాలో...

కాలిఫోర్నియాలో కోవిడ్‍ వైరస్‍ విజృంభించకుండా పరిమితంగా ఆంక్షలు విధిస్తున్నట్లు గవర్నర్‍ న్యూసమ్‍ ప్రకటించారు. అమెరికాలో వివిధ చోట్ల కరోనా వైరస్‍ బాగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ పబ్లిక్‍ హెల్త్ రాత్రిపూట ఆంక్షలను విధిస్తున్నట్లు తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు అత్యవసర పనులకు తప్ప ఎవరూ బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. నవంబర్‍ 21 నుంచి డిసెంబర్‍ 21 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. ఈ ఆదేశాల వల్ల కోవిడ్‍ కేసులు కట్టడి చేసేందుకు అవకాశాలు కలుగుతాయని అధికారులు పేర్కొన్నారు.

ఇలా మిగతా రాష్ట్రాల్లో కూడా పరిస్థితులను బట్టి ఆంక్షలను ఆయా రాష్ట్ర పాలనాధికారులు తీసుకుంటున్నారు.

భారత్‍లో

భారత్‍లో కరోనా తీవ్రత బాగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. చాలా దేశాల్లో కరోనా సెకండ్‍ వేవ్‍ మొదలైనట్లుగానే భారత్‍లో కూడా పాజిటివ్‍ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి పూట లాక్‍డౌన్‍, కర్ఫ్యూ విధిస్తున్నారు. దిల్లీలో కోవిడ్‍ కేసులు ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు వాడాలని నియమ నిబంధనలు విధిస్తున్నారు. అయినా ఢిల్లీ వరుస కేసులతో ఇబ్బందులు పడుతోంది. మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్‍, ఇతర రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై కోవిడ్‍పై నిర్లక్ష్యం ప్రదర్శించరాదంటూ హెచ్చరించారు. కోవిడ్‍ కట్టడికి తాజాగా మార్గదర్శకాలను కూడా కేంద్ర హోంశాఖ జారీ చేసింది. ఇలా ఎన్ని చేసినా ప్రజల్లో కరోనాపై ఉన్న నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రభుత్వం, వైద్య అధికారులు ఇచ్చిన సూచనలు పాటించకుండా కరోనా వైరస్‍ బారిన పడుతున్నారు. తాము పడటంతోపాటు ఇతరులకు కూడా అంటిస్తున్నారు.  కొంతమందికి ఈ వైరస్‍ ప్రాణాంతకమవుతోంది. మరికొందరిలో మామూలు జ్వరంలాగా వచ్చిపోతోంది. కాగా భారత్‍లో నవంబర్‍ చివరివారంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93 లక్షలు దాటింది. కొత్తగా 43,082 పాజిటివ్‍ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 93,09,788కి చేరింది. కొత్తగా 492 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,35,715గా నమోదైంది. ఇప్పటివరకు 87,18,517 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4,55,555 యాక్టివ్‍ కేసులున్నాయి.

తెలంగాణలో నవంబర్‍ చివరివారం వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. కొత్తగా నలుగురు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,448కి చేరింది. కొత్తగా 702 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,55,378కి చేరింది. ప్రస్తుతం 10,839 యాక్టివ్‍ కేసులున్నాయి. వాటిలో 8,651 మంది హోం ఐసోలేషన్‍లో ఉన్నారు. కాగా కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. టెస్టులు సరిగా చెయ్యట్లేదని మండిపడుతోంది. 

ఆంధప్రదేశ్‍లో నవంబర్‍ చివరివారం వరకు మొత్తం కేసుల సంఖ్య 8,66,438కి చేరింది. కొత్తగా ఆరుగురు కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 6,976కి చేరింది. మొత్తం రికవరీల సంఖ్య 8,47,325కి చేరింది. ప్రస్తుతం ఆంధప్రదేశ్‍లో 12,137 యాక్టివ్‍ కేసులున్నాయి.

 


                    Advertise with us !!!