
అన్నమాచార్యా భావనా వాహిని సంస్థాపకురాలు...ప్రముఖ గాయని శోభారాజు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ తన గానంతో పరవశింపజేస్తూ, భక్తిసంగీతం ద్వారాభావకాలుష్య నివారణ’(Eradication of Thought Pollution through Divine Music) అన్న నినాదంతో అన్నమాచార్య భావనావాహిని సంస్థని ఏర్పాటు చేసి వేలాదిమంది విద్యార్థులకు అన్నమయ్య కీర్తనలను నేర్పిస్తూ, వారి ద్వారా లోకక్షేమాన్ని కాంక్షిస్తున్న ‘పద్మశ్రీ’ డా. శోభారాజు ఎంతో అభినందనీయులు. అన్నమయ్య కీర్తనలు పాడటం మాత్రమే కాకుండా అందులోని తత్త్వాన్ని ఆకళింపు చేసుకొని, ఆచరిస్తూ, అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ, తనలాగా అందరూ పాడాలని ఆమె కోరుకుంటారు. 1983లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అన్నమాచార్య భావనా వాహిని ద్వారా స్వదేశంలోని విద్యార్థులతోపాటు, విదేశాల్లో ఉన్న విద్యార్థులకు, పెద్దలకు కూడా ఆమె అన్నమాచార్య కీర్తనలను నేర్పిస్తున్నారు.
1983 సంవత్సరం నవంబర్ 30వ తేదీన (శోభారాజు గారి జన్మదినం రోజున ) ఈ అన్నమాచార్య భావనా వాహిని ఏర్పాటైంది. అన్నమాచార్య కీర్తనలను ప్రచారం చేయడమనే బాధ్యతని తనకు భగవంతుడు అప్పగించారని గాఢంగా విశ్వసించే శోభారాజు అందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలను రూపొందించి తద్వారా కీర్తనలు ప్రచారం చేస్తున్నారు. ‘‘అన్నమయ్య కీర్తనలు పరమ మంత్రాలు. అవి మనిషిలోని భావకాలుష్యాన్ని హరించి వేస్తాయి’’ అని ఆమె ప్రబోధిస్తున్నారు.
మహానగర సంకీర్తన
మనిషిలోని చెడు ఆలోచనల మూలంగా పుట్టిన భావకాలుష్యాన్ని నివారించే ఉద్దేశ్యంతో నగర వీధులలో తిరుగుతూ అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తూ, అందరినీ భక్తి సంగీత మార్గంలో పయనింపజేయడానికి ఆమె కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నారు. అ.భా.వా. విద్యార్థులతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, అన్నమయ్య వేషధారణలో అ.భా.వా. విద్యార్థులు కనువిందు చేస్తారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్, వైజాగ్, ద్వారకా తిరుమల, ఇతరదేశాలలో న్యూయార్క్, బర్మింగ్‌హాం, దుబాయి.... లాంటి చోట్ల నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తి పొంది చాలా సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ మీద అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు ద్వారా అన్నమయ్య ప్రతిమను ప్రతిష్టింప చేయించారు. ఇప్పుడు ప్రతి ఏడు నగర సంకీర్తన ఆ అన్నమయ్య విగ్రహం వరకు నిర్వహించి అక్కడ కీర్తనాలాపనతో కార్యక్రమాన్ని ముగిస్తారు.
’సంకీర్తనాఔషధం’:
హాస్పిటల్ బాధితులకు అన్నమయ్య సంకీర్తనమనే ఔషధం ద్వారా స్వస్థత చేకూర్చే కార్యక్రమం ఇది. హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో తొలుత ఈ కార్యక్రమం నిర్వహించినపుడు ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు తదితరులు ప్రశంసించారు. అక్కడ ‘‘బ్రహ్మమొక్కటే...’’ కీర్తన పాడుతున్నపుడు అందరూ చప్పట్లు కొడుతుండగా ఒక పెరాలసిస్ పేషంట్ చప్పట్లు కొట్టడానికి చేతులు సహకరించక బాధపడుతుంటే శోభ గారు అది గమనించి హైపిచ్ లో ‘‘భళా తందనాన ..భళా తందనాన...’’అని పాడుతూ అతడిని మెల్లగా ప్రయత్నించనిచ్చి చివరకి అతడిచేత చప్పట్లు కొట్టించారు.
ఉపశమన సంకీర్తనం:
నిరాశ, ని స్పృహలతో జైళ్ళలో ఉన్న ఖైదీల ముందు అన్నమయ్య కీర్తనలు ఆలపించి వారి మనోవేదనకి ఉపశమనం అందించే వినూత్న ప్రయత్నం ఇది. హైదరాబాద్ లోని చంచల్‌గూడ లోని జైల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్కడున్న జైలర్ ‘‘ఈ ఖైదీల కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారు జాగ్రత్త’’ అని హెచ్చరించినా వెనుకాడకుండా వెళ్లి గానం చేశారు. ఖైదీలు చాలామంది వారు అంతకు ముందు విన్న అన్నమయ్య కీర్తనలు పాడించుకొని మరీ విని ఆనందించారు. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలలో చాలా సున్నితత్వం కనిపించడం గమనించాను. తద్వారా వారిలో నిగూఢంగా ఉన్న మంచితనం వెలికివస్తుంది అని శోభారాజు అంటారు.
వేసవి వెన్నెల
అందరికీ అన్నమయ్య కీర్తనలు దగ్గర చేయాలన్న సదుద్దేశంతో ప్రతి సంవత్సరం వేసవిలో కీర్తనలు నేర్పించే కార్యక్రమంను శోభారాజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల దగ్గరనుంచి, పెద్దవాళ్ళవరకు అందరికీ అన్నమయ్య కీర్తనలు నేర్పిస్తారు, వారి చేత పాడిస్తారు. అలాగే దేశవ్యాప్తంగా కీర్తనల పోటీలు నిర్వహించి వర్ధమాన,నూతన కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి మొదటి బహుమతిగా బంగారు పతకాలను అందజేస్తారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులుగా ఉన్న శ్రీకృష్ణ, దీపు వంటి గాయకులు అ.భా.వా సంస్థ విద్యార్థులే.
నాదబ్రహ్మోత్సవాలు
ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను ‘‘నాదబ్రహ్మోత్సవాల’’ పేరిట 9 రోజులపాటు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో ప్రతిరోజూ ఒక్కొక్క కళాకారులచేత అన్నమయ్య సంకీర్తనలతో నాదనీరాజనం చేయిస్తారు. ఈ ఉత్సవాలలో ప్రముఖ, వర్ధమాన సినీనేపధ్యగాయకులు, గాయనులు ఎంతోమంది భక్తిసంగీతంఆలపిస్తారు. ప్రతి రోజూ ఒక ప్రముఖ అతిథిని ఆహ్వానించి వారిచేత కళాకారులకు ఆశీర్వచనం అందిస్తారు. ప్రముఖుల హితవచనాలతో, కీర్తనలతో సభాప్రాంగణంలోఉన్న అందరిలో భక్తి భావం వెల్లివిరుస్తుంది.
అన్నమయ్య పోస్టల్ స్టాంప్
అన్నమయ్య చేసిన సేవను, అందించిన సాహిత్య సంపదను సమసమాజనిర్మాణం, శ్రేయస్సుకోసం ఆయన అందించిన కీర్తనలవైశిష్ట్యాన్ని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలకు వివరించి అన్నమయ్యపేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ తీసుకురావడానికి ఆమె ఎంతో కృషి చేశారు.
అన్నమయ్యసాహిత్యాన్ని, చేస్తున్న కార్యక్రమాలను వీలైనంతగా ప్రపంచానికి ప్రచారం చేయడానికి మొట్టమొదటి ఆధ్యాత్మిక వెబ్ సైట్ www.annamayya.org 2001వ సంవత్సరంలో అప్పటిముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. అన్నమయ్యని ప్రపంచానికి పరిచయంచేసే ఏ ప్రచారమాధ్యమాన్ని విడువకుండా నిరంతరం కృషిచేశారు. చేస్తున్నారు.
సంగీత శిక్షణ కార్యక్రమం
ఇప్పటిదాకా దాదాపు 16వేల మంది శోభారాజు దగ్గర అన్నమయ్య సంకీర్తనలు నేర్చుకున్నారు. ఇందులో విదేశీ చిన్నారులు, పెద్దలు కూడా ఉన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా కీర్తనలు నేర్చుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేలా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోర్సులను ఆమె ప్రవేశపెట్టారు.
స్వరసిద్ధి శ్రీ అన్నమాచార్య సహిత వేంకటేశ్వర స్వామి ఆలయం:
తన మనసులోని అన్నమయ్య, వేంకటేశ్వర స్వామి ప్రతిరూపాలకు గుర్తుగా, భక్తి, విశ్వాసాలను ప్రజలలో పెంపొందించే ఉద్దేశంతో సమాజ హితం కోసం అన్నమయ్యపురంలో శ్రీ స్వరసిద్ధి అన్నమయ్య సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కట్టించారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రియభక్తుడైన అన్నమయ్య, వేంకటేశ్వర స్వామి ఇద్దరూ ఒకే గర్భగుడిలో వెలసిఉన్నారు. ప్రపంచంలో వేరెక్కడా ఈ విధమైన కోవెల లేదు. వేంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు అన్నమయ్య కాబట్టి భక్తుల కోరికలను ఆయన తన స్వామికి నివేదించి త్వరగా అవి నెరవేరెట్టు చేస్తారని శోభ గారి విశ్వాసం.
‘అన్నమాచార్య కీర్తనలు మాత్రమే పాడుతాను. వాటి ప్రచారానికే నా జీవితం అంకితం అంటూ గాయని శ్రీమతి శోభారాజు చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది ప్రశంసలను పొందాయి. లాభాపేక్ష లేకుండా అన్నమాచార్య కీర్తనలను ఆమె ప్రచారం చేస్తున్నారు. ఎంతోమంది దాతలు ఆమె సేవకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అమెరికాలో ప్రచురితమవుతున్న తెలుగు టైమ్స్ కూడా శ్రీమతి శోభారాజు చేస్తున్న సేవలో పాలుపంచుకుంటూ వస్తోంది. ఆమె చేస్తున్న కార్యక్రమాలను తన పత్రికలో ప్రచురిస్తూ వస్తోంది. శ్రీమతి శోభారాజు మరింతగా తన కీర్తనల ద్వారా ప్రపంచంలో నెలకొన్న సంక్షోభాన్ని సమసిపోయేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాము.