ఎన్నికల గ్రేటర్.. ఎటువైపో సెటిలర్?

GHMC polls Andhraites hold key parties scramble for votes

తెలంగాణ రాజధాని నగరంలో మరోసారి సెటిలర్లు హాట్‌ టాపిక్‌గా మారారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో వీరి ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సంపూర్ణ మద్ధతు ప్రకటించిన సెటిలర్లు...ఈ దఫా ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. జంటనగరాల పరిధిలో దాదాపు 40శాతం పైగా సెటిలర్లు ఉంటారని అంచనా. అందులోనూ పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన వారే అధికం. నగరంలోని కుకట్‌పల్లి, యూసఫ్‌గూడ, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌... తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఆంధ్రులు నివసిస్తున్నారు. వీరు నివసించే వాటిలో అత్యధికం జిహెచ్‌ఎంసి పరిధిలోకి వచ్చేవే. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య 20శాతానికి పై మాటే. దీంతో గ్రేటర్‌ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వీరిని నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. 

వీరు తొలుత తెలుగుదేశం పార్టీకి,  కాంగ్రెస్‌ పార్టీకి దాదాపు సగం సగం ఓట్లిచ్చారు. ఆ తర్వాత పూర్తిగా టిఆర్‌ఎస్‌కి జై కొట్టారు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన వారు తెరాసకు మద్ధతు పలకడం అనేది అనూహ్యమే అనాలి. అయితే విభజన అనంతరం సమైక్యాంధ్ర వాదులు చెప్పినట్లు ఏ రకమైన సమస్యలూ తమకు రాకపోవడం, సెటిలర్ల భధ్రతకు పూర్తి భరోసా లభించడంతో వీరు నిస్సంకోచంగా తెరాసకు మద్ధతు పలికారు. గతం ఇలా ఉండగా... ముచ్చటగా మూడోసారి వీరు ఏ పార్టీ వైపు మళ్లుతారనేది విశ్లేషకుల అంచనాలకు అందడం లేదు.

ప్రస్తుతం గ్రేటర్‌లో సంప్రదాయ ఆంధ్ర పార్టీ అనేది ఒక్కటీ బలంగా కనపడడం లేదు. హైదరాబాద్‌ ని తమ అభివృద్ధి విజన్‌కి చిరునామాగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఈ సారి అన్ని డివిజన్లకూ అభ్యర్ధులను సైతం నిలపలేకపోయింది. ఇక మరో ఆంధ్రాపార్టీ వైసీపీ ఏకంగా పోటీలోనే లేదు. ఇదిగో పోటీ చేస్తా అదిగో పోటీ చేస్తా అంటూ ఊరించిన జనసేన కమలానికి జై కొట్టేసి సైలెంటయిపోయింది. కీలకమైన నేతల్లో అత్యధికులు పార్టీ మారడం, మరికొందరు అలకపాన్పు ఎక్కడం వంటి పరిణామాల నేపధ్యంలో ఈ సారి గ్రేటర్‌ ఎన్నికల పరంగా కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిగా వ్యూహాలు కొరవడ్డాయనే చెప్పాలి. అంతేకాకుండా విభజన కారక పార్టీగా ఇప్పటికీ ఆ పార్టీని సెటిలర్లు ఆదరించే పరిస్థితులు కనపడడం లేదు. 

మరి తమది అని చెప్పుకునే ఒక్కపార్టీ కూడా బరిలో లేని పరిస్థితుల్లో ఆంధ్రా సెటిలర్లు ఏ పార్టీతో జట్టు కడతారో అనే సందేహాల నడుమ గ్రేటర్‌లో దూకుడు మీదున్న పార్టీల వైపు నుంచి వీరిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు  జోరుగా సాగుతున్నాయి. తెరాస తరపున మంత్రి కెటియార్‌ తన ప్రసంగాల్లో ఈ మేరకు కొన్ని మాటలు తప్పకుండా జోడిస్తున్నారు. కేంద్రంలోని భాజాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని, హోదా ఇవ్వకుండా మోసం చేసిందని, రాజధాని నగర నిర్మాణానికి మొండి చెయ్యి చూపించిందని అంటూ ఆయన పరోక్షంగా ఆంధ్రుల సానుభూతి చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే చిరంజీవి, నాగార్జున వంటి టాలీవుడ్‌ హీరోల పరోక్ష మద్ధతు ఉందనే సంకేతాలు కూడా తెరాస పంపుతోంది. పోసాని, ప్రకాశ్‌రాజ్‌ వంటి పాప్యులర్‌ నటులతో తమ పార్టీ తరపున మాట్లాడేలా చేస్తూ..సెటిలర్లను మెప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

ఇక ఎప్పటిలానే ఎన్నికల వేళ ఎంఎఐం అనే బూచిని అడ్డం పెట్టుకుంటున్న భాజాపా... తమకు పవన్‌ మద్థతు లభించడం ద్వారా ఆ మేరకు సెటిలర్లలోని జనసేన పార్టీ అభిమానుల మద్ధతు అందుతుందని ఆశిస్తోంది. అలాగే సోము వీర్రాజు తదితరæ ఏపీ నేతలను జూబ్లీహిల్స్‌ తో పాటు పలు ప్రాంతాల్లో ప్రచారానికి దించింది. అంతేకాకుండా సెటిలర్లలోని తేదేపా సంప్రదాయ ఓటు బ్యాంకుని తమవైపు మళ్లించేందుకు లోపాయికారీ ఒప్పందాలు సైతం కుదుర్చుకుంటోంది. ఏ పార్టీ వ్యూహాలు వారు పన్నుతున్నప్పటికీ... సెటిలర్‌ ఏ వైపు అనేది మాత్రం ఈ సారి అంచనాలకు అందడం లేదు.